Chandrababu: ఏపీ రాజకీయాలలో క్రింది స్థాయిలో ప్రజలకి చేరువ కావడానికి వారికి తమ మ్యానిఫెస్టో, అలాగే పరిపాలనా విధానాలని తెలియజేయడంతో పాటు, సంక్షేమ పథకాలని అందించామని చెప్పడానికి వైసీపీ ఇప్పటికే గ్రామ సారథులని నియమించింది. ఈ గ్రామ సారథులతో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ రానున్న ఎన్నికలలో అధికారం హస్తగతం చేసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. ప్రతి 50 ఇళ్ళకి ముగ్గురు గ్రామ సారథులని నియమించే పనిని నియోజకవర్గ ఇన్ చార్జ్ లకి అప్పగించింది. మరో వైపు సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి చేరువ చేయడానికి వాలంటీర్ వ్యవస్థని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సంక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటుంది. అయితే దీనికి పోటీగా ఇప్పుడు ఇప్పుడు టీడీపీ సాధికారిక సారథులని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. ప్రతి 30 ఇళ్ళకి ఒకరు చొప్పున సాధికారిక సారథులు ఉంటారని చెప్పారు. వీరు ప్రభుత్వ సంక్షేమ పథకాలని నేరుగా లబ్దిదారులకి చేరువ చేయడంతో పాటు పారదర్శకత ఉండే విధంగా చూసుకుంటారని పేర్కొన్నారు.

ప్రస్తుతం పార్టీని కూడా ప్రజలకి మరింత చేరువ చేసి ప్రజలకి తాము ఏం చేయబోతున్నది చెబుతారని తెలిపారు. అలాగే ఇప్పటి వరకు ఉన్న సెక్షన్ ఇన్ చార్జ్ లు అందరూ కూడా సాధికారిక సారధులుగా పిలవబదతారని అన్నారు. గతంలో కార్యకర్తలకి సరైన న్యాయం చేయలేదని అభిప్రాయం చాలా మందిలో ఉందని, అయితే ఈ సారి మాత్రం కచ్చితంగా కార్యకర్తలకి అండగా ఉంటామని చెప్పారు.
వారిని సాధికారిక సారథులుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీరిద్వారానే గ్రామ స్థాయిలో సంక్షేమ పాలన ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలకి వీరు చేరువగా ఉండి వారి సమస్యలని అడిగి తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తారని అన్నారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థని విమర్శించిన టీడీపీ ఇప్పుడు మరల అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.