Jayasudha : సినీనటి జయసుధ బీజేపీలో చేరనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బీజేపీ వర్గాలు. ఇప్పటికే బీజేపీ నాయకత్వం ఆమెతో సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. ఇటు మునుగోడు ఉపఎన్నిక.. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసింది. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు బీజేపీలో చేరిపోయారు. ఇక తమ పార్టీకి సినీ గ్లామర్ చాలా ముఖ్యమని.. ప్రచారంలో ఈ గ్లామర్‌ను వాడుకుని ఓట్లు దండుకోవచ్చని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే జయసుధను సంప్రదించినట్టు సమాచారం.
వైఎస్ఆర్ హాయాంలో కాంగ్రెస్ పార్టీలో జయసుధ కీలకంగా వ్యవహరించారు. 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా జయసుధ పనిచేశారు. తాజాగా జయసుధను బీజేపీ చేరికల కమిటీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. సినీ గ్లామర్ అనేది తమ పార్టీకి బాగా కలిసొస్తుందని బీజేపీ గత కొంతకాలంగా నమ్ముతూ వస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటులను తమ పార్టీలోకి చేర్చుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో జయసుధ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమెకు తోడు జయసుధ కూడా చేరితే మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ది చేకూరుతుందని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Jayasudha : సొంత గూటిలోకి వచ్చినట్టుంది..
2009 ఎన్నికల్లో జయసుధ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయసుధను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ఆమెకు సికింద్రాబాద్ స్థానాన్ని కేటాయించారు. వైఎస్‌ఆర్ అకాల మరణం అనంతరం ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2016లో టీడీపీలో చేరారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి కూడా గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని.. అలాంటిది ఆయన తనయుడు పెట్టిన పార్టీ వైసీపీలోకి చేరడం తిరిగి తనకు సొంత గూటికి వచ్చినట్టుందని ఆమె తెలిపారు. ఇటీవలి కాలంలో జయసుధ సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీ ఇచ్చిన ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో వేచి చూడాలి. ఇక జయసుధ బాటలోనే మరికొంత మందిని సైతం బీజేపీలోకి చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది.