నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ ఆదిస్థానంపై ఇప్పటికే పలుమార్లు విమర్శలు చేసి రెబల్ గా మారిపోయారు. ఈ నేపధ్యంలో అధిష్టానం కూడా ఆయన మీద అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించి పార్టీ పదవులని తొలగించింది. అలాగే ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన కనీస భద్రత కూడా ఇవ్వకుండా తీవ్ర అవమానాలకి గురి చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకి ఆనం రామనారాయణరెడ్డి దూరంగా ఉన్నారు. ఇక రెండు రోజుల క్రితం నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనపై అధికార పార్టీ వైసీపీ నిఘా పెట్టిందని, ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ కారణంగా తాను ఇంకో ఫోన్ ని ఉపయోగిస్తున్నా అని తెలిపారు. తనని తీవ్రంగా వేధిస్తున్నారని, అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఇలా హింసిస్తున్నారని ఆరోపణలు చేశారు.
ఇక త్వరలో పార్టీ మారే ఆలోచనలో కూడా ఉన్నట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఆనం రామనారాయణరెడ్డి కూడా అధికార పార్టీ తన ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని, ఈ కారణంగా కుటుంబంతో కూడా వాట్సాప్ కాల్స్ లో మాట్లాడాల్సి వస్తుందని మీడియా ముందుకి వచ్చి చెప్పారు. అధికార పార్టీ ఫోన్ ట్యాప్ చేసి వేధింపులకి గురి చేస్తే తాను ఎవరితో చెప్పుకోవాలి అంటూ ప్రశ్నించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తులు అధికారం చలాయిస్తున్నాయని విమర్శించారు. తనకున్న భద్రత మొత్తం తొలగించమని కోరడం జరిగిందని కూడా తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం పనితీరుపై ప్రజలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఇంకా ఎన్నికలకి సమయం ఉంది కాబట్టి ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనేది చూడాలని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయడం వంటి పోకడలు గతంలో ఎప్పుడూ లేవని, ఇప్పుడు వైసీపీలో ఇలాంటి సంస్కృతి చూస్తున్నా అని అన్నారు. అలాగే తనని చంపడానికి కూడా కుట్ర జరుగుతుందని, తనకి ప్రాణహాని అయితే ఉందని చెప్పారు. అలాగే ఏ ఒక్కరి దయాదాక్షిణ్యాలతో తాను రాజకీయంగా ఆధారపడి లేనని కూడా వైఎస్ జగన్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వీటిపై వైసీపీ సోషల్ మీడియా టీమ్ ఏ విధంగా ఎటాక్ చేస్తుందనేది చూడాలి.