Bollywood : స్టార్ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీ రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ ప్రేమ పక్షులు ఇద్దరూ కొన్ని సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. వారి హిట్ చిత్రం షేర్షాలో కలిసి నటించారు. సూర్యగఢ్ ప్యాలెస్‌లో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు మూడుముళ్ళ బందంతో ఒకటయ్యారు. ఈ విషయాన్ని స్టార్స్ ఇద్దరూ తమ సోషల్ మీడియా పేజీలలో తమ వివాహానికి సంబంధించిన పిక్స్ ను పంచుకున్నారు. సిద్దార్ధ్ మల్హోత్రా పెళ్లి పిక్స్‌ను పోస్ట్ చేసి అబ్ హుమారీ పర్మనెంట్ బుకింగ్ హోగయీ హై , మా ఈ కొత్త ప్రయాణంలో మీ ఆశీర్వాదాలు, ప్రేమను కోరుతున్నాము అని క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. నెట్టింట్లో వెడ్డింగ్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

పెళ్లి కోసం కియారా అద్వానీ పింక్ లెహంగా సెట్‌ను ధరించింది, దీనిని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.ఈ లెహంగా సెట్‌కు కాంట్రాస్ట్ గా కియారా తన మెడలో భారీ నెక్ పీస్‌ను ధరించింది, నెక్‌లెస్‌కు మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్స్‌ను తన చెవులకు అలంకరించుకుంది. నుదుటన పాపిటబిల్ల, చేతికి గాజులు వేసుకుని పెళ్లికూతురు లుక్ లో ఎంతో అద్భుతంగా కనిపించింది కియారా. ఇక నూతన వరుడు సిద్ధార్థ్ అందమైన లైట్ గోధుమ రంగు హెవీ షేర్వాణిని ధరించాడు. వీరిద్దరూ పోస్ట్ చేసిన పిక్స్ ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. కియారా చెంపపై సిద్దార్ధ్ ముద్దుపెట్టుకునే పిక్ హైలెట్ గా నిలుస్తోంది. జంట సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

సిద్ధార్థ్ మల్హోత్రా , కియారా అద్వానీల మెహందీ , సంగీత్ వేడుకలు సోమవారం జరిగాయి. వారి వివాహానికి ముందు ఉత్సవాలు స్వాగత భోజనంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సోమవారం సాయంత్రం గ్రాండ్ సంగీత్ ను నిర్వహించారు. అయితే పెళ్లి వేడుకలకు సంబంధించిన ఎలాంటి పిక్స్, విజువల్స్ లీక్ అవ్వకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఫోటో గ్రాఫర్లు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. అందుకే వారి వివాహ పిక్ ఈ స్టార్స్ పోస్ట్ చేసే వరకు బయటికి రాలేదు.

కియారా , సిద్దార్ధ్ వివాహానికి వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు , పరిశ్రమలోని అతికొద్దిమంది సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. కరణ్ జోహార్, మనీష్, షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్, జూహీ చావ్లా వంటి ప్రముఖులు వివాహానికి వెళ్లేందుకు విమానాశ్రయానికి చేరుకున్న పిక్స్ సోషల్ మీడియాలో ఫోటోగ్రాఫర్లు పోస్ట్ చేశారు.

గత కొన్నేళ్లుగా కియారా , సిద్ధార్థ్ రహస్యంగా డేటింగ్ చేశారు. వారి రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఎప్పుడూ బహిరంగంగా ధృవీకరించలేదు. కానీ మీడియాలో వీరి లవ్ స్టోరీకి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. వీరిద్దరూ నటించిన చిత్రం షేర్షా నిర్మాణంలో వారు ప్రేమలో పడ్డారని అందరూ నమ్ముతారు.