Kota Srinivasara Rao: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఫేక్ బుక్, ట్విట్టర్ లలో వేగంగా ఫేమ్ అయిపోవాలని కొంతమంది ఇష్టానుసారంగా నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలకి లక్ష్యంగా చేసుకొనితప్పుడు కథనాలు సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే వీటిపై మరల సదరు సెలబ్రిటీలు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హీరో, హీరోయిన్స్ మధ్య అఫైర్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు. అలాగే కొంతమంది బ్రతికున్న సెలబ్రిటీలని చంపేస్తూ ఉంటారు. ఇది మరీ దారుణంగా తయారైంది.
తాజాగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ప్రచారం అయ్యాయి. ఒక్కసారిగా ఇవి వైరల్ అయిపోయాయి. బ్లూ టిక్ మార్క్ ఉన్న పేజీ నుంచి ఆ న్యూస్ సర్క్యులేట్ కావడంతో అందరూ నిజమనే భావించారు. అయితే దీనిపై మరల కోటా శ్రీనివాసరావు వీడియో విడుదల చేసి తాను చనిపోలేదని క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. తాను చనిపోయాననే వార్తను చూసి చాలా మంది ఆందోళనతో ఫోన్లు చేశారని ఆయన చెప్పారు. ఈ వార్త నిజమేనా అని నిర్ధారించుకోవడానికి ఈ ఉదయం పోలీసులు కూడా తన ఇంటికి వచ్చారని తెలిపారు.
తాను ఇంకా చనిపోలేదని… ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. బతికున్న తనను చంపేయకండి అని అన్నారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాను చనిపోయాననే తప్పుడు ప్రచారంతో తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎంతో ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. తాను ఉగాది పండుగ చేసుకోవడానికి రెడీ అవుతున్నానని తెలిపారు. అయితే ఇలాంటి తప్పుడు కథనాలు గతంలో చాలా మంది సెలబ్రిటీల మీద కూడా జరిగాయి. అప్పట్లో వారు మీడియా ముందుకి వచ్చో, వీడియోలు విడుదల చేసో వాటిని ఖండించారు.