రోడ్ షోలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లపై నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ని తీసుకొచ్చింది. దీనిని హడావిడిగా అమల్లోకి తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద ఆయుధంగా ప్రయోగించింది. ప్రతిపక్షాల రాజకీయ పర్యటనలని అడ్డుకోవడానికి దీనిని ఉపయోగించుకుంది. పోలీసులని రంగంలోకి దించి చంద్రబాబు కుప్పం పర్యటనని కూడా ఇదే జీవో పేరుతో అడ్డుకున్నారు. ఈ జీవోతో ప్రభుత్వం ఏదో గొప్ప పని చేసి ప్రజల ప్రాణాలు కాపాడటానికి అనేంత కలరింగ్ ఇచ్చింది. అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అదేపనిగా గొప్ప జీవోని తీసుకొచ్చామని ఊదరగొట్టారు. అయితే ఎప్పటిలాగే ప్రభుత్వం చట్టవిరుద్ధంగా తీసుకొచ్చే జీవోలపై హైకోర్టు మరోసారి మొట్టికాయలు పెట్టడంతో పాటు ఈ జీవోకి ఎలాంటి ప్రామాణికం లేదని సస్పెండ్ చేసింది.
ఈ నెల 23 వరకు జీవో నెంబర్ 1ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీపీఐ నేత రామకృష్ణ ఈ జీవోపై హైకోర్టుని ఆశ్రయించారు. ప్రజల ప్రాథమిక హక్కులు హరించే విధంగా ఈ జీవో ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించిన హైకోర్టు బ్రిటిష్ కాలం నాటి జీవోని ఇప్పుడు అమల్లోకి తేవడంతో పాటు అప్పుడు లేని నిబంధనలని కూడా ప్రభుత్వం విధించడం చట్టవిరుద్ధం అని పేర్కొంది. ఇది పూర్తి నిబంధనలకి విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానిస్తూ ఈ నెల 23వరకు జీవోని సస్పెండ్ చేసింది.
అలాగే 20లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ఇక ఈ తీర్పు అనంతరం సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ అన్ని పార్టీలకి వర్తిస్తుందని ఈ జీవో తీసుకొచ్చిన మరుసటి రోజే రాజమండ్రిలో ముఖ్యమంత్రి జగన్ రోడ్ షో నిర్వహించారని అన్నారు. అలాగే ప్రతిరోజు వైసీపీ నాయకులు రోడ్ షోలు చేస్తున్నారని తెలిపారు. వారికి లేని నిబంధన కేవలం ప్రశ్నించే ప్రతిపక్షాల మీద ప్రయోగించడం గొంతునొక్కే ప్రయత్నమే అని అన్నారు. అందుకే న్యాయస్థానం సైతం ఈ జీవోని సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు.