Janasena Party: విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటన పైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్రం ప్రకటన ఆశాజనకంగా ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని అన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాకారమైన విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని జనసేన కోరుకుంటోందని పవన్ కళ్యాణ్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ అంశం వచ్చినప్పుడు బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి తమ అభిప్రాయాన్ని తెలియజేసామన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ నిలబడిందని గుర్తు చేశారు.
భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అఖిలపక్షాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని విజ్ఞప్తి చేసినా, ఏపీ ప్రభుత్వం నుంచి స్పందించలేదని అన్నారు ఢిల్లీలో అమిత్ షాను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ తో తెలుగు ప్రజల భావోద్వేగ అనుబంధాన్ని వివరించామని, బీజేపీ పెద్దలు దీనిపై సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ పరిశ్రమను ప్రత్యేక దృష్టితో చూడాలని కోరగా, వారి స్పందన ఎంతో ఆశావహంగా అనిపించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరించడం లేదని, దీనిపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదని ఇవాళ కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటన హర్షించదగ్గ విధంగా ఉందని అన్నారు. విశాఖ ఉక్కుపై పొరుగు రాష్ట్రం స్పందించిందని, దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపధ్యంలో వైసీపీ పాలకులు విమర్శలు చేయడం తప్ప సానుకూలంగా స్పందించడం లేదని దయ్యబట్టారు. చిత్తశుద్ధి లేని వైసీపీ లాంటి నాయకుల వలన విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు కదల్లేదని ఆరోపించారు. అయితే కేంద్ర మంత్రి చేసిన ప్రకటన మాత్రం ఆశాజనకంగా ఉందని జనసేనాని తెలిపారు.