BJP: ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే ఎన్టీఆర్ అనే బ్రాండ్ తెలుగు రాజకీయాలలో బలంగా జనాల్లోకి వెళ్లిపోయింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అయిన కూడా ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీని బలంగా జనాలలోకి తీసుకెళ్లి నడిపిస్తున్నారు. తన పైన ఉన్న విమర్శలను కూడా ఆయన బలంగా ఎదుర్కొంటూ ఇప్పటికీ మూడుసార్లు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ వైసీపీ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు అంటూ పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ విమర్శలను తెలుగుదేశం పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కూడా ముఖ్యమంత్రి జగన్ మార్చేశారు. అయితే ఏపీ రాజకీయాలలో బలంగా వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ ఇప్పుడు ఉన్నట్టుండి ఎన్టీఆర్ పేరు స్మరించడం మొదలుపెట్టింది అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. నిజానికి బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో చాలా వైరం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో మళ్ళీ పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని ఇప్పటికే ఏపీలో బీజేపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్రంలో మోడీ సర్కారు మాత్రం ఎన్టీఆర్ పేరుతో రాజకీయాలు మొదలుపెట్టింది అనే మాట వినిపిస్తుంది.
కొద్ది రోజులు క్రితం ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో ఎన్టీఆర్ పేరుని ఆరుసార్లు ఉచ్చరించారు. ఎన్టీఆర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తే కాంగ్రెస్ పార్టీ అతనికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిందని విమర్శలు చేశారు. వెన్నుపోటు రాజకీయాలు కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ శతజయంతోత్సవాల వేళ తారక రాముడు ఫోటోతో 100 రూపాయల వెండి నాణాన్ని మోడీ సర్కార్ ముద్రించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం ఇప్పటికీ దగ్గుబాటి పురంధరేశ్వరి ఢిల్లీలో కేంద్ర పెద్దలతో చర్చించడంతోపాటు రిజర్వ్ బ్యాంక్ అధికారులని కలవడం జరిగింది. పురందరేశ్వరి అభ్యర్థన మేరకే ఈ వెండి నాణెం ముద్రిస్తున్నట్లు మోడీ సర్కార్ చెబుతోంది. ఇక దీని ద్వారా ఏపీలో ప్రజలకు చేరువు కావడానికి మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని మోడీ సర్కార్ ఆలోచిస్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.