Kissing competition : చదువులో పోటీ పడాల్సిన విద్యార్థులు ముద్దుల పోటీల్లో పోటీ పడుతున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఒక అబ్బాయి, అమ్మాయి ముద్దు పెట్టుకుంటే సహ విద్యార్థులు ఎంకరేజ్ చేయడం. ఈ రచ్చనంతా వీడియో తీసి కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇంత వైరల్ అయ్యాక పోలీసులకు చేరకుండా ఉంటుందా? పోలీసులకు చేరడం.. ఒకరిని అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.
Kissing competition : పోలీసులకు చేరిన వీడియో
అసలు విషయంలోకి వెళితే.. కర్ణాటకలో ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులు ఈ ముద్దుల పోటీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులంతా ఓ ప్రైవేటు అపార్ట్మెంటుకు చేరుకుని మరీ ఈ ముద్దుల పోటీ నిర్వహించారు. కళాశాల యూనిఫాంతోనే ఇద్దరు విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. తోటి స్నేహితులంతా వారిని ఉత్సాహపరుస్తుండగా పోటీలు పడి మరీ ముద్దులు పెట్టుకున్నారు. దీనినంతా వీడియో తీసి విద్యార్థులు వాట్సాప్లో షేర్ చేశారు. అది కాస్తా పోలీసులకు చేరింది. వీడియో తీసిన బాలుడిని అరెస్ట్ చేసి విచారించి అనంతరం వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. విద్యార్థులు ముద్దుల పోటీ నిర్వహించినట్లు కర్ణాటక పోలీసులు చెప్పారు.
వీడియో తీసిన బాలుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదని.. ఆరు నెలల క్రితం ఓ ప్రైవేట్ ఫ్లాట్లో జరిగిందని బెంగుళూరు నగర పోలీసు కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. వారం రోజుల క్రితం విద్యార్థి ఒకరు వాట్సాప్లో వీడియో పెట్టగా, అది వైరల్గా మారింది. ఈ వీడియో కళాశాల అధికారుల దృష్టికి సైతం వెళ్లడంతో వారు విద్యార్థులను హెచ్చరించి వారిని కళాశాల నుంచి సస్పెండ్ చేశారు. కళాశాల అధికారులుగానీ, తల్లిదండ్రులుగానీ ఇప్పటి వరకూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదని కమిషనర్ చెప్పారు. ముద్దుల పోటీ నిర్వహించే సమయంలో విద్యార్థులు డ్రగ్స్ వాడారా లేదా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులు ముద్దుల్లో మునిగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నగరంలోని కళాశాల అధికారులు, తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారింది.