నిరుపమ్‌కి హిమతో అనుకున్న ముహుర్తానికే పెళ్లి చేయాలని పట్టుదలగా ఉంటుంది సౌందర్య. అయితే స్వప్నకి మాత్రం శోభతో నిరుపమ్ పెళ్లి చేయాలని ఉంటుంది. అందుకే భర్తతో కలిసి పెళ్లి చెడగొట్టడానికి మాస్టర్ ప్లాన్ వేస్తుంది. హిమకి కూడా తన పెళ్లిని ఎలాగైనా ఆపి నిరుపమ్‌ని సౌర్య దక్కేలా చేయాలనుకుంటుంది. అయితే.. నిరుపమ్ మాత్రం హిమతో తన పెళ్లి జరిగేలా చూడాలని సౌర్య దగ్గరే మాట తీసుకుంటాడు. ఆ తర్వాత ఆగస్టు 9 ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం..
ఎంతో ప్రేమగా హిమ చేతికి గోరింటాకు పెడుతుంటుంది సౌందర్య. అప్పుడే అక్కడికి ఆనందరావు కూడా వస్తాడు. అయితే హిమ చాలా డల్‌గా ఉంటుంది. అదేం పట్టించుకొని వారు సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సౌర్యకి కూడా గొరింటాకు పెట్టొచ్చు కదా. లేకపోతే.. నేనంటే ప్రేమలేదు, మీకు హిమ అంటేనే ఇష్టమంటూ.. ఏదో ఒకటి అనుకోవడమో.. అనడమో చేస్తుంది అంటాడు. ఆనందరావు కచ్చితంగా ముఖం మీదే అనేస్తుంది అంటుంది సౌందర్య. అందుకే తనని కూడా పిలువు.. ఇద్దరికీ కలిసి గోరింటాకు పెడతానని ఆనందరావుతో అంటుంది సౌందర్య. అది విన్న హిమ కోపంగా లేచి.. మీకు అప్పుడే చెప్పాను నిరుపమ్‌కి సౌర్యకి పెళ్లి చేద్దామంటే మీరు ఒప్పుకోలేదు అని కోపంగా అంటుంది. అది చూసి ఏంటే.. ఎంగేజ్మేంట్ రోజు చేసినట్లు పెళ్లి రోజు కూడా అందరి ముందు నిరుపమ్ అంటే ఇష్టం లేదని చేప్పేస్తావా అని సౌందర్య అంటుంది. దాంతో హిమ అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది.
మరోవైపు శోభకి గోరుముద్దలు తినిపిస్తుంటుంది స్వప్న. నువ్వు అత్తగా రావడం నా లక్ అని శోభ అంటే.. నువ్వు కోడలుగా రావడం నా లక్ అంటూ ఒకరిని ఒకరు తెగపొగిడేసుకుంటూ ఉంటారు. అప్పుడే సీన్‌లోకి ఎంట్రీ ఇస్తుంది సౌర్య. చప్పట్లు కోడుతూ ఇలాంటి అత్త కోడళ్లను చూడడం చాలా సంతోషంగా ఉందని వెటకారంగా మాట్లాడుతుంది సౌర్య. అంతేకాకుండా పక్కన ఉన్న మామని పిలిచి నువ్వు కూడా కోడలి సేవలో తరించూ అని చురకలు అంటిస్తుంది సౌర్య. అది విని స్వప్న మండిపోతూ .. ‘ఏయ్.. ఏందుకొచ్చావే.. ఇక్కడ నీకేం పని’ అని అరుస్తుంది. దానికి.. ‘అదేంటి అత్త ఇంట్లో పెళ్లి జరుగుతుందని మేనకోడలు ఇంటికి వస్తే ఇలాగే మాట్లాడతావా. కాబోయే పెళ్లికూతురికి నేను తినిపిస్తా’ అంటూ ప్లేటు లాక్కుంటుంది సౌర్య. బలవంతంగా శోభ నోట్లో ముద్దలు పెడుతూ ఉంటుంది. అక్కడ ఉంటే సేఫ్ కాదని అర్థం చేసుకున్న మామయ్య అక్కడి నుంచి ఫోన్ వచ్చిందనే నేపంతో జారుకుంటాడు. ఇక సౌర్య.. ‘శోభ ఇల్లు అలకగానే పండగా కాదు. పెళ్లి కూతురు కాగానే పెళ్లికాదు. జీవితంలో చాలా కలలు కంటాం. అన్నీ అవుతాయా ఏంటి. కావు కదా. నువ్వు ఈ ఇంటి కోడలిగా ఎప్పటికీ కాలేవు. మీరిద్దరూ ఇద్దరే. అత్త కోడలుగా సరిగ్గా సరిపోయారు. శోభనేమో కలర్ కలలు కంటుంది. నువ్వేమో ఇది ఊస్కో అంటే డిస్కో అంటావు. ఈ పెళ్లి జరగనివ్వను’ అంటుంది సౌర్య. ఇక్కడ జరిగేది నీ పెళ్లికాదు.. డాక్టర్ సాబ్ పెళ్లి మాత్రమేనని శోభకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌర్య.
మరోవైపు పెళ్లిపనులు జోరుగా సాగుతుండడంతో సౌందర్య, ఆనందరావు చాలా సంతోషపడుతుంటారు. అయితే సౌర్య పెళ్లికి అడ్డుపడుతుందేమోనని భయపడుతుంటాడు ఆనందరావు. అది చూసి సౌర్య దగ్గర నిరుపమ్ మాట తీసుకున్న విషయం సౌందర్య చెప్పగానే కూల్ అయ్యిపోతాడు. ఇక నిరుపమ్ సౌర్య మంచితనం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న కొడుకుని రెడీ అవమని చెబుతుంది. హిమకి బదులు శోభని పెళ్లి చేసుకోమని ఆర్డర్ వేస్తుంది స్వప్న. అయినా నిరుపమ్, హిమని తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనంటాడు. అప్పుడే ఓ లెటర్ తీసుకొచ్చి నిరుపమ్ చేతిలో పెట్టి అది చదివిన తర్వాత అతని నిర్ణయం చెప్పమని అంటుంది స్వప్న. ఆ తర్వాత నిరుపమ్ పెళ్లి కొడుకులా తయారై వస్తాడు. అది చూసి చాలా ముచ్చట పడుతుంది స్వప్న. అస్సలు ఆ లెటర్‌లో ఏముంది.. నిరుపమ్ ఎవరినీ పెళ్లి చేసుకుంటాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే..