కూతురు పెళ్లి చేయడం ప్రతి తండ్రికి ఒక బాధ్యత. ఆ బాధ్యతని పూర్తి చేయడానికి తాను ఎంత కష్టాన్ని అయినా భరిస్తాడు. తన కూతురుకి కాబోయే వాడు మంచి వాడు కావాలని, తనకంటే ప్రేమగా చూసుకునేవాడు అయ్యి ఉండాలని ఎంతో వెతికి మరీ తీసుకొచ్చి కూతురుకి నచ్చితేనే పెళ్లి ఖాయం చేస్తాడు. కొంత మంది తల్లిదండ్రులు కుమార్తె ఇష్టపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎలా చేసిన తమ కూతురు భవిష్యత్తు బాగుండాలని అందరికంటే ఎక్కువగా ఆలోచించి, పరితపించే వ్యక్తి తండ్రి. తండ్రి ప్రేమ కేవలం కూతురు పెళ్లి చేసి అప్పగించే సమయంలో కనిపిస్తుంది. అంత వరకు భావోద్వేగాలని మనసులో అదిమి పెట్టుకున్న ఒక్కసారిగా అవి కన్నీళ్ళ రూపంలో బయటకి వచ్చేస్తాయి. ఓ వైపు కుమార్తె సంతోషం చూస్తూ ఆనందం, మరో వైపు ఆమె తనని విడిచి వెళ్ళిపోతుంది అనే బాధ రెండు ఒకేసారి తండ్రి కళ్ళల్లో కనిపిస్తాయి. అలాంటి సంఘటనలు చూసినపుడు తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో అందరికి తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి ఘటనకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెడ్డింగ్ వీడియోలు ఈ మధ్యకాలంలో భాగా పాపులర్ అయ్యాయి. పెళ్ళిలో జరిగే ప్రతి సంఘటనని దృశ్య రూపం చేసి భద్రపరుచుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి పెళ్లి వీడియోలో కూతురుకి అప్పగింతలు చేసిన తండ్రి వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించాడు. కుమార్తె మెళ్ళో వరుడు తాళి కట్టే సమయంలో కూడా తండ్రి చిన్న పిల్లాడి తరహాలో కన్నీళ్లు పెట్టుకోవడం కనిపించింది. ఆ కన్నీళ్ళలో కుమార్తె మీద అతనికున్న అంతులేని ప్రేమ కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో దీనిపై చాలా మంది ఆసక్తికర కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా తండ్రి ప్రేమకి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ వీడియో ఉందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.