ఎమోషనల్‌గా మాట్లాడి జ్ఞానాంబని కన్విన్స్ చేస్తాడు గోవిందరాజులు. అదే సమయంలో రామా మాట్లాడడంతో.. జానకి కాళ్ల మీద పడడంతో పూర్తిగా మారిపోయి కొడుకు, కోడలిని క్షమిస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత అత్తకి వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది జానకి. అయితే.. అత్తను మోసం చేశాననే బాధ ఉండడంతో ఐపీఎస్ చదువుకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంటుంది. అదే విషయం చెబుతు తన పుస్తకాలను కొట్టుకు తీసుకువెళ్లమని రామాకి చెబుతుంది జానకి. ఆ సంభాషణని గది బయట ఉండి జ్ఞానాంబ వింటూనే ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 5 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘నా ఐపీఎస్ పుస్తకాలు నాకు ఉపయోగపడవు. కనీసం స్వీట్ షాపులో పొట్లాలు కట్టడానికి ఉపయోగించుకోండి’ అంటుంది జానకి బాధగా. దానికి అమ్మని చదువు విషయమై కన్వీన్స్ చేస్తానంటాడు రామా. అయినప్పటికీ.. లేదు రామాగారు నా ఐపీఎస్ కల గతం. ఇక నా చదువు విషయాన్ని వదిలేద్దాం.. ఐపీఎస్ అనేది చెదిగిపోయిన కల.. దయచేసి నన్ను అర్ధం చేసుకోండి ప్లీజ్’ అని దండం పెడుతూ కన్నీళ్ల పర్యంతం అవుతుంది జానకి. అమ్మని ఎలాగైనా మార్చి.. జానకి ఐపీఎస్ చదివేలా చేయాలి అనుకుంటాడు రామా. అయితే.. ఇదంతా విన్న జ్ఞానాంబ హాలులో కూర్చుని జానకి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడే రామా.. జానకి ఐపీఎస్ పుస్తకాలను తీసుకుని వచ్చి తల్లి ముందు పెడతాడు. ‘జానకి గారు ఐపీఎస్ చదువుని వదిలేస్తానని నిర్ణయించుకున్నారమ్మా.. కలలో కూడా చదువు గురించి ఆలోచించరు.. నువ్వు నా గురించి భయపడాల్సిన అవసరం లేదమ్మా.. నువ్వు నిశ్చితంగా ఉండు’ అని చెబుతాడు. పుస్తకాలతోపాటు జానకి తండ్రి ఇచ్చిన పెన్‌ని జ్ఞానాంబ ముందు ఉంచుతాడు రామా. ‘నేను నీ కోసం కొన్న పెన్నుని జానకి గారి నాన్నగారు నా దగ్గర నుంచి తీసుకున్నారు. అదే పెన్నుతో జానకిగారు పరీక్ష రాయాలని కోరుకున్నారు. కానీ ఆయన ప్రాణం వదిలేస్తూ.. ఈ పెన్‌ని నాకు ఇచ్చారు. ఆరోజు నాకు తెలియదు.. జానకి బరువు బాధ్యతల్ని నాకు అప్పగించారని.. ప్రాణం పోయే ముందు జానకి తల్లిదండ్రులు నాకు పరిచయం అయ్యారు. వాళ్ల అమ్మాయిని తెలియకుండానే నా జీవితంలోకి పంపించారు.. కానీ వాళ్ల కూతురు కలని తీర్చలేకపోయామని పైనున్న వాళ్లు బాధపడుతూనే ఉంటారు. జానకిగారు ఐపీఎస్ అయితే సమాజానికి చాలామంచి చేస్తారు. చదువకుండా ఆపేస్తే మంచి ఆశయం చచ్చిపోతుంది.. అనుకున్నది సాధించలేకపోయాననే బాధ.. జానకిగారిని జీవితాంతం వెంటాడుతుంది. నువ్వు చదువుకి వ్యతిరేకం కాదని నాకు తెలుసు.. అందుకే చాలామందికి సహాయం చేస్తుంటావు. కేవలం మామయ్య లాంటి పరిస్థితి నాకు వస్తుందని భయపడుతున్నావు అని తెలుసు.. జానకిగారికి భర్తని, అత్తారింటిని గౌరవించడం తప్ప అవమానించడం తెలియదమ్మా.. మరి నా మీద ప్రేమ జానకి ఐపీఎస్‌కి శాపం కావడం ఎంతవరకూ సమంజమని నువ్వే ఆలోచించమ్మా’ అని బాధగా అంటాడు రామా. రామా మాట్లాడుతున్నప్పుడే గోవిందారాజులుతో సహా మిగిలిన కుటుంబ సభ్యులు అక్కడికి వస్తారు. రామా మాటలు విని అందరూ చాలా ఎమోషనల్ అవుతారు.
దీంతో గోవిందరాజులు మాట్లాడుతూ.. ‘జ్ఞానం.. నా నడుం పడిపోయి మంచానపడినప్పుడు.. రాముడు తన చదువుని త్యాగం చేసి ఇంటి బాధ్యతను తీసుకున్నాడు.. నా వల్లే వాడి చదువు ఆగిపోయిందని ఇప్పటికీ బాధపడుతుంటావు కదా.. మరి జానికి విషయంలో ఆమె కన్న తండ్రి పడిన ఆరాటం నీకు అర్థం కావటం లేదా.. జానకి స్థానంలో మన కూతురు వెన్నెల ఉంటే ఏం చేస్తావో ఒక్కసారి ఆలోచించు’ అని జ్జానాండకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. రామా సైతం.. జానకి చదవకపోతే నేను క్షేమంగా ఉంటానని నువ్వు అనుకుంటున్నావా.. తను బాధ పడుతుంటే భర్తగా ఎలా సంతోషంగా ఉండగలను అంటూ పుస్తకాలు తీసుకుని కొట్టుకు వెళుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మల్లిక అత్త మనసు కరగకపోవడం చూసి చాలా సంతోష పడుతుంది. నాలుగు సెంటిమెంట్ డైలాగులు కొడితే పోలేరమ్మ మారుతుందని ఎలా అనుకున్నారు వీళ్లు.. పిచ్చి కాకపోతేనూ మనసులో అనుకుంటుంది మల్లిక.
పుస్తకాలు తీసుకున్న రామా గడపదాటి వెళ్లిపోబోతుంటాడు. అప్పుడే రామా అని పిలుస్తుంది జ్ఞానాంబ. అది విని వెనక్కి వస్తాడు రామా. ఆ పుస్తకాలు అక్కడ పెట్టు అంటూ నిలబడుతుంది జ్క్షానాంబ. ‘ఈ రోజు ఈ కుటుంబం ఇలా ఉందంటే కారణం రామానే. వాడు ఆరేళ్ల వయస్సులో వాడు చదువుని పక్కన బెట్టి.. ఈ కుటుంబం కోసం కష్టపడ్డాడు. అప్పుడు కూడా వాడు అంత బాధ పడలేదు. అందుకే నా బిడ్డ సంతోషంగా ఉండాలని కన్నతల్లిగా తపన పడ్డాను. అందుకోసం వాడికంటే తక్కువ చదువుకున్న అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నా.. ఈరోజు నా బిడ్డ కంటతడి పెట్టుకుని ఓ మాట అన్నాడు. నా భార్య బాధపడుతుంటే నేను జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలనమ్మా అని.. నా బిడ్డ తన భవిష్యత్తుని త్యాగం చేసినప్పుడు కూడా ఇలా బాధపడలేదు.. నా భయమే నా కొడుకు క్షేమం కోసం అయినప్పుడు.. వాడు భాధపడుతుంటే నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను.. నా కొడుకు సంతోషంగా ఉంటేనే ఈ కుటుంబం క్షేమంగా ఉంటుంది. అందుకే.. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. జానకి ఐపీఎస్ చదవడానికి నేను ఒప్పుకుంటున్నా అని చెబుతుంది జ్ఞానాంబ. అది విని అందరూ సంతోషపడతారు. జానకి రామాకి ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఒక్క మల్లిక మాత్రం షాక్ అవుతుంది.
అంత సులువుగా ఒప్పుకుంటే పోలేరమ్మ ఎందుకవుతుంది. జానకి రామా సంతోషంగా ఒకరిని ఒకరి అభినందించుకుంటున్న తరుణంలోనే .. జానకి చదువుకి ఒప్పుకోవాలంటే నా షరతులకి ఒప్పుకోవాలి షాక్ ఇస్తుంది జ్ఞానాంబ. అదేంటి.. చదువుకి షరతులు ఏంటని రామా, గోవిందారాజులు ప్రశ్నిస్తారు. దానికి.. జానకి కల నీకు ముఖ్యమైనట్లే నా కొడుకు క్షేమంగా ఉండడం నాకు ముఖ్యం. నా కొడుక్కి ఏమన్నా అయితే తట్టుకోలేను. చదువుకున్నానే అహంతో నా తమ్ముడి భార్య వాడ్ని చులకనగా చూసింది.. ఆ అవమానంతో వాడు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి నా కొడుక్కి వస్తే.. అన్యాయం అయిపోయేది ఎవరు’ అని కోపంగా అంటుంది జ్ఞానాంబ.
నీ భయంలో అర్ధం ఉంది కానీ.. జానకి ఎప్పటికీ అలా చేయదమ్మా అని రామా అనడంతో.. ‘జానకిపై నీకు నమ్మకం ఉండొచ్చు.. కానీ నా బిడ్డ విషయంలో నాకు భయం ఉంది.. నేను చదువుకి వ్యతిరేకం కాదు.. నా బిడ్డల్ని చదివిస్తున్నాను.. అలాగే చాలామంది చదువు కోసం డబ్బు సాయం చేస్తున్నా. కేవలం నా తమ్ముడు విషయంలో జరిగింది నా కొడుకు విషయంలో జరగకూడదనే ఇలా చేస్తున్నా. నేను జానకి చదువుకి ఒప్పుకోవాలంటే.. నా షరతులకు ఒప్పుకోవాల్సిందే’ అని ఖరాఖండిగా చెప్పేస్తుంది జ్ఞానాంబ. దీంతో.. ‘అత్తయ్య గారూ.. ఐపీఎస్ కావాలన్నది నా చిన్ననాటి కల.. మీరు ఎలాంటి షరతులు పెట్టినా ఒప్పుకుంటాను’ అని జానకి అంటుంది.
దీంతో జ్ఞానాంబ మాట్లాడుతూ.. ‘నా తర్వాత ఇంటి బాధ్యతలు పెద్ద కోడలిగా నీపైనే ఉంటాయి.. నీ ప్రవర్తన ఇతరులకి కనువిప్పుగా ఉండాలి.. కానీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. చదువుకున్నాననే అహంకారం నీ భర్తపై చూపించకూడదు. చదువుని ఎంత ముఖ్యం అనుకుంటున్నావో.. సంసార బాధ్యతల్ని, భర్త సుఖసంతోషాలను అంతే ముఖ్యంగా భావించాలి. ఒక భార్యగా.. భర్తకి అందించాల్సిన సుఖ సంతోషాలు నీ చదువు కారణంగా దూరం కాకూడదు. నీ చదువు ఈ ఇంటికి వారసుడ్ని ఇవ్వడానికి ఆటంకం కాకూడదు. నీ చదువు వల్ల ఈ ఇంటి పరువు, ప్రతిష్టలకు భంగం కలగకూడదు.. గతంలో వెన్నెల విషయంలో జోక్యం చేసుకున్నట్టుగా ఏ విషయంలోనూ తల దూర్చకూడదు. వీటిలో నువ్వు ఏది తప్పినా.. నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది.. ఆ క్షణం నా నిర్ణయానికి తల వంచాల్సిందే.. ఎదురు ప్రశ్నలు వేయకూడదు’ అంటూ వరుసగా షరతులు విధిస్తుంది జ్ఞానాంబ. ఆ షరతులకి జానకి ఒప్పుకుంటుందా లేదా.. జానకి చదువుపై ఆ షరతుల ప్రభావం ఎలా ఉండబోతోందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..