ఐపిఎస్ చదువు కొనసాగాలంటే అత్త జ్ఞానాంబ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జానకికి. దీంతో మరేం దారి తోచక అత్తయ్యకు నిజం చెప్పాలని అనుకుంటుంది. జ్ఞానాంబ దగ్గరికి వెళ్లి నిజం చెప్పేలోపు గీత అనే గండం వస్తుంది. ఇక జూలై 22 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
అతినిద్ర మానుకుని జాగ్రత్తగా ఉంటే బంధాలు నిలబడతాయని గీతకి ఉపదేశం చేస్తుంది జ్ఞానాంబ. కోడలు జానకిని ఉదాహరణగా చూపిస్తూ ఆమెని పొగిడేస్తుంది. ఆమెకి చెప్పమని జానకికి చెబుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి పోగొట్టుకున్నది తిరిగిరాదు.. అది నమ్మకం అయినా జీవితం అయినా అని ఒక్క డైలాగ్ చెప్పేసరికి.. గీతలో చాలా మార్పు వస్తుంది. జానకి ఈ రోజుల్లో కూడా మీలాంటి కోడలు ఉంటుందా అని ఆశ్చర్యంగా ఉంది.. అత్తకి ఇచ్చిన మాట కోసం మీకు ఇష్టమైన చదువునే వదిలేశారు.. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నా సంసారాన్ని చక్కదిద్దుకుంటా అని అంటుంది గీత. గీత పేరెంట్స్ కూడా మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టినందుకు జానకికి ధన్యవాదాలు చెబుతారు. జ్ఞానాంబ అయితే జానకిని చూసి చాలా గర్వపడుతుంది. జానకిని చాలా మంచిపని చేశావ్ తల్లి అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకి పరిస్థితి కుడిలో పడ్డ ఎలుకలా అయిపోతుంది. అత్తకి నిజం చెప్పలేక వెళ్లిపోతుంది జానకి. ఇదంతా చాటు నుంచి గమనిస్తూనే ఉంటాడు రామా.
జానకి గదిలోకి రాగా.. అక్కడా రామా ఆందోళన పడుతూ ఉంటాడు. ‘మీ చదువు కాగితాలు లేకపోతే మీ ఐపీఎస్ కల చెదిరిపోతుంది కదా జానకి గారు.. కానీ అమ్మని అడిగి సర్టిఫికేట్స్ తీసుకునే పరిస్థితి లేదు.. ఇన్నాళ్లూ ఎవరికీ తెలియకుండా ఎంతో కష్టపడి మీ ఐపీఎస్ చదువుని కొనసాగిస్తున్నారు. త్వరలో మీ కల తీరుతుందనుకుంటున్న టైంలో ఇలా జరిగింది ఏంటండీ’ అంటూ రామా కంగారు పడుతుంటాడు. జానకి రామా సంభాషణని వినేస్తాడు గోవిందరాజులు. వెంటనే వారి ఎదురుగా వచ్చి నిలబడతాడు. గోవిందరాజులుని చూసి షాకవుతారు. జానకి రామాను చూస్తూ.. ‘ఒరేయ్ రాముడూ.. ఇది నిజమా.. మాకు తెలియకుండా జానకి చదువుకుంటుందా?’ అని ప్రశ్నిస్తాడు. దాంతో జానకి చదువుకొట్లేదు నాన్నా.. నేనే చదివిస్తున్నాను అని అంటాడు. ఆ మాట వినగానే.. గోవిందరాజులు షాక్ అవుతాడు.. ‘ఏంటి నువ్వు చదివిస్తున్నావా? ఒరేయ్ అసలు నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఏం చేస్తున్నావో నీకు అర్ధం అవుతుందా? మీ అమ్మ భయం గురించి నీకు తెలుసు కదా? అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? తన జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల తక్కువ చదువుకున్న అమ్మాయితో నీ పెళ్లి చేయాలని అనుకున్నది. కానీ జానకి డిగ్రీ చదివిందని తెలిసిన రోజున మీ అమ్మకి గుండె ఆగినంత పని అయ్యింది. ఈరోజు నువ్వే స్వయంగా జానకిని చదివిస్తున్నావని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అని అంటాడు గోవిందరాజులు. ‘పెళ్లి అనేది ప్రతి ఆడపిల్లకి అందమైన కల.. కానీ అది వరంగా మారకపోయినా తన జీవితానికి శాపంగా మాత్రం మారకూడదు. నాన్నా.. మనకి ఇష్టమైన వస్తువు దూరమైతేనే తట్టుకోలేం.. కానీ తనకి ప్రాణమైన ఐపీఎస్ కల చెదిరితే ఆమె బ్రతకగలదా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.. ఇందులో జానకి తప్పులేదు నాన్నా.. అమ్మకి ఇచ్చిన మాటకి కట్టుబడి.. తన చదువు వదిలేసింది. కానీ నేనే బలవంతం చేసి చదివిస్తున్నాను.. నాన్నా జానకి గారు ఐపీఎస్ సాధిస్తారు.. నాన్నా నువ్వే జానకి కలను బ్రతికించాలి.. నువ్వే అమ్మ దగ్గర నుంచి ఆ సర్టిఫికేట్ తీసుకుని రావాలి.. ఆ కాగితాలు ఇప్పించునాన్నా’ గోవిందరాజులుని బ్రతిమిలాడతాడు రామా. అది విని కరిగిపోయిన గోవిందరాజులు జ్ఞానాంబతో మాట్లాడడానికి వెళతాడు. ఈ సన్నివేశంలో ముగ్గురి నటన చాలా ఎమోషనల్ గా ఉంది. ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయ్యిపోయేలా నటించేశారు.
బయట డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతుంటుంది జ్ఞానాంబ. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గోవిందరాజులు ఆలోచనలో పడతాడు. జానకి చదువు కాగితాలు ఎలా ఇప్పించాలని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో జ్ఞానాంబ .. ‘ఏమండీ మీకో విషయం తెలుసా? ఈ రోజు ఓ ఫ్యామిలీ మనింటికి వచ్చింది. వాళ్ల అమ్మాయి కాపురానికి వెళ్లనంటోంది.. దాంతో ఆ అమ్మాయికి మన కోసం జానకి చదువుని త్యాగం చేసిన విషయం చెప్పాను. తను మారిపోయింది కాపురానికి వెళ్లడానికి ఒప్పుకుంది’ అంటుంది జ్ఞానాంబ. దాంతో.. జ్ఞానం నీకు కోడలంటే చాలా ఇష్టం కదా.. కానీ తన మీద నీకు ఇప్పటికీ నమ్మకం రాలేదా? అని అడుగుతాడు గోవిందరాజులు. అలాంటి కోడలి మీద నమ్మకం లేకపోవడం ఏంటండీ అంటుంది జ్ఞానాంబ. నిజంగా నమ్మకం ఉంటే జానకి చదువు కాగితాలు ఇచ్చేయొచ్చుగా అంటాడు గోవిందరాజులు. కచ్చితంగా ఇస్తాను కానీ ఇప్పుడు కాదు అని జ్ఞానాంబ అనగా.. ఎందుకు అని అంటాడు గోవిందరాజులు. ఆ కాగితాలు తీసుకున్నప్పుడు తన కళ్లల్లో నీళ్లు చూశాను.. తన నెల తప్పిందని తెలిసినప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి కదా.. అప్పుడు తిరిగి ఇచ్చేస్తాను’ అంటుంది జ్ఞానాంబ. దాంతో ఏం చేయాలో గోవిందరాజులు అర్థం కాదు.
ఇక గంటే టైమ్ ఉంది.. త్వరగా వెళ్లాలి అని రామా, జానకి కంగారు పడుతుంటే అప్పుడే గోవిందరాజులు వస్తాడు. ఏమైందని వారు అడగగా.. సర్టిఫికెట్స్ ఇస్తానని ఒప్పుకుంది కానీ ఇప్పుడు కాదని జరిగిన విషయం చెబుతాడు గోవిందరాజులు. అనుకున్నది జరగలేదురా.. కాగితాలు తేలేకపోయానని గోవిందరాజులు బాధగా చెబుతాడు. దాంతో రామా, జానకి చాలా టెన్షన్ పడిపోతారు. అయితే వీరి మధ్య జరుగుతున్న విషయాలను మల్లిక చాటుగా గమనిస్తూనే ఉంటుంది. అప్పుడే గోవిందరాజులు దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది అంటాడు. వెంటనే వస్తాను అని బయటికి వెళ్లి కొద్దిసేపు తర్వాత తిరిగివస్తాడు. జానకి రామా ఆత్రుతగా ఏం జరుగుతుందని చూస్తుంటారు. అప్పుడే జ్ఞానాంబకు తెలియకుండా తీసుకొచ్చిన బీరువా తాళాలు చూపించి.. ఇదేరా మార్గం అంటాడు గోవిందరాజులు. అంటే సర్టిఫికేట్స్ ని దొంగతనం చేయమని చెబుతున్నాడు గోవిందరాజులు. అతను చెప్పినట్లుగానే జానకి, రామా చేస్తారా..? మల్లిక చూడడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో.. తర్వాతి ఎపిసోడ్ లో చూడాల్సిందే.