Actors Sunil: కమెడియన్ గా కెరియర్ ప్రారంభించి తర్వాత హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి ప్రస్తుతం విలన్ గా తనదైన స్టైల్ లో దూసుకుపోతున్న నటుడు సునీల్. డిస్కో రాజాతో విలన్ గా మారిన సునీల్ తర్వాత కలర్ ఫోటో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. దీంతో సుకుమార్ ఏకంగా పుష్ప సినిమాలో మెయిన్ విలన్ గా సునీల్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సునీల్ కూడా పవర్ ఫుల్ పర్ఫామెన్స్ తో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అంతవరకు రెగ్యులర్ కమెడియన్ ని చూసిన తెలుగు ప్రేక్షకులు మొదటిసారి సునీల్ ను డిఫరెంట్ లుక్ లో చూసి షాక్ అయ్యారని చెప్పాలి.
ఇప్పుడు సునీల్ విలనజానికి తెలుగు దర్శకులు మాత్రమే కాకుండా తమిళ దర్శకులు కూడా పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోనే వరుసుగా కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలలో సునీల్ విలన్ గా నటించే ఛాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాలో సునీల్ మెయిన్ విలన్ గా కనిపిస్తున్నాడు. అలాగే పుష్ప2లో కూడా సునీల్ పాత్ర కొనసాగింపు ఉంటుంది. దీంతోపాటు కార్తీ హీరోగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ జపాన్ సినిమాలో సునీల్ విలన్ గా చేస్తున్నాడు.
శివ కార్తికేయన్ మవీరన్, విశాల్ మార్క్ ఆంటోనీ సినిమాలలో కూడా సునీల్ పవర్ ఫుల్ విలన్ గా నటిస్తూ ఉండడం విశేషం. వీటిలో జైలర్, మార్క్ ఆంటోనీ, పుష్ప 2 సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాల తర్వాత సునీల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయే అవకాశం ఉందనే మాట ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో వినిపిస్తుంది. ఏది ఏమైనా నటుడిగా సునీల్ ఇప్పుడు ఎవరు ఊహించని స్థాయిని అందుకోవడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.