Cow Hug Day : ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డేగా జరుపుకునే ఫిబ్రవరి 14ని ‘కౌ హగ్ డే’ గా జరుపుకోవాలని ఆవు ప్రేమికులకు విజ్ఞప్తి చేస్తూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోటీసు జారీ చేసింది. ఆవును కౌగిలించుకోవడం వల్ల భావోద్వేగ సంపన్నత , వ్యక్తిగత , సామూహిక ఆనందం పెరుగుతుందని తెలిపింది. వాలెంటైన్స్ డే వంటివి పాశ్చాత్య నాగరికత యొక్క సమ్మోహనం అని బోర్డు విమర్శించింది. కాలక్రమేణా పాశ్చాత్య సంస్కృతి పురోగతి కారణంగా వైదిక సంప్రదాయాలు దాదాపుగా అంతరించిపోయే దశ కు చేరుతాయని పేర్కొంది.

ఆవు భారతీయ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, మన జీవితాన్ని నిలబెడుతుందని, పశువుల సంపద జీవవైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని బోర్డు కార్యదర్శి డాక్టర్ సుజిత్ కుమార్ దత్తా పేర్కొన్నారు. మానవాళికి సమస్త ఐశ్వర్యాన్ని అందించే తల్లి గోవులని అన్నారు . దీనిని కామధేను, గోమాత అని పిలుస్తారన్నారు.

ఆవు అపారమైన ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కౌ హాగ్ డే ను జరుపుకోవాలన్నారు. ఆవును కౌగిలించుకోవడం వల్ల మన వ్యక్తిగత, సామూహిక ఆనందాన్ని పెంచుతుందని అన్నారు. మత్స్య, పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖ ఆదేశాల మేరకు ఈ సలహా జారీ చేసినట్లు బోర్డు తెలిపింది.