మాధవ్‌కి ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచిస్తుంది రాధ. మరోవైపు ఎవరి కంటపడకుండా రాధ దగ్గరకి వచ్చేస్తుంది భాగ్యమ్మ. దాంతో చాలా ధైర్యంగా ఫీల్ అవుతుంది రాధ. మరోవైపు ఆదిత్య ఆఫిస్‌కి వెళ్లకుండా సొంత పనులు చూసుకుంటుండడంతో ఇబ్బంది పడుతుంది సత్య. అతని హితబోధ చేస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 4న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
దేవిని కరాటే క్లాస్ నుంచి తీసుకొస్తుంటుంది భాగ్యమ్మ. ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి వస్తుంటారు. అప్పుడు మాటల మధ్యలో.. ‘అది కాదు అమ్మమ్మా.. మా స్కూల్ దగ్గర పండ్లు అమ్ముకునే దానివి కదా..? ఇప్పుడు ఎందుకు మా ఇంటిపనికి వచ్చావ్’ అని అడుగుతుంది. ‘అమ్ముకునుడు కంటే.. ఈ పని నమని వచ్చినా బిడ్డా.. మీ అమ్మ మొన్న కనిపించినప్పుడు.. నాకు సాయంగా వచ్చేయ్ అంది.. అందుకే వచ్చేశాను..’ అని చెబుతుంది భాగ్యమ్మ. వెంటనే మా అమ్మ చాలా మంచిది. అందరిని సొంతోళ్ల చూసుకుంటుంది. అందుకే మా అమ్మని నువ్వు మంచిగా చూసుకోవాలి అని భాగ్యమ్మతో అంటుంది దేవి. మంచిగా చూసుకుంటా.. ఎందుకంటే రాధ నీకు తల్లైతే నాకు బిడ్డ అంటుంది భాగ్యమ్మ. దేవికి అనుమానం రావడంతో బిడ్డలాంటి అని కవర్ చేస్తుంది భాగ్యమ్మ. తర్వాత కరాటే గురించి భాగ్యమ్మ అడుగుతూ.. చిన్నపిల్లవి నీకెందుకు బిడ్డా కరాటే అంటుంది. దానికి.. మా నాయన్ని కొట్టడానికి అని మాధవ్ చెప్పిన విషయాలను భాగ్యమ్మకు చెబుతుంది దేవి. అదంతా విన్న భాగ్యమ్మ.. ‘బిడ్డ మనసులో ఎంత విషం నింపిండు కొడుకు’ అని తిట్టుకుంటుంది. అది తప్పు బిడ్డ.. తండ్రిని కొట్టుడేంది. చాలా పెద్ద తప్పు అని దేవికి హితబోధ చేస్తుంది. దాంతో ఎవరికీ కరాటే నేర్చుకోవడానికి కారణం చెప్పగూడదని పిక్స్ అవుతుంది దేవి.
మరో సీన్‌లో.. దేవుడమ్మ రుక్మిణీ ఫొటో పట్టుకుని ఎమోషనల్ అవుతోంది. ‘అత్తమ్మ.. అత్తమ్మ.. అంటూ ఎంత బాగా పిలుస్తూ తిరిగేదానివి. ఎందుకు మమ్మల్ని ఇలా వదిలేసి పోయావు. నువ్వు వెళ్లిపోయినప్పటి నుంచి తలచుకోని రోజే లేదు. నీకేం కష్టం వచ్చింది? నువ్వు ఎందుకు నా దగ్గరకు రావట్లేదు?’ అంటూ తలుచుకుని ఏడుస్తుంది. ఇంతలో ఆమె భర్త వస్తే.. అతనికి చెప్పుకుని ఏడుస్తుంది. దాంతో అతడు త్వరలోనే రుక్మిణీ వచ్చేస్తుంది అని ధైర్యాన్ని ఇస్తాడు. అందరూ అదే చెబుతున్నారు. కానీ ఎప్పుడు రుక్మిణి కోసం వెతికించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక సత్య అయితే అమెరికా వెళ్లే ఆలోచననే వదిలేసుకుంటుంది. ఆదిత్య మారతాడని నాకు నమ్మకం లేదు ఆంటీ అంటూ దేవుడమ్మకే చెప్పుకుని బాధపడుతుంది.
ఆ తర్వాత రాధ వంట చేస్తుండగా అక్కడికి వస్తుంది దేవి. అమ్మ నేను ఎవరి పోలిక. నాయనలాగుంటనా.. నీలాగా అని ఆరా తీస్తుంది. దానికి.. నువ్వు అచ్చం మీ నాయన లాగుంటవ్. నీ ముక్కు, మొహం అలాగే ఉంటాయి. నిన్ను చూస్తే నా పెనిమిటి గుర్తు వస్తాడని చాలా మురిపెంగా చెబుతుంది రాధ. అంతలోనే ఏదో అనుమానం వచ్చి.. ఇప్పుడేందుకు అడుగుతున్నావు బిడ్డ. నీకు ఏం కావాలి అని అడుగుతుంది. ఏం లేదు.. అంటూ తనకి అవసరమైన సమాచారం రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవి.
అక్కడ ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది సత్య. అదే సమయంలో అక్కడికి వచ్చిన దేవుడమ్మ ఏం ఆలోచిస్తున్నావని ప్రశ్నిస్తుంది. ఆదిత్య ఆలోచన విధానం బాగాలేదు.. ఇంటి విషయాల గురించి కంటే.. బయటి సమస్యల గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. ఆదిత్య ఇలాగే ఉంటే అమెరికా వెళ్లి ఉపయోగం ఉండదు. అందుకే అమెరికా వెళ్లే ఆలోచనని విరమించుకున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సత్య. దానికి.. బయటి సమస్యలు అక్కడే వదిలేసి రారా అని చాలా సార్లు ఆదిత్యకి చెప్పాను. కానీ వాడు వినట్లేదు. అటు వాడికి చెప్పలేక.. ఇటు సత్య బాధ చూడలేక ఇబ్బంది పడాల్సి వస్తోందని తనలో తాను అనుకుంటుంది దేవుడమ్మ.
ఇక దేవి అడిగిన ప్రశ్నలను తలుచుకుంటూ అల్లాడిపోతుంటుంది రాధ. అప్పుడే అక్కడికి వచ్చిన భాగ్యమ్మ ఏం ఆలోచిస్తున్నావని అడిగితే ఏం లేదని చెబుతుంది. నువ్వు నీ పెనిమిటి, బిడ్డ గురించే ఆలోచిస్తావని నాకు తెలుసంటుంది భాగ్యమ్మ. ఎలాగైనా దేవిని వాళ్ల నాయనా దగ్గరకి పంపాలని అనుకుంటున్నట్లు చెబుతుంది రాధ. మళ్లీ దేవి అక్కడికి వస్తుంది. ‘అమ్మా నీకు నాయనాకి పెళ్లి ఎప్పుడు అయ్యింది? నాయానా ఏ ఊరిలో ఉంటాడు. మీరు నేను పుట్టుకముందు ఏ ఊరిలో ఉండేవారు’ అని వరుస ప్రశ్నలు వేస్తుంది. ఆ ప్రశ్నలకు రాధ, భాగ్యమ్మ షాక్ అవుతారు. అదేం వద్దు గానీ.. నేను ఒకరిని కొట్టాలే నాకు కరాటే నేర్పిద్దు పదా దేవిని అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది భాగ్యమ్మ. దేవి మాత్రం కోపంగా.. ‘నాకు నువ్వు చెప్పే కథలొద్దు.. మా నాయన కథ కావాలే.. అమ్మ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. నాయనా గురించి మాత్రం చెప్పదు’ అంటుంది దేవి కోపంగా. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.