మాధవ్ ఫ్రెండ్స్‌తో కలిసి రిసార్ట్‌లో ఎంజాయ్ చేసి ఏమీ తెలియనట్లు తిరిగి చేతి కర్ర పట్టుకని కుంటుతూ ఇంటికి వస్తాడు. అప్పుడు రాధ బయట పూలు కోస్తూ దేవిని ఎలాగైనా ఆదిత్య దగ్గరకి పంపిచాలని మనసులో అనుకుంటుంది. మరోవైపు మాధవ్ దేవితో పాటు రాధను కూడా బయటికి తీసుకువెళ్తాడు. సగం దూరం వెళ్లిన తర్వాత మాధవ్ మనం వెళ్తున్నది ఆఫీసర్ ఇంటికేనమ్మా అని బాంబ్ పేల్చుతాడు. రాధ వద్దంటూ కారుని వెనక్కి పోనివ్వమంటుంది. ఆ తర్వాత ఆగస్టు 8న ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం..
కారులో వెళ్తుండగా దేవి రాధతో.. మనమిద్దరం ఆఫీసర్ని నాయన గురించి అడుగుదాం అని చెబుతుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న మాధవ్ రాధతో ‘నువ్ వెళ్లి అడుగు.. ఆఫీసర్ గారూ న్యాయం చేస్తారా’ అని వెటకారంగా అంటాడు రాధతో. అపుడు రాధ కోపంతో ఊగిపోతూ ‘ముందు కారు ఆపండి’ అని అరుస్తుంది. దానికి ‘ఏం అవసరం లేదు.. ఆఫీసర్ గారి ఇంటిముందుకు వెళ్లాక ఆపుదాం’ అంటాడు మాధవ్. ఇంతలో కారు ఆదిత్య ఇంటి ముందు ఆగుతుంది. ‘తల్లి దిగు’ అని దేవితో మాధవ్ అనగా.. దేవి కారు దిగి ‘ అమ్మా ఆఫీసర్ సర్ ఇల్లు వచ్చింది. రా అమ్మ వెళ్లి అడుగుదాం. అవ్వ కూడా నిన్ను చూడాలని చాలాసార్లు అడిగింది కదా.. నువ్వు వచ్చినవంటే మస్తు ఖుషీ అవుతది’ అని చెప్తుంది తల్లితో. తనని ఎవరు చూస్తారోనన్న భయంతో రాధ కారులో కూర్చొని ముఖానికి చేతు అడ్డంగా పెట్టుకొని టెన్షన్ పడుతుంటుంది.
కారు ఇంటిముందు ఆపి.. ఇంత సమయమైనా ఎవరూ దిగి రావట్లేదేంటి? ఎవరై ఉంటారు అని ఆలోచిస్తుంటుంది దేవుడమ్మ. అంతలోనే ‘దేవి.. నువ్ వెళ్లమ్మా. మేము ఇంకోసారి వచ్చినపుడు కలుస్తాం’ అంటాడు మాధవ్. దేవి రావడం చూసి దేవుడమ్మ సంతోషపడుతుంది. ‘నువ్వా.. చిట్టి రాక్షసి. కారు దిగి రావడానికి ఇంతసేపు ఆలోచించావా. ఎవరు తీసుకొచ్చారు నిన్ను’ అంటూ కౌగిలించుకుంటుంది. ‘లే అవ్వ. మా అమ్మ, నాయన ఇద్దరు వచ్చారు’ అని దేవి చెప్పగా.. ఏంటీ.. మీ అమ్మ వచ్చిందా! మరి ఇంట్లోకి రాకుండా వెళ్లిందేంటి? మీ ఇంటికి వచ్చినా కనిపించదు. మా ఇంటికి కూడా రాకుండా వెళ్లిందేంటి? నువ్వైనా చెప్పి తీసుకురావచ్చు కదా.. అంటుంది దేవితో. చెప్పినా మా అమ్మ రాలేదు అని చెబుతుంది దేవుడమ్మతో.
ఆ తర్వాత సీన్లో.. రాధను కారులో తీసుకెళ్తూ, రోడ్డు పక్కన ఆపి డ్రెవర్ను వెళ్లిపోమని చెబుతాడు మాధవ్. రాధ కోపంగా కారు దిగి ‘ఏడికో తీసుకెళ్తానని చెప్పి నా ఇంటికి తీసుకెళ్లినవ్. ఇపుడు గీడికి తీసుకొచ్చినవ్. ఏం చేస్తున్నవ్ అసలు’ అని అరుస్తుంది మాధవ్ మీద. ‘నా ఇంటికి అంటున్నావ్.. మరి నీ వాళ్లను, నీ ఇంటిని చూడగానే అంతగా భయపడుతున్నావ్ ఎందుకు చెప్పు? నీ భయం నిజం రాధ. మన గురించి ఎవరికి ఏం తెలియదన్న ధైర్యంతో నువ్వున్నావ్. కానీ పెళ్లి కాకుండానే పది సంవత్సరాలుగా ఈ ఊరందరి దృష్టిలో మనం భార్యాభర్తలుగా ఉన్నామని తెలిస్తే.. మీ అత్త రియాక్షన్ ఏంటి? నువ్ చెప్పే నిజం కన్నా ఊరు చెప్పే అబద్ధానికే బలం ఎక్కువ. భర్తని వదిలేసి వచ్చిన నువ్ చెప్పిన మాటలు విని మీ అత్తయ్య నీకు హారతిచ్చి ఆ ఇంట్లోకి ఆహ్వానిస్తుందనుకుంటున్నావా? దేవి ఎవరి బిడ్డా అనే ప్రశ్నకి సమాధానం దొరకకుండా నీ బిడ్డని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందనుకున్నావా? గడపదాటి పదేళ్లయింది. పరాయి ఇంట్లో ఉండి ఈ బిడ్డని ఆదిత్య బిడ్డ అంటే నమ్ముతుందా? నువ్ చెప్పే నిజం కన్నా నేను చెప్పే అబద్దాన్నే అందరూ నమ్ముతారు. అందుకే నేను చెప్పినట్టు చేస్తే దేవి ఆదిత్య దగ్గర సంతోషంగా ఉంటుంది. అందుకు జనం చెప్పే అబద్దాన్ని నువ్ నిజం చేస్తే చాలు. నువ్ శాశ్వతంగా నా దగ్గరే ఉండాలి’ అని రాధను బ్లాక్ మెయిల్ చేస్తాడు. మాధవ్ మాటలకు రాధకు కోపం ఓ రేంజ్లో వచ్చినా.. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లి కారు డ్రైవింగ్ చేస్తుంది. ఎదురుగా నిల్చున్న మాధవ్‌ని ఢీకొట్టాలన్నంత కోపం వచ్చిన పక్కకు తప్పించి కొంచెం ముందుగా కారు ఆపుతుంది రాధ.
‘ట్రాక్టర్ నడిపిన చేతులకు కారు నడపడం ఓ లెక్కనుకున్నావా? నువ్ తప్పించుకోలే. నేను తప్పించిన. లేకపోతే ఈ పాటికి పోయుండేవాడివి’ అని మాధవని చూస్తూ మనసులో తిట్టుకుంటుంది రాధ. దాంతో మాధవ్‌కు మతిపోయినంత పనయింది. ‘పద్ధతిగా చెప్పినా నా మాట వినకుండా నన్నే కారుతో గుద్దాలనుకున్నావ్. మాటలతో నువ్ వినవని అర్థమైంది. నా ప్రాణాలు తీయడానికే తెగించావ్ అంటే ఇక నిన్ను నేను మాటలతో మార్చలేను. కానీ నీ మీద ఉన్న ప్రేమ, అభిమానం అడ్డువస్తున్నాయి. అలా అని కామ్‌గా ఉంటే నువ్ నన్ను రెచ్చగొడుతున్నావ్. నేనేంటో అర్థమయ్యేలా చెప్తా’ అని రాధని ఉద్దేశించి అంటాడు మాధవ్.
అక్కడ దేవుడమ్మ ఇంట్లో ఉన్న దేవి ఇళ్లంతా కలియ తిరుగుతుంటుంది. ‘ఓ పెద్దమనిషి నువ్ వచ్చింది నాతో కబుర్లు చెప్పడానికా. లేక ఇల్లు ఎలా ఉందో చూడడానికా’ అంటూ దేవితో సరదాగా అంటుంది దేవుడమ్మ. ఆఫీసర్ సార్‌తో మాట్లాడడానికి వచ్చిన. సర్ లేడన్నారు కదా. అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటుంది దేవి. ఈ మధ్య మీ ఆఫీసర్‌తో మాట్లాడాలని వస్తున్నావ్. నాతో మాట్లాడవా? అంటుంది దేవుడమ్మా. నీతో ఇపుడు మాట్లాడుతున్నా కదా అని హుషారుగా బదులిస్తుంది దేవి. ఇంతకు ముందులా ఇపుడు మాట్లాడట్లేదని, నీకు మీ ఆఫీసర్ సార్.. మీ ఆఫీసర్ సార్‌కు నువ్వుంటే చాలు అని నవ్వుతూ చెబుతుంది దేవుడమ్మా.
అంతలోనే సత్య వస్తుంది అక్కడికి. ‘దేవీ.. ఎంతసేపయింది’ వచ్చి అని ప్రశ్నిస్తుంది. వాళ్ల అమ్మా, నాన్న వచ్చి వదిలిపెట్టి వెళ్లారు అంటుంది దేవుడమ్మా. అది విని సత్య షాకవుతుంది. ఏంటి మీ అమ్మ వచ్చిందా? అని అడుగుతుంది. ఆ రాధ వాళ్లింటికి వెళ్లినా కనిపించదు. మన ఇంటికి కూడా రాదు. ఏంటో ఆ రాధ అంటుంది దేవుడమ్మా. ‘అక్క ఇంటి వరకు వచ్చిందటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. రాధే అక్కని తెలిస్తే ఎలా ఫీలవుతారోననే మీ దగ్గర ఆదిత్య, నేను నిజం దాస్తున్నాం’ అని దేవుడమ్మని ఉద్దేశించి అననుకుంటూ మనసులో బాధపడుతుంది సత్య.
ఆదిత్య వచ్చే వరకు దేవిని నీ దగ్గరే ఉంచుకో అని సత్యకు చెబుతుంది దేవుడమ్మా.
దేవిని తన రూంలో కూర్చోబెట్టి స్నాక్స్ తీసుకొస్తా అని చెప్పి వెళ్తుంది సత్య. అక్కడే ఉన్న ఆదిత్య, సత్యల ఫోటో దేవి కంటపడుతుంది. అది చూసి వాళ్ల అమ్మా, నాన్నల గురించి ఆలోచిస్తుంటుంది. మా అమ్మను నాయన ఫోటో అడిగితే లేదంటుంది. మాయమ్మ నాయన గురించి చెప్పడానికి ఎందుకో పరేషాన్ అవుతుంది అంటూ అటు వైపుగా చూస్తుంది. అక్కడే టేబుల్ మీద ఉన్న ఫోన్ బాక్స్ కనిపిస్తే అది తీసి చూస్తుంది దేవి. అప్పుడే సత్య వచ్చి అది ఖాళీ బాక్స్ అమ్మా.. ఈ స్నాక్స్ తిను అంటూ ఇస్తుంది. వెంటనే దేవి ఇలాంటి ఫోన్ మాయమ్మ దగ్గర ఉందని చెప్పగా అది విని సత్య ఖంగుతింటుంది. రాధకు ఆదిత్య ఫోన్ ఇచ్చినట్లు సత్యకు తెలుస్తుందా..? తెలిస్తే సత్య ఎలా రియాక్ట్ అవుతుంది అనేది తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..