Keerthi suresh సక్సెస్ వచ్చిందంటే చాలు హీరోయిన్ల రేంజ్‌మారిపోతుంది. దీంతో అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో బిజీ అయిపోతారు ముద్దుగుమ్మలు. అయితే ఆ హీరోయిన్ మాత్రం పాన్ ఇండియా సినిమాను వద్దని పక్కకు పెట్టేసింది. దీంతో ఎందుకిలా చేసిందంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం సరైందేనా.
కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాల నటిగా ఆమె అందరికీ సుపరిచితురాలే. ఆ తర్వాత హీరోయిన్‌గా ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. మహా నటి సినిమాలో అందరూ సావిత్రిని కీర్తి రూపంలో చూసుకున్నారంటే ఆమె నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారు కీర్తి సురేష్. ఆ తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అయిపోయిందీ అమ్మడు.
ఇటీవల ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి నటించిన సర్కారు వారి పాట మంచి హిట్ సాధించడంతో ఆమె రేంజ్ పెరిగిపోయింది. దీంతో మరిన్ని ఆఫర్లు ఆమెను వరిస్తున్నాయి. ఇప్పుడీమె హీరో నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తోంది. అలాగే మెగాస్టార్‌కి చెల్లెలిగా భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశాన్ని ఆమె వదులుకున్నారని తెలుస్తోంది. ఆయన డైరెక్ట్ చేస్తున్న పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఇప్పటికే విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తి నటిస్తున్నారు. దీంతో వీరితో కలిసి సినిమాలో నటించేందుకు కీర్తికి ఆఫర్ వచ్చిందట. ఈ ఆఫర్ కు ఆమె నో చెప్పడంతో త్రిషను ఎంపిక చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
పాన్ ఇండియా సినిమాను ఆమె వదులుకోవడంతో ఫ్యాన్స్ హర్టవుతున్నారు. ఈ ప్రాజెక్టులో నటించింటే ఆమె రేంజ్ మారిపోయేదని చర్చించుకుంటున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అన్నాత్తేలో నటించేందుకు కీర్తి సురేష్ పాన్ ఇండియ సినిమాకు నో చెప్పిందని తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లెలిగా కీర్తి నటిస్తోంది. ఈ సినిమా పెద్దన్న పేరుతో తెలుగులో విడుదలవ్వనుంది. మరి పాన్ ఇండియా సినిమాను కాదని కీర్తి తీసుకున్న నిర్ణయం ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.