ఏపీలో అధికార పార్టీ వైసీపీ సంక్షేమ పథకాల కోసం ఎక్కడ లేని నిధులన్నీ కూడా దారి మళ్ళిస్తుంది. కేంద్రం అభివృద్ధి కోసం ఇచ్చే నిధులని కూడా సంక్షేమ పథకాల పేరుతో అందరికి పంచిపెడుతుంది. అభివృద్ధికి మాత్రం ఉపయోగించడం లేదు. కార్పోరేషన్ నిధులని కూడా ఇప్పటికే దారి మళ్ళించి పథకాలకి వాడేసారు. పేరుకే కార్పోరేషన్స్ ఉన్నాయి తప్ప వాటితో ఆయా కులాల వారికి ఎలాంటి ప్రయోజనం అందడం లేదు. పంచాయితీల అభివృద్ధి కోసం కేంద్రం ప్రభుత్వం నేరుగా పంచాయితీ రాజ్ ద్వారా గ్రామాలకి నిధులు మంజూరు చేస్తుంది. వీటిపై చెక్ పవర్ సర్పంచ్ లకి ఉంటుంది. అయితే ఆ నిధులని కూడా పూర్తిగా దారి మళ్ళించి వైసీపీ సర్కార్ తన అవసరాలకి వాడేసుకుంది. దీనిపై చాలా కాలంగా సర్పంచ్ లు ఆందోళన చేస్తున్నారు. పంచాయితీకి రావాల్సిన నిధులని కూడా దారి మళ్లిస్తే అభివృద్ధి ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
అయితే వైసీపీ సర్పంచ్ లు మాత్రం ఏమీ అనలేక సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇక పంచాయితీ నిధులని దారి మళ్ళించడంపై విజయవాడ కేంద్రంలో అఖిలపక్షం పార్టీల సమావేశం జరిగింది. ఇందులో ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా పాల్గొన్నాయి. బీజేపీ నుంచి సోము వీర్రాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో పంచాయితీ నిధులని వైసీపీ ప్రభుత్వం దారి మల్లిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదని అఖిలపక్షం నాయకులు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయితీ నిధులని ఉపాధి హామీకోసం, గ్రామాలలో సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఇతర సానిటేషన్ పనుల కోసం సక్రమంగా ఉపయోగించే వారని ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు.
అయితే ఇప్పుడు పంచాయితీ నిధులని వైసీపీ ఇష్టారీతిలో వాడేసుకుంటూ సర్పంచ్ ల వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని విమర్శలు చేశారు. ఆర్ధిక సంఘం నిధులని కూడా వైసీపీ సర్కార్ వాడేసుకుంటుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సోము వీర్రాజు తెలిపారు. కేంద్రంలోని పెద్దలు జోక్యం చేసుకొని వైసీపీ ప్రభుత్వ దోపిడీని అరికట్టాలని సీపీఐ రామకృష్ణ, టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. సర్పంచ్ లు తమ పంచాయితీ నిధుల కోసం ఉద్యమం చేస్తే జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ విషయంలో అన్ని పార్టీలు కలిసి వైసీపీవైఖరిని ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళాలని వ్యాఖ్యానించారు.