అధికార పార్టీ వైసీపీలో రోజురోజుకి పెరిగిపోతున్న అసంతృప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలే నేరుగా అధిష్టానంపై ఆరోపణలు చేస్తూ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదిస్థానంపై కాస్త అసమ్మతి స్వరం వినిపిస్తే వెంటనే ఆ నాయకులపై వైసీపీ అధిష్టానం తన పవర్ ఉపయోగించుకొని నిఘా పెడుతుంది. వారు చేస్తున్న పనులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని నిర్ధారణకి వచ్చిన తర్వాత ఉద్వాసన చెబుతున్నాయి. ఇప్పటికే వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అదే పనిగా ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపించడంతో పాటు అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండటంతో అతనికి పార్టీలో ఉన్న అన్ని రకాల పదవులని తొలగించింది. నామమాత్రం ఎమ్మెల్యేగా అతనిని పరిమితం చేసింది.
పేరుకే వైసీపీలో ఉన్న కూడా ఆయన జగన్ వ్యతిరేక నాయకుడిగా ముద్ర పడిపోయింది. ఇక ఇప్పుడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే కోటంరెడ్డిశ్రీధర్ రెడ్డిని కూడా ఆనం దారిలోనే పంపించేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోతున్నా, హామీ ఇచ్చిన పనులు కూడా పూర్తి చేయలేకపోతున్నా అని కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అధికారుల తీరుని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు ఇవ్వడం లేదని అన్నారు. దీనిపై జగన్ రెడ్డిని కూడా కలిసి తన ఆవేదన చెప్పుకున్నారు.
అయితే కోటంరెడ్డి ఎప్పుడైతే విమర్శలు స్టార్ట్ చేసారో అప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంటలిజెన్స్ టీమ్ అతని మీద నిఘా పెట్టింది. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పడం విశేషం. కొంతకాలంగా నా మీద స్పై చేస్తున్నారని చెప్పారు. ఫోన్ ని ట్యాప్ చేసారని తెలిపాడు. వ్యక్తిగతంగా మాట్లాడుకునే స్వేచ్చ లేకుండా చేసారని విమర్శించారు. పార్టీకి మొదటి నుంచి అండగా ఉండి పనిచేస్తే తనకి మంత్రిపదవులు ఇవ్వకపోగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నా అని నిఘా పెట్టారు అంటూ వాపోయినట్లుతెలుస్తుంది. అయితే ఏం చేసుకున్నా తాను తగ్గేది లేదని కూడా కోటంరెడ్డి గట్టిగానే మాట్లాడుతున్నట్లుతెలుస్తుంది.