Delhi Murder : ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల నిక్కీ యాదవ్ హత్య కేసులో రోజుకో అప్‌డేట్ వస్తోంది. బాయ్ ఫ్రెండ్ ఫార్మా గ్రాడ్యుయేట్ సాహిల్ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుస్తోంది. తన నిశ్చితార్థం జరిగిన రోజే సాహిల్ గెహ్లాట్ తనతో నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్న ప్రియురాలు నిక్కీ యాదవ్‌ను చంపి, ఆమె మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచి, యధావిధిగా తన వ్యాపారాన్ని కొనసాగించాడని తమ విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. గత సంవత్సరం జరిగిన అఫ్తాబ్ పూనావల శ్రద్ధా వాకర్ కేసు కూడా ఇదే కోణంలో ఉందని అదే తరహాలో అమ్మాయిని హత్య చేసి దాచిపెట్టే ప్రయత్నం చేశాడని దీనిపై లోతైన విచారణ జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు.
24 ఏళ్ల సాహిల్ గెహ్లాట్ ఫిబ్రవరి 9న తాను ప్రేమించిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ నిశ్చితార్థ వేడుకల్లో నిమగ్నమైన సాహిల్ తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేశాడు. మరుసటి రోజు ఉదయం, ఈ దారుణాన్ని తెలుసుకున్న ప్రియురాలు నిక్కీ తనకు ద్రోహం చేశావని సాహిల్ ను నిలదీసింది. తనను ప్రేమించి వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని వాదించింది ఈ గొడవలో నిక్కీ యాదవ్‌ను గొంతు కోసి చంపాడు సాహిల్. అనంతరం అసలు ఏమీ జరగలేదు అన్నట్లుగా పెళ్లికి వెళ్లాడు. వివాహానికి సంబంధించిన వీడియోలు సాహిల్ గెహ్లాట్ సాధారణ వరుడిలా ఆచారాలు నిర్వహిస్తున్నట్లు కనిపించాడని, హత్య చేసిన వ్యక్తిలా ఎక్కడా కనిపించలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. 23 ఏళ్ల నిక్కీ యాదవ్ చివరిసారిగా ఫిబ్రవరి 9న ఢిల్లీలోని తన అద్దె ఇంట్లో సెక్యూరిటీ ఫుటేజీలో కనిపించింది.
తన నిశ్చితార్థ వేడుకల తర్వాత, సాహిల్ తన బంధువు కారును తీసుకొని తెల్లవారుజామున 1 గంటలకు నిక్కీ ఇంటికి వెళ్లాడని విచారణలో తెలుస్తోంది. తెల్లవారుజామున 5 గంటలకు, వారిద్దరూ గోవాకు రైలు పట్టుకోవడానికి దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. నిక్కీ యాదవ్ సాహిల్‌తో కలిసి గోవా వెళ్లాలనుకుంది, అయితే తనకు టికెట్ లభించలేదని సాహఇల్ చెప్పడంతో ,అప్పుడు వారు హిమాచల్ ప్రదేశ్ పర్యటన కోసం బస్ స్టేషన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాహిల్ నిక్కీని విడిచిపెట్టాలని చేశాడని, కలిసి యాత్రకు వస్తానని వాగ్దానం చేయడం ద్వారా ఆమెను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో బస్సు టిక్కెట్టు లభించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు.
పోలీసుల విచారణలో తన మెదడులో రెండు ఆలోచనలు ఉన్నాయన్నాడు సాహిల్. అయితే ఇదంతా అతని వెర్షన్ ఎందుకంటే స్థానికులతో జరిపిన విచారణ ద్వారా, అతను తన ఎంగేజ్‌మెంట్ సమయంలో డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపాడని మాకు తెలిసింది అని అన్నారు. కాబట్టి, CCTVలు, సాంకేతికతతో సహా బలమైన ఆధారాలతో అతని వెర్షన్‌ను తీసుకున్నామని, ఫోరెన్సిక్ పరీక్షతో పాటు సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.