BRS Party: తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ పార్టీ మరల అధికారంలోకి వచ్చే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహత్మక రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీని ఎలా అయినా కూడా అధికారానికి దూరం చేసి తాము గద్దె ఎక్కాలని బిజెపి పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దీంతో రెండు పార్టీల మధ్య తెలంగాణ రాజకీయాలలో వేడి రాజుకుంది. ఎవరికివారు తమ వ్యూహాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. కెసిఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్ష పార్టీలు తమ క్యాడర్ కి చెబుతున్నాయి.
అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళదని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ఇలాంటి ప్రచారాలను తెరపైకి తీసుకొస్తున్నాయని పార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో తెలియజేశారు. అలాగే పూర్తి సమయం పూర్తయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని కెసిఆర్ క్లారిటీ ఇచ్చారు. నాయకులందరూ కూడా నియోజకవర్గాలలోకి వెళ్లి ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలని సూచించారు.
ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షాల కుట్రలో పావులు కావద్దని హితవు పలికారు. టిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే విధంగా కేంద్రంలో బిజెపి పార్టీ అడ్డమైన కేసులను నమోదు చేస్తూ ఉందని కేసీఆర్ అన్నారు. ఒక్క నాయకుడిని టార్గెట్ చేస్తూ ఇప్పుడు తన కూతురు వరకు బిజెపి వచ్చిందని అన్నారు. రేపు తన కుమార్తెను అరెస్టు చేసే అవకాశం ఉందని కూడా కేసీఆర్ పార్టీ నాయకులకు తెలియజేశారు. అయితే బిజెపి ఎన్ని కుట్రలు చేసిన పోరాటాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదని కెసిఆర్ అన్నారు.