ఏపీలో ప్రభుత్వ భవనాలని వైసీపీ పార్టీ రంగులతో నింపేస్తూ ఉంటారు. గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, అలాగే ఆర్బీకేలు అన్ని కూడా వైసీపీ జెండా రంగులలోనే దర్శనం ఇస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల కొత్తగా కడుతున్న స్కూల్ భవనాలకి కూడా పార్టీ రంగులు వేసేశారు. పార్టీ రంగుల కోసమే వైసీపీ ప్రభుత్వం కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తుంది. ఇలా ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేయడంపై మూడేళ్ళ క్రితమే హైకోర్టు వైసీపీ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. ప్రభుత్వ కార్యాలయానికి పార్టీ రంగులు వేసి రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నం చేయవద్దని చెప్పింది. అయితే అప్పట్లో కొంత సైలెంట్ అయిన వైసీపీ ప్రభుత్వం మరల యధావిధిగా తన పంథా కొనసాగిస్తూనే ఉంది. మరో వైపు కేంద్రం ఇచ్చే నిధులతో ఇక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నా కూడా ఎక్కడా మోడీ బొమ్మ ఉపయోగించడం లేదు.
కేంద్రం అమలు చేసే పథకాలకి తమ పేర్లు తగిలించుకొని వాటిని తామే అమలు చేస్తున్న పథకాల మాదిరిగా కలరింగ్ ఇస్తుందనేది బీజేపీ నేతలు తరుచుగా చేసే విమర్శలు. బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా ఉండదు. మోడీ బొమ్మ కనిపిస్తే మళ్ళీ తెలిసిపోతుండానే ఉద్దేశ్యంతో అసలు కేంద్రం ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తూ ఉంటారు అనేది రాజకీయ వర్గాలలో వినిపించే మాట. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ విజయవాడలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్య కేంద్రంపై సీఎం జగన్ రెడ్డి ఫోటోలు, పార్టీ రంగులు ఉండటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తూ వైసీపీ పార్టీ రంగులు, ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఫొటోను, కేంద్ర ప్రభుత్వ చిహ్నాలను ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. పర్యటనకి వచ్చినపుడు మాత్రమే నామమాత్రంగా బ్యానర్లు కట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దని విమర్శించారు. వీటిపై కేంద్రానికి నివేదిక ఇచ్చి విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. పార్టీ ఆఫీస్ కి రంగులు వేసినట్లుగా ప్రభుత్వం భవనాలకి ఎలా వేస్తారని ప్రశ్నించారు. అయితే కేంద్రమంత్రి అడిగే ప్రశ్నలకి ప్రభుత్వ అధికారుల దగ్గర సమాధానం లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు.