గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో సినిమా టికెట్ల రగడ నడుస్తుంది. పెద్ద సినిమాలకి నిర్మాతలు కోరుకున్నట్లు పెంచడం, చిన్న సినిమాలకి తగ్గించడం చేస్తున్నారు. ఇలా సినిమా స్థాయి బట్టి టికెట్ రేట్ల విషయంలో వ్యత్యాసం ఉంటుంది. ఇక ఈ టికెట్ ధరలపై ఓ వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే మరో వర్గం ప్రేక్షకులు ఈ రోజుల్లో టికెట్ రేట్లు ఆ మాత్రం ఉండటంలో తప్పులేదనే విధంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా పెద్ద సినిమాలకి టికెట్ రేట్లు పెంచేసి మొదటి వారం రోజుల్లోకి కలెక్షన్స్ మొత్తం రాబట్టాలని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే టికెట్ ధరలు పెంపు పెద్ద సినిమాలకి కొంత మైనస్ అవుతుందనే మాట వినిపిస్తుంది.
అలాగే మీడియం రేంజ్ సినిమాలకి కూడా రేట్లు 150 రూపాయిల పైనే ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు సినిమాలకి వెళ్లలేని పరిస్థితి వస్తుంది. ఇక ఓటీటీ అందుబాటులో ఉండటంతో హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫామిలీతో పాటు సినిమాలు చూడొచ్చని నిర్ణయించుకొని థియేటర్ వైపు వెళ్లేవారి సంఖ్య తగ్గిపోయింది. ఫ్యాన్స్ మాత్రమే స్టార్ హీరోల సినిమాలకి రెండు రోజుల పాటువెళ్లి తరువాత ఆగిపోతున్నారు ఇక మామూలు ఆడియన్స్ అయితే సినిమా టాక్ బట్టి తీరిగ్గా వెళ్దామని అనుకుంటున్నారు. ఇలా చాలా కారణాల కారణంగా టికెట్ ధరలు నిర్మాతలని భయపెట్టే స్థాయికి వచ్చేసాయి. దీంతో టికెట్ ధరలపై మళ్ళీ నిర్మాతలు అందరూ పునరాలోచనలో పడ్డారు.
అలాగే ప్రభుత్వాలు కూడా టికెట్ రేట్లు నిర్ణీత రుసుము నిర్ణయించింది. ఏపీలో దీనిపై ప్రత్యేక జీవో కూడా తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే టికెట్ రేట్ల కారణంగా, అలాగే ప్రేక్షకులు థియేటర్స్ కి రాకపోవడంతో నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలని కూడా ఆలోచనలు చేశారు. అలాగే హీరోల రెమ్యునరేషన్ ల విషయంపై కూడా చర్చ నడిచింది. అయితే తాజాగా టికెట్ రేట్లపై బడా నిర్మాత దిల్ రాజు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టికెట్ రేట్లు పెద్ద సినిమాలకి మాత్రమే పెరుగుతాయని, మిగిలిన అన్నింటికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు మాత్రమే కొ సాగుతాయని స్పష్టం చేశారు. సినిమా సినిమాకి తగ్గించడం, పెంచడం ఉండవని చెప్పారు. జీఎస్టీతో కలుపుకొని 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లకి 200 రూపాయిలు ధరలు నిర్ణయించినట్లు చెప్పారు