Chandrababu: ఏపీ రాజకీయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి అంచనాలు వారు వేసుకొని రాజకీయ వ్యూహాలతో ప్రజలలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ గ్రామ సారథులతో గ్రామ స్థాయి నుంచి సంక్షేమ పథకాలపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ జగన్ రెడ్డి అందిస్తున్న పథకాలతో ఎవరు ఏ స్థాయిలో లబ్ది పొందుతున్నారు అనే విషయాలని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు టీడీపీ నుంచి నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉండగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్ధులని ఖరారు చేసుకునే పనిలో పడ్డారు. మీడియా ఫోకస్ అంతా లోకేష్ పాదయాత్ర వైపు మళ్ళించి, సైలెంట్ గా తన కార్యాచరణని అమలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

ఇదిలా ఉంటే నియోజకవరగాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు బలమైన నాయకులని ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ఖరారు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నియోజకవర్గ జోనల్ సమావేశాలపై కార్యవర్గంతో చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము జగన్ రెడ్డిలా 175 సీట్లు వచ్చేస్తాయని సాధ్యం కాని మాటలు చెప్పమని పేర్కొన్నారు. తమ బలం ఏంటి అనేది తమకి స్పష్టత ఉందని అన్నారు. కచ్చితంగా రాబోయే ఎన్నికలలో టీడీపీ 160 స్థానాలలో గెలిచితీరుతుందని పేర్కొన్నారు. ఎలా పోటీ చేసిన తమ గెలుపుని, జగన్ రెడ్డి ఓటమిని ఎవరూ ఈ సారి ఆపలేరని అన్నారు.
అలాగే ఎప్పుడైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా కూడా టీడీపీ క్యాడర్ అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కచ్చితంగా ముందస్తు ఎన్నికలు జరగడానికి ఛాన్స్ ఉందని చంద్రబాబు చెప్పడం విశేషం. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పైన కూడా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఈ నెల 21 నుంచి జోనర్ సమావేశాలు నిర్వహించడానికి చంద్రబాబు సిద్ధం అవుతున్నారు. 35 నియోజకవర్గాలని ఒక జోనల్ గా మార్చి నియోజకవర్గ ఇన్ చార్జ్ లతో చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశాలలో అభ్యర్ధులని కూడా ఖరారు చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.