వరలక్ష్మీ వ్రతం బాధ్యతలన్నీ మల్లికకి అప్పగిస్తుంది జ్ఞానాంబ. దీంతో జానకి రామా చాలా బాధపడతారు. అంతేకాకుండా.. హాలులోని వాళ్ల పెళ్లి ఫొటోని సైతం తీసేయడంతో విలవిలలాడిపోతారు. అయినప్పటికీ కోడలిగా తన బాధ్యతగా పూజా కార్యక్రమాలను చక్కబెడుతుంటుంది జానకి. అది చూసి మల్లికకి ఒళ్లు మండిపోయి.. జానకిని అత్త పేరుతో నానా మాటలు అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన గోవిందారాజులు మల్లికకి నోరు జాగ్రత్త అని చూరకలు అంటిస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 2వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘చూడమ్మా.. ఈ వ్రతం అయిపోయేదాకా కాస్తా ఆ నోటికి పని తగ్గించూ.. అలా కాదని పుల్లలు పెట్టి పెట్రోలు పోసే కార్యక్రమం చేశావనుకో.. అస్సలు బాగోదు చెబుతున్నా’ అంటూ మల్లికకి వార్నింగ్ ఇస్తాడు గోవిందరాజులు. దీంతో మల్లిక ముఖం మాడిపోతుంది. అదే సమయంలో జ్ఞానాంబ అమ్మవారి విగ్రహంతో అక్కడికి వస్తుంది. వారి ముఖాలు చూసి.. ఏమైంది అందరూ ఎందుకు అలా ఉన్నారు? అని అడుగుతుంది. ‘నువ్వు మల్లికకు పెత్తనం ఇచ్చావంట కదా.. అందరినీ తన ఆధీనంలో పనిచేయమని చెబుతుంది. వింటున్నాం అందరం’ అని వెటకారంగా చెబుతాడు గోవిందరాజులు. అది పట్టించుకోని జ్ఞానాంబ.. మల్లికని పిలిచి విగ్రహం శుద్ధి చేసి తీసుకుని రమ్మని చెప్తుంది. ‘మీ మాటే నా వేదవాక్కు.. కోడలిగా ఇది నా బాధ్యత. అంతేకదా జానకి’ అని వెటకారంగా అంటూ అత్త దగ్గర విగ్రహం తీసుకొని వెళుతుంది. అది చూసిన జానకి.. ఇంతకుముందు తన చేతుల మీదుగా జరిగిన వ్రతాన్ని గుర్తు చేసుకొని బాధ పడుతుంది. ‘అయినా ఈ పనులన్నీ చేయమని ఎవరు చెప్పారని కోప్పడుతుంది జ్ఞానాంబ. దానికి.. ‘పిల్లలంతా సరదాగా ఏదో చేస్తున్నారు.. చేయనియ్యి జ్ఞానం. అమ్మా టైమ్ అవుతుంది కదా. పనులు త్వరగా కానివ్వండి’ అంటూ జ్ఞానాంబకి సర్ది చెప్పి అక్కడి నుంచి తీసుకెళతాడు గోవిందరాజులు.
మరోవైపు రామా పిండివంటలు చేస్తూ.. తన తల్లి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటాడు. అదే సందర్భంలో జానకి కన్నీళ్లను గుర్తు చేసుకుంటాడు. ఒక అమ్మ బాధ.. ఇంకో వైపు జానకి కంటతడి.. అమ్మ మాట్లాడకుండా ఉండే నా ప్రాణం పోతున్నంత బాధగా ఉంది.. ఈ పరిస్థితులన్నీ ఎప్పటికీ సర్దుకుంటాయో అన్న బాధ మనసుని వెంటాడుతుంది అని తనలో తానే కుమిలిపోతుంటాడు. పరాధ్యానంలో ఉన్న రామా నూనెలో పడేస్తాడు. దీంతో ఆయిల్ వచ్చి రామా చేతిమీద పడడడంతో మంటతో అమ్మా అంటూ విలవిల్లాడతాడు. అది విని గదిలో నుంచి బయటికి వస్తుంది జ్ఞానాంబ. మనసులో చాలా బాధగా ఉన్నప్పటికీ అక్కడే నిలబడి చూస్తుంటుంది. కన్నపేగు ఆగకపోవడంతో రామా వైపుకి వెళ్లబోతుండగా జానకి అక్కడికి వచ్చి రామాని చేయిపట్టుకొని ఏమైందని అడుగుతుంది. వేడి నూనె పడిన సంగతి గమనించి ‘మందు రాస్తాను పదండి రామాగారు. లేకపోతే బొబ్బలు వస్తాయి’ అని అంటుంది. ‘వద్దండి.. నా చేయి కాలిందని తెలిసి కూడా అమ్మ అక్కడే నిలబడిపోవడం చూసి నా ప్రాణమే పోయింది. ఈ నొప్పి ఎంత. అందుకే నేను రాను’ అంటాడు రామా. అయినా బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకెళ్లి చికితా తీసుకొచ్చిన వెన్న రాస్తుంది జానకి. అదంతా దూరంగా నిల్చూని గమనిస్తూనే ఉంటుంది జ్ఞానాంబ. కానీ బాధతో విలవిల్లాడుతున్న రామా దగ్గరకి మాత్రం వెళ్లదు. అది చూసి.. ‘నా గుండెల్లో బాధగా ఉంది జానకిగారు. నా చిన్నప్పుడు ఇలాగే జరిగితే గాలివానలో చాలా దూరం తీసుకెళ్లి మరి డాక్టర్‌కి చూపించింది. ఆ ప్రేమంతా ఏమైంది జానకిగారు. అదే ఈ గాయం కంటే ఎక్కువగా నా గుండెను మెలిపెడుతోంది’ అని ఎమోషనల్ అవుతాడు. ఊరుకోండి రామాగారు అంటూ ఓదార్చుతుంది జానకి.
‘పిల్లలు తల్లిదండ్రులని ఎంత బాధపెట్టినా.. ఎంత కడుపుకోత పెట్టనా సరే.. వాళ్లు బాధపడుతుంటే మాత్రం తల్లి చూసి తట్టుకోలేదు. బాధలన్నీ కన్నీళ్ల రూపంలో కరిగిపోతాయి. మా అమ్మలో ఆ బాధ ఇంకాస్తా ఎక్కువే ఉంటుంది. నేను నొప్పితో బాధపడుతున్నట్లే.. దగ్గరకి వచ్చి మందు రాయాలేకపోయినందుకు మా అమ్మి సైతం అంతా కంటే ఎక్కువే బాధపడుతుంది’ అని చెబుతాడు రామా.
మరోవైపు.. ‘నేను వెళ్లి మందు రాయలేదని నా బిడ్డ బాధపడుతూ ఉంటాడు.. అమ్మా వరలక్ష్మీ.. పండుగ పూట నా బిడ్డని ఎందుకు బాధపెట్టావు తల్లి’ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది జ్ఞానాంబ. ఇంతలో నీలావతి.. పేరంటాలతో కలిసి ఇంట్లో అడుగుపెడుతుంది. ఇంట్లో పండగ సందడితో వెలిగిపోతోంది.. నీ ముఖంలో మాత్రం వెలుగులేదు.. మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అని ఉత్సుకతతో అడుగుతుంది నీలావతి. ఆ మాటతో జ్ఞానాంబ కోపం వచ్చి.. మా ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతుందని ఎదురుచూస్తూ ఉంటావా? అలాంటిది ఏం జరగలేదు’ అని కొంచెం ఘాటుగానే అంటుంది.
ఆ తర్వాత పూజ దగ్గరికి వెళ్లి మల్లికని పిలవగా.. శుద్ధి చేసిన విగ్రహాన్ని తీసుకొస్తుంది మల్లిక. అది చూసిన నీలావతి.. ఆనవాయితీ ప్రకారం పెద్ద కోడలు కదా చేయాలి? చిన్న కోడలుతో చేయిస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది. అసలు విషయం ఏంటంటే అంటూ మల్లిక నోరు విప్పుతుండగా.. ‘ఏయ్ నువ్ ఆగు’ అంటూ ఆమె నోటికి తాళం వేస్తుంది జ్ఞానాంబ. పోయినసారి పెద్దకోడలు చేతుల మీదుగా చేశాం కదా.. ఇప్పుడు చిన్న కోడలితో చేయిస్తున్నా అంటూ కవర్ చేస్తుంది జ్ఞానాంబ. అదేంటి అలా పూజలు జరిపించడం అంటే.. మా ఆవిడ అలిగిందని విష్ణు కవర్ చేస్తాడు. మళ్లీ క్షణం గ్యాప్ కూడా ఇవ్వకుండా.. నీ పెద్ద కోడలు, కొడుకు ఫొటో గోడపై బావుండేది కదా.. ఇప్పుడు అక్కడ లేదేంటి అని అడుగుతుంది నీలావతి. అది కిందపడి పలిగిపోయిందని కవర్ చేస్తుంది జ్ఞానాంబ. వెంటనే చికితా మీరు పూజకి వచ్చారా మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా అని అడగగా.. ఏదో చనువుకొద్ది అడిగానని నసుగుతుంది నీలావతి. ఇంతలో గోవిందరాజులు కల్పించుకుని.. అదే చనువుతో మేము పూజకి పిలిచాం అక్కయ్యగారు నీలావతికి చురకలేస్తాడు. అనంతరం.. మల్లికను పిలిచి.. అక్కడి నుంచి ఇక్కడి విగ్రహాన్ని తీసుకొచ్చావు కదా చేతులు నొప్పి పెడతాయి.. ఆ విగ్రహాన్ని జానకికి ఇవ్వు అని అంటాడు. ఆ దెబ్బకి నోరెళ్లబెడుతుంది మల్లిక. జ్ఞానాంబ కూడా అందరి ముందు ఏమీ అనలేక సైలెంట్‌గా ఉండిపోతుంది. ‘వెళ్లి ఆ విగ్రహాన్ని పీటలపై పెట్టమ్మా అని గోవిందరాజు చెప్పగా.. అత్త ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుంది. జ్ఞానాంబ మాత్రం ఏమీ చెప్పకుండా మౌనం వహిస్తుంది. ఇంతలో పంతులు రావడంతో.. అందరి ముందు బయటపడటం ఇష్టం లేక.. మల్లిక చేతిలో నుంచి విగ్రహం తీసుకుంటుంది.
ఆ విగ్రహాన్ని మల్లిక దగ్గర నుంచి తీసుకుని పీటలపై పెట్టి పూజ మొదలుపెడుతుంది జానకి. అయితే జానకితో పూజ జరిపించడం ఇష్టంలేని జ్ఞానాంబ మౌనంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. అయితే మల్లిక మాత్రం ఎప్పటిలాగే ఏడుపు ముఖం పెట్టి తోడికోడల్ని చూసి జెలసీ ఫీల్ అవుతుంది. జానకి పూజని నిర్విఘ్నంగా జరిపిస్తుందా అత్త గానీ, మల్లిక గానీ ఏదైనా సమస్య తీసుకొస్తారో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే..