Bigboss Telugu 6 : బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి.. రేటింగ్స్ సునామీ సృష్టించిన షో ‘బిగ్‌బాస్’. ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లు ముగించుకుని ఆరో సీజన్‌లోకి అడుగు పెట్టబోతోంది. ఐదవ సీజన్ హాట్ స్టార్‌లో ప్రసారమవడంతో అంతా దీనిని వీక్షించలేకపోయారు. దీంతో ఆరవ సీజన్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే లోగో రిలీజ్ చేసిన యాజమాన్యం తాజాగా ప్రోమోను వదిలింది. ఇది అదిరిపోయింది. చాలా క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. పెళ్లి వేడుకను తీసుకుని ‘బిగ్‌బాస్’పై ఎంత ఆసక్తిని ప్రేక్షకులు చూపిస్తున్నారనేది చెప్పేశారు. చాలా గ్రాండ్‌గా డిజైన్ చేసిన ఈ వీడియో వ్యూస్‌లో దూసుకుపోతోంది.
6వ సీజన్ త్వరలోనే ప్రసారం కానుందనే సంకేతాన్ని ప్రోమో ద్వారా ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా కింగ్ నాగార్జున ఈ ప్రోమోను విడుదల చేశారు. పెళ్లి అప్పగింతల సమయంలో నవ వధువు కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది. ఆమెను ఓదారుస్తున్న తల్లిదండ్రులు షో టైమ్ అయ్యిందంటూ అకస్మాత్తుగా మాయమైపోతారు. వారు ఏమయ్యారో అని పెళ్లికూతురు అన్వేషించే క్రమంలో నాగార్జున ఎంట్రీ ఇస్తారు. అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అని బాగ్‌బాస్‌ని ఉద్దేశించి నాగ్ సమాధానం ఇచ్చే సన్నివేశాలతో ప్రోమో ఆసక్తిగా సాగింది.
Bigboss Telugu 6 : సెప్టెంబర్ 4న స్ట్రీమింగ్ కానుందట..
‘లైఫ్‌లో ఏదైనా బిగ్‌బాస్ తర్వాతే. బిగ్‌బాస్ సీజన్ 6.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్’ అంటూ నాగార్జున తనదైన శైలిలో చెప్పి నాగ్ ఆకట్టుకున్నారు. ప్రోమోతో పాటు ప్రోమోలో నాగ్ లుక్, గెటప్ అదిరిపోయింది. ఈ రియాలిటీ షో ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లోనూ స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 4న ఈ షో స్ట్రీమింగ్ కానుందని టాక్. ఇక ఈ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లకు సంబంధించి కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. వారిలో.. యాంకర్ మంజూష, హీరోయిన్ ఆశా శైనీ, హీరో ఆకాష్, ట్రాన్స్‌జెండర్ తన్మయి, యాంకర్ పద్మిని, ఆర్టిస్ట్ సంజనా చౌదరి, యూట్యూబ్ ఆర్టిస్ట్ కుషిత, హీరో భరత్, సీరియల్ యాక్టర్ కౌశిక్, హీరో సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రీతి ఆష్రానీ, బుల్లితెర నటుడు అమరదీప్, సిరి హన్మంతు బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా బిగ్‌బాస్‌లో సందడి చేయనున్నారని సమాచారం.