Devotional: ఇంట్లో నిత్యం అశుభాలు జరుగుతుండటం, అనుకున్న పనులు జరగకపోతే ఏల్నాటి శని పట్టిందంటూ పెద్దలు, పండితులు చెబుతుంటారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఈ పదాన్ని వినే ఉంటారు. అసలు ఏల్నాటి శని అంటే ఏమిటి? దీన్ని తొలగించుకోవడానికి శాస్త్రంలో ఏం చెప్పారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నవగ్రహాల్లో ఒకడైన శని దేవుడిని శనైశ్చరుడు అని కూడా పిలుస్తారు. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా అడుగులు వేసేవాడు అని అర్థం. సూర్యుడి చుట్టూ తిరగడానికి శనికి సుమారు 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ ప్రయాణంలో శని ఒక్కోరాశిలో దాదాపు రెండున్నరేండ్లు సంచరిస్తాడు. ఒక వ్యక్తి జన్మరాశి నుంచి నాలుగోరాశిలో శని ఉంటే దానిని అర్ధాష్టమ శని అంటారు. ఎనిమిదో రాశిలో ఉన్నప్పుడు అష్టమ శనిగా పిలుస్తారు. జన్మరాశికి 12వ రాశిలో, అదేరాశిలో, రెండో రాశిలో శని ఉండే కాలాన్ని ఏల్నాటి శని అంటారు.
ఏల్నాటి శని ఎన్నేళ్లు ఉంటుందంటే?
మొత్తంగా ఏల్నాటి శని ప్రభావం సుమారు ఏడున్నరేండ్లు ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గోచార రీత్యా అర్ధాష్టమ, అష్టమ, ఏల్నాటి శని ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయట. ఈ కాలంలో ఆస్తినష్టం, ఆరోగ్య భంగం, ఉద్యోగంలో ఒత్తిడి తదితర దుష్ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేసింది. అయితే శని దేవున్ని భక్తిప్రపత్తులతో పూజించి, బీద వారికి సాయపడితే ప్రసన్నుడు అవుతాడని పండితులు చెబుతుంటారు.
Devotional: శని పోవడానికి ఏం చేయాలి?
గోచారరీత్యా, జాతకరీత్యా శని దోషాలు తొలగిపోవాలంటే ప్రతీ శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించడం మంచిమార్గం. నవగ్రహాలు ఉన్న ఆలయమైతే శనిదేవునికి ప్రదక్షిణలు చేయడం, తైలాభిషేకం చేయడం మంచిది. ఏదైనా శనివారం నాడు కానీ, శని త్రయోదశి నాడు గానీ నువ్వులనూనెతో తల స్నానం చేసి, రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి, శనైశ్చర విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకిస్తే దుష్ప్రభావం తొలగిపోతుందట. ఇనుముకు శని అధిపతి కాబట్టి ఇనుప వస్తువులు దానం చేసినా శని దోషం పోతుందని విశ్వసిస్తారు. ముఖ్యంగా, దివ్యాంగులు, అనాథలకు సాయం చేస్తే శనైశ్చరుడు తక్షణం ప్రసన్నుడు అవుతాడని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి.