Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఏం చేసినా తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా తిలకిస్తారు. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన ఘనత ఆయనది. తెలుగు సినిమాలు 1000 కోట్ల క్లబ్‌లో నిలిచాయంటే కూడా అది ఆయన పుణ్యమే. రాజమౌళి ఏదైనా సినిమా చేస్తున్నారంటే చాలు.. దాని అప్‌డేట్స్ ఇవ్వడానికి మీడియా.. తెలుసుకోవడానికి ప్రేక్షకులు తెగ ఆరాటపడుతుంటారు. ‘బాహుబలి’ సినిమాతో తన సత్తాను ప్రపంచానికి చాటారు. ఇక తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’తో రాజమౌళి స్టామినా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసింది. హాలీవుడ్ దర్శకులు, రచయితలు సైతం ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.
Rajamouli : అధికారికంగా స్పందించని నెట్‌ఫ్లిక్స్..
ఇప్పుడు జక్కన్న గురించి ఓ ఆసక్తికర వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఇక మీదట ఆయన ఒక ప్రముఖ ఓటీటీ సంస్థతో కలిసి పని చేయనున్నారట. అది మరేదో కాదు.. నెట్‌ఫ్లిక్స్. ఇందులో భాగంగా ఓ సిరీస్‌ను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోందట. ఈ విషయమై రాజమౌళిని సంప్రదించగా, ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు చర్చల దశలో ఉందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై ఇటు రాజమౌళి బృందం కానీ.. అటు నెట్‌ఫ్లిక్స్ టీమ్ కానీ అధికారికంగా స్పందించలేదు.
అప్పట్లో ‘బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఓ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ మేకింగ్ సరిగా లేదని.. ఆశించిన స్థాయిలో రావడం లేదని భావించిన సంస్థ కొన్ని రోజులకే ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ మొత్తం స్క్రిప్ట్, తెరకెక్కించిన సన్నివేశాలను సైతం పక్కన పెట్టేసింది. ఇక ఇప్పుడు ఏదైనా ప్లాన్ చేస్తే రాజమౌళి సారధ్యంలోనే చేయాలని భావించిందో ఏమో కానీ తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఆయనను సంప్రదించిందనే టాక్ బాగా వినిపిస్తోంది. మొత్తానికి ఓటీటీలో ఓ ప్రాజెక్టు రాజమౌళి చేయబోతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాజమౌళి ఓటీటీలోనూ తన ఫుట్ ప్రింట్‌ను వేయడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించేందుకు జక్కన్న సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.