దేవి ఆదిత్య దగ్గర సంతోషంగా ఉండాలంటే రాధ శాశ్వతంగా తన దగ్గరే ఉండాలని బ్లాక్మెయిల్ చేస్తాడు మాధవ్. మరోవైపు తండ్రి గురించి ఆరా తీయడానికి ఆదిత్య ఇంటికి వెళ్తుంది దేవి. కానీ అంతలోనే కథ మరో మలుపు తిరుగుతుంది. సత్య గదిలో ఉన్న దేవికి తన తల్లి దగ్గర ఉన్న ఫోన్ బాక్స్ కనిపిస్తుంది. అదే విషయం సత్యతో చెప్తుంది. అది విని ఖంగుతింటుంది సత్య. ఆ తర్వాత ఆగస్టు 9 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం.
ఖాళీగా ఉన్న బాక్స్‌ను ఎందుకమ్మా చూస్తున్నావ్.. ఈ స్నాక్స్ తిను అంటుంది సత్య. చిన్నమ్మా.. ఇలాంటి ఫోనే మాయమ్మ దగ్గర ఉందని అసలు విషయం చెప్తుంది దేవి. అది విని కంగుతింటుంది సత్య. ‘ఆదిత్య ఆ బాక్స్‌లో ఫోన్ ఆఫీసులో వాచ్‌మెన్‌కి ఇచ్చినట్టు చెప్పాడు. దేవేమో అక్క దగ్గర ఉందంటుంది. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది. అసలేం జరుగుతుంది’ అని బాధపడుతూ ఆలోచిస్తుంది సత్య. అపుడే దేవి ఆఫీసర్ ఇంకా రావట్లేదు కదా.. నేను మా ఇంటికి పోతా అంటుంది. ఒకదానివే ఎలా వెళ్తావమ్మా? ఈ స్నాక్స్ తినే లోపు ఆఫీసర్ రాకపోతే నేనే తీసుకెళ్తా అని దేవికి చెబుతుంది సత్య.
తర్వాత సీన్లో ఆదిత్య, రుక్మిణి రహస్యంగా కలుసుకుంటారు. రాధ మాధవ్ చేసిన బ్లాక్మెయిల్ గురించి వివరంగా చెబుతుంది ఆదిత్యకు. ‘ఇంటికి తీసుకొచ్చి ఏం చేద్దామనుకున్నాడు’ అని ఆదిత్య అడగ్గా అదే తెలియదు పెనిమిటి అంటుంది రుక్మిణి. ఇంటిముందుకు తీసుకొచ్చి అత్తమ్మ కనబడగానే అక్కడినుంచి తీసుకెళ్లాడు అంటుంది. ‘నిన్ను భయపెట్టడం వల్ల ఆ మాధవ్ గాడికి వచ్చే లాభం ఏంటి ’ అంటాడు ఆఫీసర్. నేను మన ఇంటికి పోకుండా ఆ ఇంట్లోనే ఉండాలి. అందుకే ఇలాంటి కథలు పడుతున్నాడు అని రాధ చెప్పగా.. అంటే ఆ మాధవ్ గాడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట అని కళ్లెర్రజేస్తూ తిడుతాడు ఆదిత్య. ‘నువ్ తన్నినవ్.. నేను ఏకంగా కారు ఎక్కించి తొక్కించబోయిన’ అని ధైర్యంగా చెబుతుంది రుక్కు. ‘ఇన్నేళ్ల నుంచి మంచిగ ఉన్న మాధవ్ సర్ బుద్ధి గడ్డి తింటుంది. బిడ్డ ముఖం చూసి ఉంటున్నందుకు అది నా బలహీనత అనుకుంటున్నాడు. అందుకే నాతో పెట్టుకుంటే చంపేస్తా అని చెప్పినా.’ అసలు ఆ మాధవ్‌కి ఏం కావాలి అని అడగ్గా.. ‘తన కూతురికి తల్లి కాదు. వాడికి నేను కావాలని ఎలా చెప్పాలి పెనిమిటి. నన్ను ఎంత సతాయిస్తుండో నీకు చెప్తే.. ఇప్పుడే పోయి వాడిని కోస్తావ్. అందుకే ఆ మాట నీకు చెప్పలేకపోతున్నా’ అని ఆవేదనగా మనసులో అనుకుంటుంది రాధ. ఆ తర్వాత ఆదిత్య తన పరిస్థితిని రుక్కుకు చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతాడు. ‘నీ బాధను విని ఏం చేయలేకపోతున్నా. అమ్మకి చెప్పలేను. దేవికి మీ నాన్నను నేనే అని చెప్పలేను’ అంటూ బాధపడుతాడు.’ వీటన్నింటికి ముగింపు నేనిస్తా.. మాధవ్ సార్ ఇంకా మారకపోతే ఈ సారి సీదా కారు మీది నుంచి పోనిస్తా.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రుక్కు. ఆదిత్య తన నిస్సహాయతను తలుచుకుంటూ బాధపడుతాడు.
రాధ చేసిన హత్యాయత్నం గురించి మాధవ్ ఆలోచిస్తుంటాడు. రాధ పూర్తిగా మారిపోయిందని, పరిస్థితి చేజారిపోయిందని.. తనని ఏదో ఒకటి చేయాలని క్రూరంగా ఆలోచిస్తాడు. అంతలోనే దేవి, సత్య వస్తారు. బావ అక్క ఎక్కడ అని సత్య అడగ్గా.. బయట ఎవరో ఫ్రెండ్‌ని కలుస్తానంటు వెళ్లిందని చెప్తాడు. తన ప్లాన్‌లో భాగంగా సత్యకు రాధ గురించి చెడుగా చెప్పాలనుకుంటాడు. దేవిని వెళ్లి ఫ్రెష్ అవమని పంపిస్తాడు. అపుడు సత్య అక్కకు ఈ ఊరులో ఫ్రెండ్స్ ఎవరూ లేరని నాకు తెలుసు. నిజం చెప్పండి అంటూ గుచ్చి గుచ్చి అడుగుతుంది. ‘భార్య గురించి నిజాలు చెప్పాలంటే భర్తకు ఇబ్బందిగా ఉంటుంది. అక్క, బావ అంటూ నువ్ అప్యాయంగా మాట్లాడతావ్ కాబట్టి చెబుతున్న. ఈ మధ్య రాధ పూర్తిగా మారిపోయింది. ఇంటిని నన్ను పట్టించుకోపోయిన పర్లేదు కానీ పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు. ఎప్పుడూ ఫోన్లోనే మాట్లాడుతుంది. ఎవరూ అని అడిగితే ఫ్రెండ్స్ అంటుంది. తనకి ఫ్రెండ్స్ లేరని నాకూ తెలుసు. ఉన్నట్టుండి బయటికి వెళ్తుంది. ఎక్కడికెళ్లావ్ అంటే చెప్పదు. రాధ నా చేజారిపోతుందని భయంగా ఉంది. అలాగని తనని ఏమనలేను. రాధ లేకుండా నేనుండలేను సత్య’ అంటూ కట్టు కథ చెప్తూ నటిస్తాడు మాధవ్. అక్కని ఫోన్ గురించి డైరెక్ట్‌గా అడుగుదామంటే ఈ మాధవ్ ఇలా చెప్తున్నాడు. ఇక్కడ అక్క పరిస్థితి ఎలా ఉందో అక్కడ ఆదిత్య పరిస్థితి కూడా అలానే ఉంది.. అని సత్య మనసులో అనుకుంటుంది బాధగా. సరే బావ నేనొళ్లస్తా అని చెప్పుకుంటూ అక్కడినుంచి వెళ్తుంది.
సత్య వెళ్లగానే మాధవ్ ‘ఇక్కడుంది నీ సొంత అక్క అని తెలిసినా నువ్ నటిస్తున్నావ్. నేను నటించాలేనా? ఇపుడు ఆదిత్య నీ భర్త. నిన్ను వదిలేసి రాధ చుట్టూ తిరుగుతుంటే నేనెలా ఊరుకుంటా. అందుకే అలా కీ ఇచ్చాను. ఇపుడు నువేం చేస్తావో చూస్తా’ అని అనుకుంటాడు.
మరోవైపు దేవుడమ్మ ఆదిత్య గదిలోకి వెళ్లి పిలుస్తుంటుంది. గది శుభ్రంగా లేదని లోపలికి వస్తుంది. అక్కడ మీసాలు పెట్టి ఉన్న దేవి ఫొటో కనిపిస్తుంది. బంగారం లాంటి పిల్లని ఇలా చేశారేంటి అనుకుంటుంది. అంతలోనే ఆదిత్య వస్తాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావ్ అంటాడు. ‘ఈ ఫొటో ఎవరు ఇలా చేశారు’ అని అడగ్గా దేవినే అలా పెట్టుకుందని బదులిస్తాడు ఆదిత్య. వాళ్లమ్మకి ఇద్దరు ఆడపిల్లలని ఇలా పెట్టుకుందా.. అనుకుంటూ నవ్వుతుంది దేవుడమ్మ. ‘అదేంటోరా ఈ పిల్ల దగ్గర నీ పోలికలు బాగా కనిపిస్తాయి. మీసాలతో దేవిని చూస్తుంటే నిన్ను చూస్తున్నంటే ఉంది’ అని దేవుడమ్మ అనగా ఆదిత్య ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. తనలో తానే సంతోషపడుతుంటాడు.
ఇల్లు సర్దుతున్న రాధని తీక్షణంగా చూస్తాడు మాధవ్. అది గమనించిన రాధ కళ్లెర్రజేస్తూ మాధవ్‌ని అసహ్యించుకుంటుంది. నేనంత భయంకరంగా ఉన్నాన రాధ అంటాడు మాధవ్. అద్దంలో చూసుకుంటే తెలుస్తది అని కోపంగా అంటుంది రాధ. అభిమానాన్ని అపార్థం చేసుకుంటే ఎలా రాధా అని మాధవ్ అనగా.. అతన్ని ఓ రేంజ్లో క్లాస్ పీకుతుంది రాధ. మనసుకు అవన్నీ తెలియవు రాధ.. అర్థం చేసుకుంటే అలా అనిపించదు అని హితబోధ చేస్తాడు మాధవ్. ‘నిన్ను అర్థం చేసుకోడానికి నేనెవరిని. నా భాదలు నాకున్నాయి’ అని చిరాగ్గా అంటుంది. నన్ను రోడ్డు మీద అలా ఎందుకు వదిలేసావ్ రాధ. నేనిచ్చిన ఆఫర్ నచ్చట్లేదా? అని అడగ్గా.. నాతోని కాదు సారూ. నన్ను సతాయిస్తే మంచిగ ఉండదని డైరెక్ట్‌గా చెప్పేస్తుంది రాధ. దేవి సంతోషం కోసం రాధ మాధవ్ చెప్పినట్లు వింటుందా? లేకపోతే మాధవ్ మళ్లీ ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తాడో చూడాలంటే తరువాయి భాగం వరకు ఆగాల్సిందే..