పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్నసినిమా ‘భీమ్లా నాయక్’. ఇందులో రానా దగ్గుబాటి డానియల్ శేఖర్ అనే పాత్రలో నటిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న ప్రకారం, ఫిబ్రవరి 25నే భీమ్లా నాయక్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాన్స్‌కు ముందుగానే ఈ విషయం చేరినట్లు సమాచారం. అభిమానులు ఈ సినిమా చూడటానికి ప్రీ బుకింగ్స్ చేసుకుంటున్నారు.
అయితే ఓ వీరాభిమాని భీమ్లానాయక్‌ను ముందుగా ఇతర అభిమానులతో కలిసి తెరపై చూడాలని అనుకున్నాడు. కుదరదని తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఆ అభిమాని వయసు 11 ఏళ్లు కావడమే. వివరాల్లోకి వెళితే జగిత్యాలలోని పురానీ పేటకు చెందిన ఓ బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని. స్నేహితులందరితో కలిసి భీమ్లా నాయక్ సినిమాను చూడాలనుకున్నాడు. అందుకు రూ.300 ఇవ్వాలని తండ్రిని అడిగాడు.
అయితే తండ్రి దినసరి కూలీ. మూడు వందల రూపాయలంటే వారికి భారమైన విషయమైంది. దీంతో తండ్రి బాలుడిని కాస్త టైం అడిగాడు. మీరెప్పుడూ ఇంతే అంటూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని, ఎంతకీ తలుపులు తీయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తలుపులు కొట్టిన.. తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ వారి కొడుకు బాల్కనీలో లుంగీతో ఉరి వేసుకుని చనిపోయి ఉండటానికి తల్లిదండ్రులు చూసి గుండెలవిసేలా ఏడిచారు. స్థానికులు సమాచారంతో పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. తన కొడుకు ఇలా చేస్తాడని అనుకోలేదని, ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు ఇలా దూరమవుతాడని అనుకోలేదంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.