తమిళంలో సూపర్ హిట్ అయిన చిన్న సినిమా లవ్ టుడేని అదే టైటిల్ తో తెలుగులో కూడా డబ్బింగ్ చేసి దిల్ రాజు విడుదల చేశారు. సరికొత్త కాన్సెప్ట్ తో లవ్ అండ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ జెనరేషన్ లో యువత ప్రేమ గురించి పూర్తిగా అవగాహన లేకుండా పెళ్లి వరకు వెళ్ళడం, తరువాత మళ్ళీ ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండలేక విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. భారత్ లో విడాకులు తీసుకుంటున్న యువత ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోతుంది. దీనికి కారణం ప్రేమించుకున్న అమ్మాయి, అబ్భాయి మధ్య సరైన అండర్ స్టాండింగ్ లేకపోవడం, అలాగే వారి మధ్య ఆకర్షణ తప్ప నిజంగా ఒకరకంటే ఒకరు గౌరవించుకునేంత ప్రేమ లేకపోవడమే కారణం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇదే పాయింట్ పట్టుకొని ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో అతనే హీరోగా లవ్ టుడే సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో కథ తీసుకుంటే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన హీరో, హీరోయిన్ కి తామిద్దరి సెల్ ఫోన్స్ మార్చుకొని ఒక రెండు రోజులు ఉండాలని తరువాత పెళ్లి చేసుకుంటామంటే కచ్చితంగా చేస్తామని హీరో తండ్రి కండిషన్ పెడతాడు. దానికి ఒప్పుకున్న ఇద్దరు సెల్ ఫోన్స్ మార్చుకుంటారు. తరువాత వ్యక్తిగత విషయాలు బయటపడటంతో ఒకరిని ఒకరు ఎలా ద్వేషించుకున్నారు.
అసలు ఫోన్స్ మార్చుకోవడంలో వారి వారిది ప్రేమకాదనే విషయాన్ని ఎలా అర్ధం చేసుకున్నారు అనే పాయింట్ చుట్టూ కథ నడుస్తుంది. ఇక సినిమా ఓ వైపు నవ్విస్తూనే, మరో వైపు ఆలోచింపజేస్తుంది. అలాగే ఎమోషనల్ ఎలిమెంట్స్ తో కూడా ఆకట్టుకుంటుంది. యూనివర్శల్ పాయింట్ కావడంతో ఈ మూవీ తెలుగులో కూడా యూత్ ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హీరో, హీరోయిన్స్, అలాగే సత్యరాజ్, రాధిక పెర్ఫార్మెన్స్ కథని ముందుకి నడిపించడంలో భాగా ఉపయోగపడింది. సినిమాలో డబ్బింగ్ వాసనలు అక్కడక్కడ ఉన్న కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది.