Liger Trailer : టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లైగర్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కింది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమా ద్వారా దక్షిణాదికి పరిచయం కాబోతోంది. ఈ మోస్ట్ అవైటెడ్ భారీ యాక్షన్ డ్రామా పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమాకు మాంచి క్యాచీ టైటిల్‌ను పెట్టి దానితోనే చాలా వరకూ సినిమాను పూరి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లగలిగాడు. మరోవైపు పూరికి ఈ చిత్రం మరో ‘పోకిరి’ అవుతుందనే టాక్ కూడా బాగానే నడుస్తుండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది.
Liger Trailer : నేషనల్ స్థాయి బాక్సర్‌గా ఎలా ఎదిగాడు?
ఈ ట్రైలర్‌ను బట్టి చూస్తే మన యంగ్ హీరో విజయ్ ఈ సినిమాలో నత్తితో కనిపిస్తున్నాడు. అయినప్పటికీ డైలాగ్స్‌తో సినిమా ట్రైలర్ హీట్‌ను పెంచేసింది. బాక్సర్‌గా విజయ్ అలరించబోతున్నాడు. దానికి తగ్గట్టుగా మంచి ఫిజిక్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ సినిమాలో విజయ్‌కు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తోంది. “ఒక లయన్‌కి టైగర్‌కి పుట్టిండాడు..క్రాస్ బ్రీడ్ సార్ వాడు” అంటూ రమ్యకృష్ణచెప్పిన డైలాగ్‌తోనే ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాను పూరి తక్కువ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఒక సాధారణ యువకుడు నేషనల్ స్థాయి బాక్సర్‌గా ఎలా ఎదిగాడు? నత్తి కారణంగా ఎలాంటి అవహేళనలు ఎదుర్కొన్నాడు? అతని విజయానికి తల్లి ఎలాంటి ప్రోత్సాహమిచ్చింది? వంటి ఆకట్టుకునే అంశాలతో సినిమా రూపొందింది. యాక్షన్ సీక్వెన్స్‌లలో విజయ్ దేవరకొండ చేసిన స్టంట్స్, ప్రముఖ బాక్సర్ మైక్‌టైసన్‌తో బాక్సింగ్ సన్నివేశాలు, అనన్యతో రొమాన్స్.. ఇలా ప్రతి సన్నివేశం మాస్‌కి పూనకాలు తెప్పిస్తుంది.
ఈ ట్రైలర్‌ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ విడుదల చేయగా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి అవగానే వ్యూస్ ఊపందుకున్నాయి. ఈ సినిమా తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఆగస్టు 25న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఈ సినిమా ఏ రేంజ్ సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తుందో మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.