Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చి పార్టీ పెట్టి పదేళ్ళకి దగ్గర అవుతుంది. నిజానికి ప్రజారాజ్యం పార్టీతోనే పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు. యువరాజ్యం అధ్యక్షుడిగా అప్పట్లో ఉన్నారు. తరువాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత బయటకి వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకి ముందు జనసేన పార్టీ పెట్టారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక మూల సానుకూల దృక్పథం ఉండటంతో అతను నమ్ముకున్న కాపు సామాజిక వర్గం టీడీపీ, బీజేపీ కూటమికి ఓటు వేసారు.
అయితే 2019 ఎన్నికల సమయానికి వచ్చేసరికి కాపులకి చంద్రబాబు సర్కార్ చేసింది ఏమీ లేకుండా పోయింది.; కనీసం ఆ వర్గాన్ని పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ దీక్ష చేస్తే దానిని చంద్రబాబు దారుణంగా అణచివేశారు. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాపుల తరుపున ఒక్క మాట కూడా మాట్లాడలేదు. టీడీపీ నిరంకుశ తత్వాన్ని ప్రశ్నించలేదు. అయితే 2019 ఎన్నికలలో టీడీపీ ఓడిపోతుంది అనే క్లారిటీ వచ్చిన తర్వాత వ్యతిరేక ఓటు చీల్చేందుకు ఒంటరిగా పోటీ చేసారనేది వైసీపీ ఆరోపణ.
ఇది నిజం అని కాపు వర్గానికి చెందిన ప్రజలు కూడా బలంగా నమ్మారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న గోదావరి జిల్లాలలో కూడా అతను పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే మరల 2024 ఎన్నికలకి టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకొని మరల కాపు ఓటుబ్యాంకుని గంపగుత్తగా చంద్రబాబుకి అమ్మేయాలని చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని పవన్ కళ్యాణ్ మాత్రం బలంగా తిప్పికొట్టడం లేదు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తు పెట్టుకుంటాం అని చెబుతున్నారు కాని ఈ పదేళ్ళలో ప్రత్యామ్నాయ శక్తిగా కాపులని రాజ్యాధికారం వైపు నడిపించే నాయకుడిగా మాత్రం పవన్ కళ్యాణ్ మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఈ సారి కూడా కాపులు పవన్ కళ్యాణ్ ని నమ్మే పరిస్థితి ఉండదనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట.