ఆశ్రమం నుంచి వచ్చిన దేవి మాధవ్‌తో ఇక తన తండ్రి గురించి అడగనని మాటిస్తుంది. దానికి తన ప్లాన్ అంతా ఫెయిల్ అయిందని బాధపడిన మాధవ్.. మళ్లీ కొత్త స్కెచ్ వేస్తాడు. ఆదిత్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనని వాడుకోవాలనుకుంటాడు. ముగ్గురు రైతుల్ని ఇంటికి పిలిచి వారి దగ్గరి నుంచి కాగితాలు తీసుకుంటాడు. ఆ తర్వాత ఆగస్టు 17 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
పటేలా.. కారు అంతా మంచిగనే ఉంది అంటూ ఆదిత్యని పిలుస్తాడు భాషా. సత్యతో పాటు కిందికి వచ్చిన ఆదిత్యకు అపుడే ఫోన్ వస్తుంది. ‘హలో ఆఫీసర్. ఒక చిన్న సమస్య వచ్చింది’ అంటూ మాధవ్ కాల్ చేస్తాడు. రైతులకు సమస్య వస్తే వాళ్లే ఆఫీసుకు వచ్చి కలుస్తారు. లేకపోతే నేనే వెళ్లి కలుస్తా. మద్యలో నీ రాయబారమేంటని’ ప్రశ్నిస్తాడు ఆదిత్య. నేనే చూసుకుంటానని రైతులకు మాటిచ్చాను. మరీ నేను ఆఫీసుకు రావడం కన్నా నువే మా ఇంటికి వస్తే బాగుంటుంది ఆఫీసర్ అంటాడు’ మాధవ్. ఇన్ కేస్ నువ్ రాలేదనుకో.. అంటూ ఫోన్ కట్ చేస్తాడు. మాధవ్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. మళ్లీ ఏదో చేయబోతున్నాడు. ఇంటికి వెళ్లి కలవడమే మంచిది అని బాషాని కారు ‘కీ’స్ అడుగుతాడు. నేను కూడా వస్తానని బాషా చెప్పడంతో తనమీద అరుస్తాడు ఆదిత్య.
భాగ్యమ్మని కూరగాయలు తీసుకురమ్మని బయటకు పంపిస్తాడు మాధవ్. రుక్కుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్తుంది భాగ్యమ్మ. రాధతో నీ ఆఫీసర్ వస్తున్నాడు అని మాధవ్ చెప్తుండగా పిల్లలు అక్కడికి వస్తారు. మిమ్మల్ని స్కూల్‌కి తీసుకెళ్తాడు వెళ్లి రెడీ అవమని పంపిస్తాడు మాధవ్. ఆ తర్వాత రాధతో.. ‘నీకు చెప్పకుండా ఆఫీసర్ ఇంటికి రావడమేంటని ఆలోచిస్తున్నావా? నేనే రమ్మని చెప్పాను. ఇప్పుడు జరగబోయే ఈ మాధవ నాటకంలో ఆఫీసర్ కూడా ఉంటే బాగుంటుందని రమ్మని చెప్పాను’ అంటాడు.
సీన్ కట్ చేస్తే.. సత్య ఆదిత్య గురించి, తన ప్రవర్తనలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అక్క ఆ ఇంట్లో ఉందని తెలిశాక కూడా ఇంటికి టైంకు వచ్చేవాడు. అలాంటిది ఇపుడు ఎప్పుడు వస్తున్నాడో ఎపుడు వెళ్తున్నాడో తనకే తెలియట్లేదు. ఇంతకు ముందు చిన్న పనైనా పెద్ద పనైనా బాషా లేకుండా అడుగు బయటపెట్టేవాడు కాదు. బాషా వస్తానన్న కూడా వద్దు అంటున్నాడంటే ఏదో ఉంది. ఆదిత్య రోజూ అక్కని కలుస్తున్నాడా? అంటూ వివిధ రకాలుగా మనసులో ఆలోచిస్తూ కంగారుపడుతుంది. ఆదిత్యని నేనే అనుమానించాల్సి వస్తుంది. ఎందుకు నాకీ పరిస్థితి తీసుకొచ్చావ్ అంటుంది. ఆ తర్వాత రాధ, మాధవ్‌లు ఆదిత్య కోసం ఎదురుచూస్తుంటారు. కొద్దిసేపట్లోనే అక్కడ వాలిపోతాడు ఆదిత్య. అది చూసి సీన్ ఇపుడు స్టార్ట్ అవుతుందంటాడు మాధవ్. ఏంటి రమ్మన్నావ్ అని ఆదిత్య అడగ్గా.. కూర్చోండి ఆఫీసర్ అంటూ బదులిస్తాడు మాధవ్. అంతలోనే దేవి, చిన్మయి వచ్చి స్కూల్‌కి తీసుకువెళ్లమని అడుగుతారు. దేవీ తర్వాత వస్తుంది నువ్వెళ్లి కారులో కూర్చోమని చిన్మయిని పంపిస్తాడు మాధవ్. ఆదిత్యను కూర్చోమని రాధని వెళ్లి కాఫీ తీసుకురమ్మంటాడు.
అంతలోనే నలుగురు పిల్లలు అనాధశరణాలయం నుంచి డొనేషన్ కోసం వచ్చామని లోపలికి వస్తారు. రండమ్మా అంటూ వాళ్లని ఇంట్లోకి పిలిచిన మాధవ్.. గదిలో ఉన్న పర్సు తీసుకురమ్మని దేవిని పంపిస్తాడు. నాటకంలో భాగంగా దేవి వినాలని.. అనాధ పిల్లలతో మాట్లాడి డబ్బులు ఇస్తాడు మాధవ్. అందులో ఉన్న ఒకమ్మాయితో ‘పాపా నీ గురించి నాకు తెలుసు. మీ నాన్న తాగుబోతు. మిమ్మల్ని పట్టించుకోకుండా తిరగడం వల్లే నువ్ అనాధవయ్యవ్’ అంటూ రెచ్చగొడతాడు. ఆ పాప మా నాన్న మీకు తెలుసా.. ఒకసారి మా నాన్నని చూపించండి అంటూ వేడుకుంటుంది. నేను పగలు ఎంత ఆనందంగా ఉన్నా.. ఎవరూ లేరన్న బాధ రాత్రి పూట నిద్ర పోనివ్వట్లేదు సర్. మా నాన్న తాగుబోతయిన పర్వాలేదు ఎక్కడుంటాడో చెప్పండి సార్ అంటూ బతిలాడుతుంది. తండ్రి ఎంత తాగుబోతు అయిన చూడాలని కోరిక ఉంటుంది కదా అంటాడు మాధవ్. ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానంటూ మాటిస్తాడు. ఆ పాప బాధ విన్న దేవి మళ్లీ ఆలోచనలో పడుతుంది.
మాధవ్ మాటలకు కోపంతో రగిలిపోయిన ఆదిత్య అతడి చొక్కా పట్టుకుంటాడు. లేని తండ్రిని తీసుకొస్తానని ఆ పాపకు ఎందుకు ఆశ చూపించావని తిడతాడు. ‘కూల్ ఆఫీసర్ సార్. మరి నువ్ దేవికి తండ్రివై ఉండి కూడా తనకెందుకు నిజం చెప్పట్లేదు. మంచిగా ఉన్న నాలోని మృగాన్ని లేపింది మీరిద్దరూ’ అంటాడు మాధవ్. నువ్ మాటలతో చెప్తే వినేలా లేవని కొట్టేందుకు మాధవ్ పైకి చేతు ఎత్తుతాడు. అంతలోనే దేవి రావడం చూసి ఆగిపోతాడు. అక్కడికి వచ్చిన దేవి.. సారూ నాకు మా నాయన కావాలి. మంచోడు కాకపోయినా నాకైతే నాయనే కదా. నేను చూడాలి. మాట్లాడాలి.. అంటుంది ఏడుస్తూ. అలాగేనమ్మా.. స్కూల్‌కు వెళ్దాం పద అంటూ దేవిని తీసుకెళ్తాడు. అపుడు రాధ.. వెళ్లాకా నాకోసారి ఫోన్ చేయ్ పెనిమిటి అంటుంది. ఆదిత్యతో రాధ ఏం మాట్లాడనుందో తెలుసుకోవాలంటే తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..