జానకి, రామా చేస్తున్న మోసం జ్ఞానాంబకి తెలిసిపోతుంది. దీంతో తట్టుకోలేకపోయిన జ్ఞానాంబ బాధతో ఎటో నడుచుకుంటూ పోతుంది. ఆమెని వెతుక్కుంటూ వెళ్లిన జానకి, రామాకి గోదావరి ఒడ్డున కనిపిస్తుంది జ్ఞానాంబ. అక్కడికి వెళ్లిన రామాతోని కన్న తల్లిని ఎందుకు మోసం చేశావురా అని నిలదీస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జూలై 28న ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
‘నీ బాధ అర్థం అవ్వడం మాత్రమే కాదమ్మా.. నీకు ఇచ్చిన మాట కూడా నాకు అర్థం అయ్యింది. నీకు ఇచ్చిన మాట కోసమే జానకి గారిని చదివిస్తున్నాను’ అని అంటాడు రామా. ఏంటీ.. నాకు ఇచ్చిన మాట కోసమా? అని అనుమానంగా అడుగుతుంది జ్ఞానాంబ. ‘జానకి గారు మన ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నువ్వు నాకో మాట చెప్పావ్. నీ భార్య ఇష్టాలు ఏంటో తెలుసుకొని.. నెరవేర్చడం భర్తగా నీ బాధ్యత.. తాను కంటతడిపెడితే భర్తగా నువ్వు ఓడిపోయినట్టే అని చెప్పావు.. ఐపీఎస్ కావాలన్నది తన చిన్ననాటి కలమ్మా.. పెళ్లి పేరుతో ఆ కల నిలువునా కూలిపోయిందని తను ఎంతలా ఏడ్చిందో నేను కళ్లారా చూశానమ్మా.. తను ఐపీఎస్ అవ్వకపోతే.. బతికినంత కాలం కంటతడి పెట్టుకుంటూనే ఉంటారు.. మరి అప్పుడు భర్తగా నేను ఓడిపోయినట్టే కదమ్మా.. భార్యగా నన్ను నమ్మి వచ్చిన తన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే తనని చదివిస్తున్నానమ్మా’ అని అంటాడు రామా.
‘నేను నీకు చెప్పింది భార్యని బాగా చూసుకోమనిరా.. అందుకోసం.. అమ్మ భయంతో ఆడుకోమని కాదు.. నువ్వు ఒకవేళ నా మాటకి నిజంగా కట్టుబడి ఉంటే.. తనని చదివిస్తున్న విషయం నాకు చెప్పేవాడివిరా.. నన్ను అబద్దాలతో మభ్యపెట్టి మోసం చేసేవాడివి కాదు’ అని కోపంగా అంటుంది జ్ఞానాంబ. ‘ఈ నిజం మీకు చెప్పాలని అనుకున్నాం అత్తయ్యా గారు కానీ పరిస్థితులు అనకూలించలేదు. అలాగే మీరేమంటారో అన్న భయం’ అని ఏడుస్తూ సర్ది చెప్పబోతుంది జానకి. ‘నువ్వు అసలు మాట్లాడకు.. చదువు మానేస్తున్నా అని నాకు మాట ఇచ్చావు.. నీ మనసులో నుంచి ఆ కోరికను తీసేస్తున్నావ్ అని నీ చదువు కాగితాలు నా చేతిలో పెట్టావు.. కానీ మాట తప్పావ్.. నువ్ మోసం చేశావు.. నీకసలు మాట్లాడే అర్హత లేదం’టూ జానకిని మాట్లాడకుండా చేస్తుంది జ్ఞానాంబ.
దీంతో రామా.. ‘ చనిపోయేముందు జానకి నాన్నగారు ఎంత బాధపడ్డారో నీకు చెబితే అర్థం చేసుకుంటావని నా నమ్మకం.. అందుకే నీ దగ్గర నిజం దాచాను. అంతేకానీ నిన్ను మోసం చేయాలని కాదమ్మా.. ఆయన చనిపోతూ కూడా జానకి కల గురించి పడ్డారు అందుకే దాచాను. నేను చేసింది తప్పే.. అందుకు నాకు ఏ శిక్ష వేసినా భరిస్తాను.. దయచేసి నువ్వు బాధపడకమ్మా’ అని చాలా బాధగా అంటాడు రామా. ‘బాధ పడకుండా ఎలా ఉంటానురా.. ఆ రామచంద్రుడు తండ్రి మాట జవదాటనట్లే.. నా రామచంద్రుడు ఈ తల్లి మాట జవదాటడు అని గర్వంతో పొంగిపోయానురా. ఈ ప్రపంచంలో ఎవరైనా మారతారు కానీ.. నా కొడుకు మారడని బలమైన నమ్మకంతో ఉన్నాను.. ప్రాణం పోయినా నా కొడుకు నాకు అబద్ధం చెప్పడనే అనుకున్నాను.. కానీ నువ్వు కూడా అందరిలాంటి కొడుకువే అని నిరూపించావు.. నీపై నాకు కోపం లేదురా.. బాధగా ఉంది. మిమల్ని అతిగా నమ్మినందుకు నాపై నాకే అసహ్యంగా ఉంది’ అని అంటుంది జ్ఞానాంబ.
‘మీ పెంపకంలో ఎలాంటి లోపం లేదు అత్తయ్యగారూ.. ఆయన ఎప్పటికీ తల్లిమాటని జవదాటని కొడుకే.. తల్లికంటే ఆయనకి ఎవరూ ఎక్కువ కాదు’ అని అంటుంది జానకి. ‘నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా.. నీ వల్లే వాడు నన్ను మోసం చేశాడు.. దీనికంతటికీ కారణం నువ్వే’ అని దెప్పిపొడుస్తుంది జ్ఞానాంబ. ఇంతలో రామా.. అది కాదు అమ్మా అని అనడంతో..‘నువ్వు నన్ను అమ్మా అని పిలవకురా.. ఇంతకు ముందు నువ్వు అలా అమ్మ అని పిలిస్తే కన్నపేగు కదలాడేది.. కానీ ఇప్పుడు బాధతో గుండె బద్దలు అవుతుందిరా.. ఇప్పటివరకు నువ్వు నా కడుపున పుట్టడం నా అదృష్టం అనుకునేదాన్ని.. కానీ నువ్వు నా కడుపున పుట్టకపోయింటే బాగుండు అని ఇప్పుడు అనిపిస్తోంది. అప్పుడు ఈ బాధ నాకు ఉండేది కాదు కదా’ అని ఎమోషనల్‌గా అవుతుంది జ్ఞానాంబ.
అది విని.. ‘ఏమన్నావమ్మా.. నీ కడుపున నేను పుట్టకపోయి ఉంటేనా?. ఆ మాట నీ నోటి నుంచి వినగానే నా ప్రాణం పోయిందమ్మా.. మా అమ్మే నా గురించి ఇలా అనుకున్నాక నా బ్రతుక్కి అర్థం లేదమ్మా.. నీకు మానసిక క్షోభ మిగిల్చినందుకు నన్ను క్షమించు.. ఇంకో జన్మ ఉంటే మళ్లీ నీ కడుపున పుట్టి నీ రుణం తీర్చుకుంటానమ్మా’ అని ఏడుస్తూ అంటాడు రామా. ఆ తర్వాత తల్లి కాళ్లు పట్టుకోబోగా వెనక్కి వెళుతుంది జ్ఞానాంబ. అనంతరం జానకి దగ్గరకు వచ్చి.. ‘మీకు మంచి భర్తను అవుదాం అనుకున్నా కానీ.. చెడ్డకొడుగ్గా మిగిలిపోతానని అనుకోలేదు.. మీకు అన్యాయం చేసి వెళ్లిపోతున్నా నన్ను క్షమించండి’ అంటూ గోదావరిలోకి నడుచుకుంటూ వెళ్లిపోతుంటాడు రామా. జానకి ఎంత చెప్పినా వినడు రామా. దీంతో అత్త దగ్గరికి వెళ్లి.. ‘ఆయన్ని ఆపండి.. మీరు చెబితేనే ఆయన వింటారు. ఆయన్ని వెనక్కి రమ్మని పిలవండి’ అంటూ జ్ఞానాంబ కాళ్లపై పడి వేడుకుంటుంది జానకి. అయినప్పటికీ జ్ఞానాంబ కనుకరించకపోవడంతో.. ‘చావు అయినా బ్రతుకు అయినా నా భర్తతోనే.. ఆయన లేని జీవితం నాకూ వద్దు’ అంటూ రామా వెనుకే గోదావరిలోకి వెళుతుంటుంది జానకి. ఇంకా అంతా అయిపోయింది అనుకునేలోపు రామాని వెనక్కి రా అని పిలుస్తుంది జ్ఞానాంబ. తల్లి మాట జవదాటని రాముడు వెనక్కి వచ్చేస్తాడు. దీంతో జానకి చాలా ఆనందపడుతుంది.
ఆ తర్వాత సీన్ జ్ఞానాంబ ఇంటికి మారుతుంది. అందరూ జ్ఞానాంబకి ఏమైందోనని టెన్షన్ పడుతుంటారు. కానీ మల్లిక మాత్రం.. ఆ పోలేరమ్మ ఈ కాశీనో.. రామేశ్వరమో వెళ్లిపోతే ఇంట్లో అంతా గొడవలు జరుగుతాయి. జానకి కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే మనమే రాణి అనుకుంటూ చాలా సంతోషపడుతుంటుంది. అది గమనించిన పనిమనిషి కొందరు కొంపలు భలే కూలుస్తారని దెప్పిపొడుస్తుంది. అది విన్న మల్లిక ఇదంతా ఈగోతో, అహంతో చేస్తున్నా అని చెబుతుంది. మా అత్త నన్ను పురుగు కన్నా హీనంగా.. జానకిని రాణి లాగా చూసేది అందుకే ఈ ఈగో. ఇదే ఈగో వల్లనే పురాణాల్లో యుద్ధాలు కూడా జరిగాయి అని చెబుతుంది మల్లిక. అప్పుడే అక్కడికి వచ్చిన అత్తని చూసి అవ్వాక్కు అవుతుంది మల్లిక. కానీ మిగిలిన వాళ్లందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఏమైంది జ్ఞానం.. ఏంటి ఇదంతా అని భర్త గోవిందరాజులు అంటున్న పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది.
అది చూసి గోవిందరాజులు కంగారుగా జ్ఞానం తలుపు తియి అంటూ తలుపులని కొడుతూ ఉంటాడు.. అది విని తలుపు తీసిన జ్ఞానాంబ ‘కంగారు పడకండి.. చనిపోయేటంత పిరికిదాన్ని కాదు.. అలాగే పశ్చాత్తాపంతో ప్రాణాలు తీసుకునేటంత మోసం నేను చేయలేదు’ అని మళ్లీ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. ఇక తాను పెట్టిన చిచ్చు కాలాగ్నిలాగా మారడంతో తెగ సంబర పడిపోతుంది మల్లిక. గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని చిందులేస్తుంది. అప్పుడే గదిలోకి వచ్చిన విష్ణు.. అసలు నువ్వు మనిషివేనా.. అన్న వదిన విషయంలో అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ భయపడి చస్తుంటే నువ్వు ఆనందంతో డాన్స్ చేస్తావా అని చురకలు వేస్తాడు. దానికి.. ‘ప్రతిదానికి జానకిని చూపిస్తూ తిడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా.. రెండు కత్తులు ఒక ఒరలో ఇమడనట్లు.. ఇద్దరు కోడళ్లు ఒక ఇంటిలో ఉండలేరు. ఈ చిచ్చు ఇలాగే రగలాలి’ అంటూ డాన్స్ వేస్తూ ఉంటుంది మల్లిక. అప్పుడే బయట గది తలుపులు తీస్తుంది జ్ఞానాంబ. ఏమవుతుందోనని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఇక జ్ఞానాంబ వాళ్లనీ క్షమిస్తుందా లేక శిక్షిస్తుందా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.