Kerala Court : మైనర్ అయినా తన కుమార్తెపై పదేపదే అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చేలా చేసిన వ్యక్తికి మూడు జీవిత ఖైదులను కేరళ కోర్టు విధించింది. అత్యాచారం, తీవ్రమైన లైంగిక వేధింపులతో పాటు భారతీయ శిక్షాస్మృతి లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే పోక్సో చట్టం కింద బాధితురాలిని బెదిరించడం వంటి నేరాలకు మంజేరి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజేష్ కే ఈ శిక్షను విధించారు. ప్రాసిక్యూటర్ సోమసుందరన్ ఈ విషయాన్నీ మీడియా కు తెలిపారు. సదరు దోషి జీవితాంతం జైలు లో ఉండేలా కోర్ట్ శిక్ష వేసిందన్నారు.
అంతేకాదు కోర్టు అతనికి రూ. 6.6 లక్షల జరిమానా కూడా విధించింది.

2021 మార్చిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తొలిసారి 15 ఏళ్ల బాలికపై అత్యాచార ఘటన జరిగిందని ఎస్పీపీ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ఆన్లైన్ తరగతుల నిమిత్తం బాలిక ఇంట్లోనే చదువుకుంటోంది. ఆమె తండ్రి ఆమెను తన బెడ్రూమ్లోకి లాగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడని ప్రాసిక్యూటర్ చెప్పారు.బాధితురాలు అభ్యంతరం చెప్పడంతో ఆమె తల్లిని చంపేస్తానని బెదిరించాడని ఎస్పీపీ తెలిపారు.

దోషి గతంలో మద్రాస్ లో ఉపాధ్యాయుడు గా ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో, అక్టోబర్ 2021 వరకు అనేక సందర్భాల్లో తన కుమార్తెపై అత్యాచారం చేశాడు. నవంబర్ 2021లో ఆఫ్ లైన్ తరగతులు పునఃప్రారంభమైనప్పుడు, బాధితురాలు పాఠశాలకు వెళ్లడం ప్రారంభించింది . ఆ సమయంలో ఆమెకు కొంత కడుపునొప్పి వచ్చింది, ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు, కానీ ఏమీ కనుక్కోలేక పోయారు. జనవరి 2022లో ఆమె కడుపు నొప్పి వస్తోందని మళ్ళీ చెప్పినప్పుడు , ఆమెను ప్రభుత్వ వైద్య కళాశాలకు తీసుకెళ్లారు, అక్కడ ఆమె గర్భవతి అని తెలుసుకున్నారు. ఆ సమయంలో బాలిక తన తండ్రి చేసిన దుర్మార్గాలను తెలిపింది .అనంతరం పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి తండ్రిని అరెస్టు చేశారు.
బాధితురాలి గర్భాన్ని వైద్యపరంగా తొలగించారు. ఆమె పిండం, బాలిక తండ్రి యొక్క DNA నమూనాలను సేకరించారు. డీఎన్ఏ విశ్లేషణలో బాలిక తండ్రి నేరస్థుడని రుజువైనట్లు ఎస్పీపీ తెలిపారు. నిందితుడిని దోషిగా నిర్ధారించడంలో డీఎన్ఏ ఆధారాలతో పాటు బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలు కీలకంగా ఉన్నాయని తెలిపారు.