దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రులలో స్వర్గీయ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉంటే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి వరస్ట్ సీఎంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన ఈ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్టీఆర్ పాలనలో ఏపీలో స్వర్ణ యుగం నడిచిందని అన్నారు. ప్రజల కోసం రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని తీసుకురావడం అనేది విప్లవాత్మకమైన మార్పు అని పేర్కొన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. అలాగే మహిళలకు ఆస్తి హక్కు అనేది ఎన్టీఆర్ ఆలోచనలో భాగమే అని తెలిపారు.
ఎన్టీఆర్ ఆలోచనలు ఆశయాలతో పుట్టిన తెలుగుదేశం పార్టీని అదే నమ్మకంతో తాను నడిపిస్తున్నానని చంద్రబాబునాయుడు తెలియజేశారు. అయితే జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ప్రజా సంక్షేమం, అభివృద్ధి అనేది పూర్తిగా కుంటు పడ్డాయని విమర్శించారు. ప్రశ్నించే ప్రతిపక్షాలపై దాడులు చేస్తూ అరాచకమైన పాలన జగన్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. చదువుకున్న యువకులపై అక్రమ కేసులు బనాయించి వారి జీవితాలను నాశనం చేస్తున్నారని పీలేరు ఘటనని చంద్రబాబు నాయుడు ఉదహరించారు.
జగన్ రెడ్డి అరాచక పాలనకి ప్రజలు ముగింపు చెప్పే రోజు రాబోతుందని తెలియజేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్రలకి, ప్రతిపక్షంలో అందచేసే ప్రయత్నం చేస్తున్న పోలీసులకి రాబోయే కాలంలో కచ్చితంగా సమాధానం ఉంటుంది చంద్రబాబు నాయుడు హెచ్చరించాడు. 72 శాతం మేరకు పోలవరం ప్రాజెక్ట్ ని తమ ఐదేళ్ళ పాలనలో పూర్తి చేస్తే ఇప్పటి వరకు దానిని ఒక్క అడుగు కూడా ముందుకి కదిలించాలేదని విమర్శించారు. కందుకూరు, గుంటూరు ఘటనలలో పోలీసులు కనీసం బందోబస్తు కూడా ఇవ్వకుండా ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారని విమర్శించారు.