ఏపీ రాజకీయాల్లో రోజురోజుకీ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అధికార పార్టీ వైసీపీ మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అన్ని రకాల వ్యూహాలను సిద్దం చేస్తోంది. ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోకుండా బలంగా ప్రజలను ప్రభావితం చేయడానికి బూత్ స్థాయిలో కార్యకర్తలను సన్నద్ధం చేస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియా విస్తృతంగా ఉపయోగించుకొని ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేస్తూ యువతను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. వైయస్ జగన్ కి ప్రధాన బలం రాయలసీమ జిల్లాలు. ఉమ్మడి రాయలసీమ నాలుగు జిల్లాల్లో 52 సీట్లకు గాను 49 స్థానాల్లో గత ఎన్నికల్లో వైసీపీ సొంతం చేసుకుంది.
కడప, కర్నూలు జిల్లాలు వైసీపీ స్వీప్ చేసింది. కుప్పం, హిందూపురం, ఉరవకొండ మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే ఈసారి మాత్రం రాయలసీమలో జగన్ రెడ్డికి గట్టిగా స్ట్రోక్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఓ వైపు కుప్పంలో చంద్రబాబును ఓడించాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కుప్పం స్థానాన్ని నిలుపుకోవడం తోపాటు రాయలసీమలో అన్ని జిల్లాల్లో కచ్చితంగా ప్రభావితం చేసే స్థానాలను సొంతం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు వీలైనంత ఎక్కువసార్లు రాయలసీమ జిల్లాల్లో పర్యటించడం ద్వారా కేడర్ కి చైతన్యం తీసుకోవడంతో పాటు తమ నాయకుల బలాలను కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం, తాడిపత్రి, రాప్తాడ కళ్యాణ్ దుర్గం, పెనుకొండ, పలమనేరు, చిత్తూరు, నగరి, రాయదుర్గం, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలలో గట్టిపట్టున్న నాయకులను రంగంలోకి దించుతున్నారు.
వీటిలో కొన్ని చోట్ల గతంలో టీడీపీ గెలిచిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమ జిల్లాలో మరోసారి బలమైన సామాజిక సమీకరణాలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అంతే జగన్మోహన్ రెడ్డికి తన సామాజిక వర్గం బలం రాయలసీమ పుష్కలంగా ఉంది. దాంతోపాటు మైనారిటీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఓటు బ్యాంక్ ఉంది. అయితే మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను ప్రభావితం చేయగలిగితే కచ్చితంగా జగన్ రాయలసీమలో పరాభవాన్ని చూసే అవకాశం ఉంది. ఆ దిశగా చంద్రబాబు నాయుడు ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయంతో ముందుకు వెళ్తారు అన్నది ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.