K. Viswanath: టాలీవుడ్ లో గత ఏడాది ఒకప్పటి స్టార్ హీరోలైన కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైకాల సత్యనారాయణ మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది ఆరంభంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ జమున మృతి చెందారు. ఆమె మరణాన్ని ఇంకా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మరిచిపోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ లో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన ప్రస్థానాన్ని ఏర్పరచుకున్న కళాతపస్వి కె విశ్వనాథ్ మృతి చెందారు. ఎన్నో క్లాసిక్ సినిమాలను సృష్టించి భారతీయ సాహిత్యానికి, భారతీయ సాంప్రదాయ నృత్యాలకు పెద్దపీట వేసిన దర్శకుడిగా కె విశ్వనాథ్ కీర్తి ఘనంగా నిలబడిపోయింది.
శంకరాభరణం సినిమాతో మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించిన ఘనత కె విశ్వనాథ్ దక్కుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషలలో సూపర్ హిట్ అయింది. అలాగే జాతీయ అవార్డులను కూడా శంకరాభరణం సొంతం చేసుకుంది. కె విశ్వనాథ్ అంటే సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సిరిసిరిమువ్వ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి సినిమాలు గుర్తుకొస్తాయి. కమర్షియల్ హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి తన ఇమేజ్ ని పక్కనపెట్టి మరి కె విశ్వనాథ్ తో ఆపద్బాంధవుడు, స్వయంకృషి సినిమాలు చేసి ఆయనపై ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

అలాగే ఆ సినిమాలు చిరంజీవి నటన స్థాయిని కూడా అందరికీ పరిచయం చేశాయి. అలాంటి మహోన్నత దర్శకుడుగా కె విశ్వనాథ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక గొప్ప గౌరవాన్ని పొందారని చెప్పాలి. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తీవ్ర అస్వస్థతతో 92 ఏళ్ల వయసులో మృతి చెందిన గమనార్హం. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆయన మృతితో టాలీవుడ్ లో తీవ్రమైన విషాదం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖులు అందరు కూడా విశ్వనాథ్ మృతి పట్ల వ్యక్తం చేశారు. ఒక మహోన్నత దర్శకుడిని తెలుగు చిత్ర పరిశ్రమ కోల్పోయిందని అభివర్ణించారు. సోషల్ మీడియాలో కూడా విశ్వనాధ్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అసలు నెగెటివిటీ లేని అతి కొద్ది మంది దర్శకులలో కె విశ్వనాథ్ ఒకరిని కచ్చితంగా చెప్పొచ్చు. ఆయనని ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన అవసరం ఉంది.