శోభతో నిరుపమ్ పెళ్లికి అన్ని ఏర్పాటు చేస్తుంది స్వప్న. అంతేకాకుండా వాళ్లిద్దరూ పెళ్లి దుస్తుల్లో సెల్పీ తీసుకున్నట్లు ఓ పిక్‌ని హిమకి పంపుతుంది స్వప్న. అది చూసిన సౌర్య శోభ అస్సలు పెళ్లి చేసుకోడానికి కారణం అందరికి తెలిసేలా చేస్తుంది. శోభ నిజ స్వరూపం తెలిసిన స్వప్నలో మార్పు వస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 11 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
మారిపోయిన స్వప్న భర్త సత్యంకి ప్రేమగా పాలు తీసుకొస్తుంది. ‘నువ్వు మారావ్.. చాలా సంతోషం స్వప్న.. కానీ ఒక విషయం మాత్రం నీకు చెప్పాలి.. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిత్య విషయంలో నా తప్పేం లేదు స్వప్న’ అంటాడు సత్యం. అది విన్న స్వప్న గతంలో నిరుపమ్‌తో.. మీ నాన్న ఇంతకుముందు నిత్య అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకి వేరే పెళ్లి అయినా మీ నాన్నతోనే ఇద్దరూ పిల్లలను కన్నదంట అని చెప్పి ఉంటుంది. అదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకొని బాధపడుతుంది స్వప్న.
‘నిత్య నన్ను కోరుకుంది.. నేను నిత్యని కోరుకోలేదు స్వప్నా.. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప వేరే ఏం లేదు.. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం స్వప్న. కొన్ని నిజాలను మనం నిరూపించలేం స్వప్నా.. మనసుతో మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇంతకంటే నేనేం చెప్పలేను’ అంటాడు సత్యం. వెంటనే స్వప్న.. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని.. ‘నేను నమ్ముతున్నానండి ’ అని బాధగా అంటుంది.
తను ప్రేమిస్తున్న విషయం గురించి చెప్పగా.. నిరుపమ్ నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పడం గుర్తు చేసుకొని బాధ పడుతుంది సౌర్య. అప్పుడే అక్కడకి వచ్చిన నిరుపమ్, సౌర్య కళ్లను మూస్తాడు. ‘డాక్టర్ సాబ్’ అంటుంది సౌర్య ఆ చేతుల స్పర్శను గుర్తిస్తుంది. అలా ఏలా గుర్తు పట్టావు అని నిరుపమ్ అడిగితే.. కాకపోతే శోభ విషయంలో సాయం చేశాను కదా.. నటిస్తూ వచ్చి థాంక్స్ చెబుతారని ఎక్స్‌పర్ట్ చేశానని చెబుతుంది. తర్వాత.. ‘నిజంగా నువ్వు గ్రేట్ సౌర్యా.. మేము ఎవ్వరం కనిపెట్టలేని శోభ నిజస్వరూపాన్ని నువ్వు కనిపెట్టావ్.. అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెబుతున్నాను నువ్వు మా ఫ్యామిలీ కోసమే పుట్టావ్ సౌర్యా..’ అంటే నిరుపమ్ అభిమానంగా సౌర్య చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. వెంటనే తన చేతిని విడిపించుకుంటుంది సౌర్య. ‘చెప్పడానికి మీకు ఎలా ఉన్నా.. నాకు మాత్రం వినడానికి నాకు చాలా చిరాగ్గా ఉంది.. దాన్ని ఏమంటారు? పుండు మీద కారం జల్లినట్లు ఉంది. మీ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు లేవు అని సంతోషిస్తున్నారు కదా.. సంతోషంగా పెళ్లి చేసుకోండి. హాయ్‌గా ఉండండి’ అంటూ దన్నం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌర్య. నిరుపమ్ షాక్ అవుతాడు.
మరోవైపు హిమ మాత్రం పెళ్లికి స్వప్న ఒప్పుకున్నందుకు బాధ పడుతూ ఉంటుంది. అదే విషయాన్ని ప్రేమ్‌కి ఏదో ఒకటి చేయమని అడుగుతుంది. దానికి చాలా పెళ్లిళ్లు మండపంలోనే ఆగిపోవడం తెలుసు కదా. ఏదో ఒకటి చేద్దాంలే అంటాడు ప్రేమ్.
మరోవైపు సౌర్య బాధగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న సౌర్య చేతికి ప్రేమగా కోన్ పెట్టాలని చూస్తుంది. కానీ సౌర్య మాత్రం ఇలాంటి నాటకాలు అవసరం లేదు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అయితే కొంచెం దూరం నుంచి అది చూసిన నిరుపమ్, హిమ మురిసిపోతారు. స్వప్న వారిని చూసి సౌర్య కోన్ పెట్టించుకోట్లేదు అని చెప్పగా.. ‘గోరింటాకు పెట్టించుకుంటే మంచి మొగుడు వస్తాడు అని ఏదో అంటారు కదా పెద్దవాళ్లు’ అంటాడు నిరుపమ్ సౌర్యతో. తనకు అలాంటివేం వద్ద అని విసుగ్గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌర్య. అదంతా గుమ్మం దగ్గర నిలుచుని ఆనందరావు చూస్తూనే ఉంటాడు. ఇక సౌర్య ఎప్పుడు మారుతుందో అని ఆ ముగ్గురూ మాట్లాడుకోవడం చూసి ఆనందరావు దగ్గరకు వచ్చి.. ‘నువ్వు మా కూతురివి.. నువ్వు మారడానికే ఇన్నేళ్లు పట్టింది.. ఇక మనవరాలు మారాలంటే ఇంకెన్నాళ్లు పడుతుందో’ అంటాడు. అవును తనకి మేనత్త పొలికలే వచ్చినట్లు ఉన్నాయని అంటాడు నిరుపమ్.
అక్కడ శోభ మాత్రం సౌర్య చేసిన అవమానం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అన్ని లెక్కలు సరిచూసుకున్న బ్యాంక్ అధికారులు శోభ దగ్గరకు వచ్చి.. ‘మేడమ్.. మీరు మా అప్పు కట్టలేదు. మా నోటిసులకి రిప్లై కూడా ఇవ్వలేదు. అందుకే మీ ఇల్లు, ఆసుపత్రి జప్తు చేస్తున్నామ’ని కాగితాల మీద సంతకం చేయించుకుని వెళ్లిపోతారు. దీంతో శోభ పగతో రగిలిపోతూ ‘సౌర్యా నిన్ను వదిలిపెట్టనే.. ఈ శోభ అంటే ఏం అనుకున్నావ్. నీ జీవితాన్ని అల్లకల్లోలం చేసి తీరతాను’ అని అనుకుంటుంది.
అక్కడ సౌర్య ఇంటి గార్డెన్‌లో ఒంటరిగా కూర్చుని నిరుపమ్ గురించి ఆలోచిస్తూ ఉంటే.. సౌందర్య అక్కడికి వెళుతుంది. ‘ఎందుకమ్మా ఒంటరిగా ఉంటావ్? నీ కోసం మేమంతా ఉన్నాం.. మా ప్రేమని ఎందుకు అర్థం చేసుకోవు?’ అంటూ ప్రేమగా మాట కలుపుతుంది. ‘ప్రేమా? ఎక్కడిది? నేను ఇంట్లోంచి పారిపోయినప్పుడు మీరు నాకోసం వెతకలేదు కదా? నేనే సౌర్యని అని తెలియగానే.. ప్రేమ.. నా మనవరాలు అంటున్నారు? ‘ అని అంటుంది సౌర్య. దాంతో సౌందర్య.. ‘ఏంటి సౌర్యా నువ్వు? నోటికి ఏదొస్తే అది అనేస్తావా? నీ మీద మాకు ప్రేమ లేకపోవడం ఏంటీ.?’ అంటుంది బాధగా. దాంతో సౌర్య గతంలోకి వెళ్తుంది.
చిన్నప్పటి సౌర్య.. ఓ అనాథాశ్రమంలో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. ‘ఆ హిమ వల్లే.. మా అమ్మ నాన్నా చనిపోయారు. ఎలాగైనా హిమ మీద పగ సాధించాల’ని అనుకుంటుంది సౌర్య. అప్పుడే ఎదురుగా ఓ కారు ఆగుతుంది. కారులోంచి సౌందర్య దిగుతుంది. సౌర్యని చూడగానే చాలా ఆనందంగా దగ్గరకు రాబోతుంది. ‘ఎందుకు వచ్చావ్? ఇంతకాలం నన్ను ఎందుకు వెతకలేదు? .ఆ హిమ ఉన్న ఇంటికి నేను రాను. ఇక్కడి నుంచివెళ్లిపో’ అంటూ కాస్త దూరం జరగుతుంది. ‘సౌర్య ఆగవే.. ఏం మాట్లాడుతున్నావే.. రోజు వెతికామే.. మా అదృష్టం కొద్ది నువ్వు ఇప్పుడు కనిపించావే.. ఇంటికి వెళ్దాం రా’ అంటుంది సౌందర్య బాధపడుతూ. ‘మా అమ్మా నాన్నలు ఎప్పటికైనా తిరిగి వస్తారనే నమ్మకం నాకుంది.. నేను ఇక్కడే ఉంటాను..’ అని సౌందర్యకు అక్కడి నుంచి పరుగుతీస్తుంది. వెంటనే సౌందర్య కూడా సౌర్య వెనుకే వెళ్లి పట్టుకుని ఇంటికి రమ్మని బ్రతిమిలాడుతుంది. ‘నాన్నమ్మా ప్లీజ్ వెళ్లిపో.. వెళ్లకుంటే నా మీద ఒట్టే.. నువ్వు మళ్లీ వస్తే మాత్రం నేను ఇక్కడ కూడా ఉండను.. గుర్తుపెట్టుకో.. ఒట్టు పెట్టినా నువ్వు వెళ్లవా?’ అని అరుస్తుంది సౌర్య. దాంతో సౌందర్య ఏడుస్తూ.. సౌర్యనే చూస్తూ.. కారు ఎక్కి వెళ్లిపోతుంది. మళ్లీ తిరిగి వచ్చి డబ్బు ఇవ్వబోతుంది. అది కూడా తీసుకోకుండా వెళ్లిపో అంటూ కసురుతుంది. దాంతో చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య. తరువాయి భాగం అంటూ.. స్వప్న ఇద్దరూ మేన కోడళ్లకి చీరలు తీసుకొస్తుంది. అవేం వద్దూ. ఆ పెళ్లేదో అయిపోతే తన దారి తాను చూసుకుంటానని అంటుంది సౌర్య. అనంతరం ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.