BJP: ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ అస్త్రాలని సిద్ధం చేస్తుంది. వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి మూడో ప్రత్యామ్నాయంగా ప్రజలలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగా ఇప్పటికే బీజేపీ, జనసేన కలిసి వ్యూహాత్మకంగా రెండు పార్టీలని దెబ్బతీసే విధంగా ముందుకి వెళ్తున్నట్లుగా రాజకీయ వర్గాలలో ఇప్పుడు వినిపిస్తుంది. వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పడం ద్వారా టీడీపీతో పొత్తు పెట్టుకుంటా అనే సంకేతాలని పవన్ కళ్యాణ్ పరోక్షంగా ఇచ్చినట్లు అయ్యింది. దీనిని వైసీపీ ఆయుధంగా వాడుకుంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలతో దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే జనసేనాని మాత్రం తన దగ్గర మూడు ఆప్షన్స్ ఉన్నాయి అంటూ మరో ట్రాప్ వేసి అందులో టీడీపీ, వైసీపీని లాగేశారు.
ఇందులో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎలా ఉంటుందో అర్ధం కాక రెండు పార్టీలు కన్ఫ్యూజన్ లో కొట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ పొత్తులతో వెళ్తే టీడీపీకి అది ఉపయోగపడుతుంది. ఆ కూటమి గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే తాము అధికారంలోకి వస్తామని వైసీపీ భావిస్తుంది. ఇంచుమించు టీడీపీకి కూడా ఇదే అభిప్రాయం ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ ని ఎలా అయిన దగ్గర చేసుకోవాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. అయితే బీజేపీ, పవన్ కళ్యాణ్ ఎత్తులు మరో రకంగా ఉన్నాయనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విశాఖలో మోడీని కలిసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్నాయి.
వైఎస్ వివేకానంద హత్యకేసులో సీబీఐ విచారణ వేగవంతం అయ్యింది. మరో వైపు రెగ్యులర్ గా కేంద్ర మంత్రులు ఏపీకి వచ్చి వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. వైఫల్యాలని ఎండగడుతున్నారు. కేంద్రం ఏపీకి ఎన్ని నిధులు ఇస్తుంది చెబుతున్నారు. మరో వైపు తాజాగా గవర్నర్ ని ఉన్నపళంగా మార్చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించింది. ఇవన్ని కూడా వైసీపీకి ప్రతికూలంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో కేంద్ర మంత్రి దేవ్ సింహ్ చౌహాన్ కర్నూలు పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని వైసీపీ రోడ్డున పడేసిందని అన్నారు. అలాగే వారికి ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో వైసీపీ సర్కార్ ఉందని అన్నారు. లిక్కర్ మీదనే వైసీపీ ప్రభుత్వాన్ని నడిపిస్తుందని అన్నారు. ఇక వాలంటీర్లు కూడా ప్రతిపక్ష నాయకులని భయపెట్టే స్థాయికి వచ్చారని విమర్శలు గుప్పించారు. ఇప్పటికే పలువురు మంత్రులు ఏపీ వచ్చిన ప్రతిసారి వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరో కేంద్ర మంత్రి కూడా ఇలాగే విమర్శలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.