Anushka : సైజ్ జీరో సినిమాతో స్టార్ హీరో అనుష్క ఎంత బొద్దుగా తయారైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తరువాత ఆమె బరువు తగ్గేందుకు చాలా సమయం పట్టింది. అసలు ‘బాహుబలి 2’ విడుదల ఆలస్యం కావడానికి కూడా అనుష్కే కారణమని టాక్ కూడా నడిచింది. ఎంతకీ ఆమె బరువు తగ్గకపోవడంతో సినిమా చాలా ఆలస్యమైందని పుకార్లు షికారు చేశాయి. బాహుబలి 1లో ముద్దుగుమ్మగా కనిపించిన అనుష్క.. పార్ట్ 2లో బొద్దుగుమ్మలా కనిపించింది. దీంతో అమ్మడిపై కామెంట్స్ వెల్లువెత్తాయి. ఆ తరువాత అనుష్క స్థానంలో ఎవరైనా ఉంటే.. తిరిగి ఇలాంటి సినిమాలను యాక్సెప్ట్ చేసి బరువు పెరిగేందుకు యత్నించరు కాక యత్నించరు. కానీ అనుష్క మాత్రం మరోమారు బరువు పెరిగేందుకు ట్రై చేస్తోందని టాక్.
Anushka : అందుకే సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయడం లేదట..
సుమారు రెండేళ్ల బ్రేక్ తర్వాత అనుష్క వెండితెరపై మెరవబోతోంది. నవీన్ పొలిశెట్టి హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఓ విభిన్న కుటుంబ కథా చిత్రంలో ఆమె నటిస్తోంది. మహేశ్.పి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘సైజ్ జీరో’ చిత్రంలో మాదిరిగా దీనిలోనూ అనుష్క కాస్త బొద్దుగా కనిపించబోతోందని టాక్. ఈ సినిమా కథకు అనుగుణంగా దర్శకుడు మహేష్ చెప్పడంతో ఆమె బరువు పెరిగే పనిలో పడిందట. అందుకే సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేయడం లేదని పలు ఆంగ్ల పత్రికలు కథనాలు వెలువరిస్తున్నాయి.
కెరీర్ ఆరంభం నుంచి నాజూగ్గా.. ముద్దుగుమ్మలా కనిపించిన అనుష్క 2015లో ‘సైజ్ జీరో’ సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. బొద్దుగా ఉండే మహిళలు సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారు? అనే కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం స్వీటీ సుమారు 20 కేజీల బరువు పెరిగింది. కానీ తగ్గడానికి ఆమెకు చాలా కాలమే పట్టింది. ఒకరకంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా తొలినాళ్లలో ఉన్నంత నాజూగ్గా మాత్రం తయారవలేదని విమర్శలున్నాయి. మళ్లీ స్వీటీ బరువు పెరగబోతోందన్న వార్తలు చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అస్సలు బరువు పెరిగే సాహసం చేయవద్దని సూచిస్తున్నారు.