రాధ మాధవ్‌ని ఎంత అసహ్యించుకున్న వదిలిపెట్టకుండా.. తనని సొంతం చేసుకోవాలని అనేక విధాలుగా బ్లాక్‌మెయిల్ చేస్తాడు. దానికి నువ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఫీసార్ సారే నా పెనిమిటి అని తేల్చి చెప్తుంది రాధ. తండ్రి గురించి పదే పదే ఆరా తీస్తూ రాధని సతాయిస్తుంది దేవి. ఆదిత్య మీద నమ్మకం కోల్పోతుంది సత్య. మరోవైపు సత్య బాధను దేవుడమ్మకు చెప్తాడు భర్త. ఆ తర్వాత ఆగస్టు 11 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దేవుడమ్మా.. కనిపించని రుక్మిణి, తన బిడ్డ గురించి ఆలోచిస్తూ సత్యను నిర్లక్ష్యం చేస్తున్నావ్. అటు ఆదిత్య పట్టించుకోడు. ఇటు నువ్ పట్టించుకోకపోతే సత్య ఏమైపోతుంది? అని హితబోధ చేస్తాడు భర్త. అవునండీ నిజమే. నేను తప్పు చేస్తున్నాను.. ఇక నుంచి సత్యకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటానని భర్తకు మాటిస్తుంది దేవుడమ్మా. సీన్ కట్ చేస్తే.. ఉదయం నిద్ర లేచిన రాధకు దేవి కనిపించదు. ఇంత పొద్దున్నే ఎక్కడికి పోయింది అంటూ ఇళ్లంతా కలియతిరుగుతూ పిలుస్తుంది. ఎక్కడా కనిపించకపోవడంతో కంగారు పడుతుంది రాధ. జానకి, రామ్మూర్తి ఎదురుపడి ఏమైందమ్మా అని అడగ్గా.. విషయం చెప్తుంది. మాధవ్‌తో సహా అందరూ తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి దేవి గురించి ఆరా తీస్తారు.
మరోవైపు దేవి గుడిలో ప్రత్యక్షమవుతుంది. ‘అమ్మని ఎంతడిగినా నాయన గురించి చెప్పలేదు. నాయన ఫొటో కూడా లేదు. అమ్మ ఫొటో తీసుకుని పక్క ఊరికెళ్లి అందరినీ అడుగుతా..’ అంటూ బయలుదేరుతుంది. ఊర్లో ఎవరూ తెలియదని చెప్పడంతో దేవి అనూహ్య నిర్ణయం తీసుకుంటుంది. ‘మాయమ్మ ఎట్లుంటదో దేవుడమ్మకు తెలియదు. ఈ ఫొటో తీసుకెళ్లి చూపించి మా నాయన గురించి అడుగుతా. అవ్వ అయితే ఆఫిసర్ లాగ సహాయం చేస్తుంది’ అనుకొని ఆటో ఎక్కి వెళ్తుంది దేవి. ఇంకో సీన్‌లో ఆదిత్య మీసాలతో ఉన్న దేవి ఫొటో పట్టుకుని కనిపిస్తాడు. దేవి గురించి తన తల్లి అన్న మాటలను గుర్తుచేసుకుని మురిసిపోతాడు. ‘నా బిడ్డకి నా పోలికలే వచ్చాయి’ అనుకుంటూ ఉబ్బితబ్బిబైపోతాడు. అంతలోనే ఆదిత్యకు రుక్మిణి ఫోన్ చేసి దేవి కనపించట్లేదని కంగారుగా చెప్తుంది. అదేంటి చెప్పకుండా ఎక్కడికెళ్లింది.. నువేం టెన్షన్ పడకు. నేను వస్తున్నా అని చెప్పి బయలుదేరుతాడు.
దేవిని వెతుక్కుంటూ కారులో వెళ్తారు రుక్క, ఆదిత్య. నాకు చెప్పకుండా ఎప్పుడూ వెళ్లని బిడ్డ.. ఎక్కడికి పోయిందో ఏమో అంటూ కంటతడి పెడుతుంది రుక్మిణి. తనకు తెలిసిన వాళ్లందరికి వెతకమని చెప్పానని భరోసా ఇస్తాడు ఆదిత్య. మాధవ్ కుట్రలో భాగంగా దేవిని ఏమైనా చేసుంటాడేమోనని అనుమానిస్తాడు. రాత్రి బిడ్డ నిద్రలో కలవరించింది. నాయన యాదికొస్తుండు.. ఎక్కడున్నాడో చెప్పమని అడిగింది. నేను చెప్పనందుకే ఇలా చేసిందేమోనని బాధపడుతుంది రాధ. దేవికోసం ఓవైపు భాగ్యమ్మ, జానకి రామ్ముర్తిలు అందరూ వెతుకుతారు.
ఆ తర్వాత సీన్‌లో దేవి సరాసరి రుక్కు ఫొటో తీసుకుని దేవుడమ్మ ఇంటికి వెళ్లి పిలుస్తుంది. పనిమనిషి వచ్చి ఇంట్లో వాళ్లందరూ గుడికి వెళ్లారని చెప్పగా.. దేవి అక్కడినుంచి వెనక్కి వెళ్లిపోతుంది. మరోవైపు ఆదిత్య, రుక్క దేవి ఆచూకి కోసం గాలిస్తుంటారు. ‘బిడ్డ ఏడికి పోయిందో. ఎంత వెతికిన కనిపిస్తలేదు. భయమేస్తుంది పెనిమిటి’ అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. దేవికేం కాదని.. ఆదిత్య రాధకు ధైర్యాన్నిస్తాడు. అన్నిచోట్లా వెతికాం. స్కూల్ దగ్గర, పార్క్ దగ్గర చూశాం. ఎక్కడా కనిపించట్లేదు అని మదనపడతాడు ఆదిత్య. ‘బిడ్డకేమైనా అయితే నేను తట్టుకోలేను పెనిమిటి. దాన్నే పానంగా బతుకుతున్నా. దానికేమైనా అయితే నేను బతకలేను’ అంటూ ఎమోషనల్ అవుతుంది రుక్కు.
అసలు దేవి ఇలాంటి పనిచేసిందేంటిరా. ఇంట్లోంచి వెళ్లిపోవడమేంటి? ఒకసారి ఇలాగే అందర్నీ భయపెట్టింది మళ్లీ ఇపుడు అంటుంది జానకి మాధవతో. అసలు తనకు ఇంట్లోంచి వెళ్లాలన్న ఆలోచన ఎందుకొస్తుంది. ఆ పసి మనసు బాధేంటిరా అని మాధవని ప్రశ్నిస్తాడు రామ్మూర్తి. ‘ఒరేయ్ మాధవ.. దేవే ప్రాణంగా బతుకుతుందిరా రాధ. ఈ రోజు వరకు తనని చూసుకుంటు మన దగ్గరే ఉంది. దేవికేమైనా జరిగితే రాధ గుండె పగిలిపోతుంది. ఇలా దేవి ఇంట్లోంచి వెళ్లిపోవడం చూసి ఇక్కడెందుకని రాధ దేవిని తీసుకొని వెళ్లిపోయినా వెళ్లిపోతుంది’ అని రోధిస్తుంది జానకి. ‘అవునురా మాధవ.. దేవే తన లోకమని తనకి తెలుసు. అలాంటి దేవి దేని గురించో బాధపడుతుంది. దేవితో పాటే రాధ కూడా కలిసి వెళ్లిపోతే..?’ అని అంటాడు రామ్మూర్తి. ఆ మాటలకు మాధవ్.. మైండ్ బ్లాక్ అవుతుంది.
ఇంకో సీన్‌లో దేవి తల్లి ఫోటోతో గల్లీ గల్లీ తిరుగుతూ.. తండ్రి గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. ఎవరూ చెప్పకపోవడంతో బాధపడుతుంది. అపుడే రుక్కు, ఆదిత్యల కంటపడుతుంది. పరుగున వెళ్లి దేవమ్మా.. అంటూ కౌగిలించుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఆదిత్య కూడా కంటతడి పెడతాడు. ‘ఏంది బిడ్డ ఇట్ల చేస్తున్నావ్. నీకోసం ఊరు ఊరంతా వెతికినం. ఎక్కడికి పోయినవో తెలియక అల్లాడిపోయానో తెలుసా’ అంటూ ఎమోషనల్ అవుతుంది. ‘ఇలా ఇంట్లో చెప్పకుండా వస్తే ఎలాగమ్మా’ అంటాడు ఆదిత్య. ‘మరేం చేయాలి సారూ. నాయన ఎక్కడుంటాడు, ఎట్ల ఉంటాడు అంటే మాయమ్మ చెప్పదు’ అంటూ బాధపడుతుంది దేవి. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. దేవి బాధను చూసి ఆదిత్య, రుక్కులు అసలు నిజం చెప్తారా? తండ్రిని వెతికే ప్రయత్నంలో భాగంగా దేవి ఇంకేం చేయనుంది? తెలుసుకోవాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..