సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లో వెరిఫికేషన్ కోసం జానకికి సర్టిఫికేట్స్ కావాల్సి వస్తాయి. దీంతో తండ్రి గోవిందరాజులు సహాయంతో జ్ఞానాంబకి తెలియకుండా ఆమె గదిలోని సర్టిఫికెట్స్ తీసుకొచ్చి జానకి చేతిలో పెడతాడు రామా. వాటిని తీసుకొని ఇద్దరు కలిసి ఇన్స్టిట్యూట్ కి బయలుదేరతారు. ఇదంతా చాటుగా గమనిస్తున్న మల్లిక, ఆమె తమ్ముడు బుజ్జికి ఫోన్ చెయ్యి జానకి రామాని ఫాలో అవ్వమని చెబుతుంది. మల్లిక చెప్పినట్లుగానే వాళ్లని ఫాలో అవుతూ ఇన్స్టిట్యూట్‌కి వెళతాడు బుజ్జి. అక్కడ సర్టిఫికెట్స్ తీసుకొని వెరిఫికేషన్ కి లోపలికి వెళుతుంది జానకి. ఆ తర్వాత జూలై 26 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
జానకి కోచింగ్ విషయం గురించి చెప్పడానికి మల్లికకి ఫోన్ చేస్తాడు బుజ్జి. దానికోసమే ఎదురుచూస్తున్నా మల్లిక.. ఏం జరిగిందిరా అంటూ బుజ్జిని మాట్లాడనివ్వకుండా ఆత్రుతగా వాగుతుంది. అక్కని కొంచెం ఆగి తను చెప్పేది వినమంటాడు బుజ్జి. అయినా కూడా తన సహజ ధోరణిలో పిచ్చి సామెతలు చెబుతూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది మల్లిక. ఆమె ఆగిన తర్వాత జానకి సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్‌కి వచ్చినట్లు చెబుతాడు బుజ్జి. అదేమైనా బట్టల కొట్టరా తమ్ముడు అని అడుగుతుంది.. అంతటితో ఆగకుండా జానకి రామా తమకు తెలియకుండా బట్టల వ్యాపారం ఏమైనా చేస్తున్నారా అని సందేహపడుతుంది మల్లిక. అది కాదు.. కలెక్టర్, పోలీస్ అవ్వడానికి ఇక్కడ చదువుతారు అని అక్కకి వివరిస్తాడు బుజ్జి. మంచి విషయం చెప్పావురా.. ఈ సంగతి పోలేరమ్మకి చెప్పి జానకి భరతం పడతా అంటుంది మల్లిక. ఇంకా ఏదో చెప్పబోతాడు బుజ్జి. అవేం పట్టించుకోకుండా తన సహజ ధోరణిలో ఫోన్ పెట్టేసి అత్త దగ్గరకి పరిగెడుతుంది మల్లిక.
పరిగెత్తుకుంటూ వెళ్లిన మల్లిక అత్తకి జరిగిన విషయాన్ని చెప్పబోతుంది. కానీ ఎప్పటిలాగే ఏదో చాడిలు చెబుతుందనుకుని ఆమెని కసురుతుంది జ్ఞానాంబ. ఇప్పటి వరకు నేను చెప్పింది ఎది నమ్మలేదు. ఈ ఒక్కసారి నమ్మండి అంటూ.. రామా జ్ఞానాంబ గదిలో నుంచి సర్టిఫికెట్స్ తీసుకెళ్లిన విషయం చెబుతుంది మల్లిక. వాటి గురించి నీకెలా తెలుసు అని అత్త ప్రశ్నించగా.. ఇప్పటి వరకు తెలియదని, వాళ్లు దొంగతనంగా వాటిని తీసుకెళ్లేటప్పుడే చూశానని అంటుంది మల్లిక. ఒకవేళ తన మాట నిజం కాకాపోతే చెప్పు తీసుకుని కొట్టమంటుంది. అది విన్న గోవిందరాజులు కంగారు పడుతూ.. మల్లిక చెప్పేవన్ని అబద్ధాలు అంటూ గండం నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తాడు. కానీ మల్లిక మాటలకి కన్విన్స్ అయిన జ్ఞానాంబ.. ఆమె చేప్పినట్లుగానే గదిలోకి వెళ్లి అల్మరాని చెక్ చేస్తుంది. అక్కడ సర్టిఫికెట్స్ లేకపోవడం చూసి షాక్ అవుతుంది జ్ఞానాంబ. సందు దొరికిన మల్లిక తను ఇంతకుముందు చెప్పిన వాటి గురించి మాట్లాడుతూ.. వాళ్లు ఎక్కడికి వెళ్లారో చూపిస్తా అంటూ అత్తని తీసుకెళుతుంది. అది చూసి జానకి రామాను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పడానికి ఫోన్ చేయబోతాడు గోవిందరాజులు. అంతలోనే మల్లిక వచ్చి కారు డ్రైవ్ చేయాలి పదండి మామయ్యగారు అంటూ గోవిందరాజులుని కూడా తీసుకెళుతుంది మల్లిక. ముగ్గురు కలిసి కారులో బయలుదేరతారు.
ఇక కోచింగ్ సెంటర్‌లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకుంటుంది జానకి. ఆ సమయంలో తన కల నెరవేరిన తర్వాత అత్త కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరాలని అనుకుంటుంది. అదే సమయంలో కోడలిని, కొడుకుని ఈ గండం నుంచి గట్టెక్కించమని దేవుడిని వేసుకుంటూ ఉంటాడు కారు డ్రైవ్ చేస్తున్న గోవిందరాజులు. వాళ్లు ముగ్గురు అక్కడికి వెళ్లేసరికి జానకి వెరిఫికేషన్ పూర్తి అయ్యి అవార్డు ఇచ్చే హాలులో కూర్చుని ఉంటుంది. మూడు, రెండు బహుమతులు వేరే అభ్యర్థులకి ఇవ్వగా.. మొదటి బహుమతి కోసం జానకి పేరునే ప్రకటిస్తారు ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యం. రామా చప్పట్లు కొడుతూ ఉండగా.. ఉత్తమ ప్రతిభ షీల్డ్ అందుకుంటుంది జానకి. ఇదంతా బయట నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది జ్ఞానాంబ. అవకాశం దొరికినా మల్లిక మరికొన్ని కలిపి అత్తకి నూరిపోస్తుంది. జానకి రామా మీ నమ్మకాన్ని వమ్ము చేశారు చూడండని చెబుతుంది మల్లిక. అనంతరం జానకి మైక్‌లో మాట్లాడుతూ.. ‘నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నానంటే.. దానికి కారణం ఇద్దరు.. ఒకరు మా నాన్న.. రెండు నా భర్త’ అని గొప్పగా చెప్తూ ఆనందంలో ఏడిచేస్తుంది జానకి. అదంతా కోపంగా చూస్తూ నిలబడి పోతుంది జ్ఞానాంబ. నిజం తెలుసుకున్న జ్ఞానాంబ జానకి బాధని అర్థం చేసుకుంటుందా? లేక ఆమె చదువుకి అడ్డం పడి కోడలిని, ఆమెకి సహాయం చేసినందుకు కొడుకుని శిక్షిస్తుందా?.. అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.