తెలుగు సినీపరిశ్రమలో ఇప్పుడు పెద్ద ఎవరు? అనే దానిపై చర్చ చాలా రోజులుగానే సినీ ఇండస్ట్రీలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ పెద్దరికంపై మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో స్పందిస్తూ.. తాను ఇండస్ట్రీ బిడ్డగా సమస్య ఉన్నప్పుడు ముందు ఉంటానే తప్ప దుప్పటి పంచాయతీలు చేయనని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీనియర్ నరేష్ వంటి వారైతే ‘మా’ ఎన్నికలు జరిగిన సందర్భంలో మోహన్ బాబు వంటివారే ఇండస్ట్రీ పెద్ద కావలి అని అన్నారు. ఇండస్ట్రీ పెద్దరికంపై కొన్ని రోజుల పాటు పెద్ద రేంజ్‌లో డిస్కార్షన్లు జరిగినా ఎందుకనో తర్వాత సైలెంట్‌గా మారిపోయింది. అయితే అడపా దడపా కొంత మంది వ్యక్తులు మాత్రం సినీ ఇండస్ట్రీలో పెద్దరికం అనే ప్రశ్న వచ్చినప్పుడల్లా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. తాజాగా ఈ లిస్టులో సీనియర్ నటుడు, హీరో శ్రీకాంత్ కూడా చేరిపోయారు.
రీసెంట్‌గా ఆయన సినీ ఇండస్ట్రీలో పెద్దరికం గురించి మాట్లాడుతూ ‘‘నాకు తెలిసినంత వరకు చిరంజీవిగారే ఇండస్ట్రీ పెద్ద అని అన్నారు. చాలా కాలంగా చిరంజీవి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఎవరికీ ఏ సమస్య వచ్చినా మెగాస్టార్‌గారే అందరికి కనిపిస్తున్నారు. అందుకు తగినట్లు ఆయన కూడా ముందుండి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం కూడా మూవీ టికెట్స్ రేట్స్‌కు సంబంధించిన విషయం మాట్లాడేటప్పుడు చిరంజీవిగారినే ఆహ్వానించింది. దాన్ని బట్టి ఇండస్ట్రీలో ఆయన స్థానం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు’’ అని తెలిపారు శ్రీకాంత్.
ఇక శ్రీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్‌గా అఖండ చిత్రంలో పవర్ ఫుల్ విలన్‌గా నటించి మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడు రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తున్నారు. ఒకవైపు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తూ శ్రీకాంత్ రాణిస్తున్నారు.