Chandrababu: ఏపీలో అధికార వైసీపీకి గత కొంతకాలంగా కంటిమీద కునుకు లేకుండా పోయిందనే మాట ఇప్పుడు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. దీనికి కారణం టీడీపీ అధినేత చంద్రబాబు వేస్తున్న వ్యూహాత్మక ఎత్తులలో వైసీపీ ఇరుక్కుందనే టాక్ నడుస్తుంది. మొన్నటి వరకు రాబోయే ఎన్నికలలో కచ్చితంగా 175 స్థానాలలో గెలవడమే లక్ష్యం అంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఇప్పుడు కనీసం అధికారంలో వచ్చే స్థాయిలో గెలుపు వచ్చిన చాలానే భావన ఉందనే మాట రాజకీయవర్గాలలో నడుస్తుంది. గత కొంత కాలంగా చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైలెంట్ గా ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు.
నారా లోకేష్ ని రోడ్డు మీదకి పాదయాత్ర పేరుతో పంపించారు. మీడియా ఫోకస్ అంతా అటువైపే ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు తన రాజకీయ చతురతని ప్రదర్శిస్తూ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో `అసంతృప్తులని లక్ష్యంగా చేసుకొని బాణాలు వేస్తున్నారు. దీంతో ఇంతకాలంగా అధికారంలో ఉండటంతో వైసీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకి వస్తున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో ఇప్పటికే వైసీపీలో చిచ్చు రేగింది. ఇది కచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంటుంది అని భావిస్తున్నారు.

మరో కొద్ది నెలల్లో అధికార పార్టీలో మరింత అలజడి మొదలవుతుంది అనే మాట వినిపిస్తుంది. శ్రీకాకుళం నుంచి రాయలసీమలో కడప వరకు కనీసం 100 నియోజకవర్గాలలో వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉంది. వారందరూ కూడా చాలా కారణాలతో జగన్ పై కోపంతో ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు నుంచి కోటంరెడ్డి, ఆనం బయటకి రావడంతో జరిగిన పరిణామాలు ఏంటి అనేది తెలిసిందే. జగన్ రెడ్డి ఇప్పుడు తన కార్యవర్గంతో రెగ్యులర్ గా చర్చలు నడుపుతూ పార్టీలో ఉన్న అసంతృప్తులని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారు. అయినా కూడా జగన్ ని కలిసి వచ్చిన వెంటనే వారు ఏదో ఒక రకంగా వైసీపీని ఇరుకున పెట్టి బయటకి వచ్చేయాలని భావిస్తున్నారు. అయితే ముందుగా అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులని అందరిని బయటకి లాగి తరువాత తన గేమ్ ని మరింత పక్కాగా అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే సొంత పార్టీలో ఎమ్మెల్యేల అసమ్మతితో జగన్ కి నిద్ర పట్టడం లేదనే మాట వినిపిస్తుంది.