Mahasena Rajesh: మహాసేన మీడియా పేరుతో దళితుల హక్కుల కోసం సుదీర్ఘ కాలం నుంచి పోరాడుతున్న వ్యక్తి మహాసేన రాజేష్. ఇతను గత ఎన్నికలలో వైసీపీకి సపోర్ట్ చేశారు. ఆ పార్టీ కోసం విస్తృతంగా గోదావరి జిల్లాలలో ప్రచారం కూడా చేశారు. వైసీపీకి గోదావరి జిల్లాలలో కొంత మేరకు ఓటింగ్ పెరగడానికి అతను కారణం అయ్యాడని చెప్పొచ్చు. అయితే ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మహాసేన రాజేష్ వైసీపీకి గుడ్ బై చెప్పేశాడు. తరువాత తన సంస్థ ద్వారానే వైసీపీ వ్యతిరేక పోరాటాలు చేస్తున్నారు. నిత్యం యుట్యూబ్ ద్వారా వైసీపీకి వ్యతిరేక స్వరం వినిపిస్తున్నారు.
ఓ విధంగా చెప్పాలంటే వైసీపీని వెంటాడుతూ ఆ పార్టీ చేసే తప్పులని పదే పదే ఎత్తి చూపిస్తున్నారు. ఇక మహాసేన రాజేష్ చేసే వీడియోల ద్వారా దళిత వర్గాలలో ఆ పార్టీకి విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. ఈ నేపధ్యంలో రెండు, మూడు సార్లు అతనిని అక్రమ కేసులలో అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అలాగే వైసీపీ కార్యకర్తలు రాజేష్ పై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా టీడీపీ, జనసేనకి అనుకూలంగా మాట్లాడుతూ వస్తున్న అతను ఏదో ఒక పార్టీలో చేరుతాడని భావించారు.
ముఖ్యంగా జనసేన పార్టీలో రాజేష్ చేరుతాడని ప్రచారం నడిచింది. పవన్ కళ్యాణ్ కూడా ఓ సందర్భంలో రాజేష్ కి ఫోన్ చేసి మాట్లాడారు. నాగబాబు కూడా మహాసేన రాజేష్ గురించి సోషల్ మీడియాలో మంచిగా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఊహించని విధంగా అతను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించాడు. టీడీపీ నుంచి తనకి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ లభించడంతో ఆ పార్టీలోకి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
పార్టీ నుంచి తనకి ఆహ్వానం అందడంతోనే టీడీపీలో చేరుతున్నట్లు రాజేష్ మహాసేన కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే జనసేన పవన్ కళ్యాణ్ అంటే తనకి ఎప్పటికి అభిమానం ఉంటుందని రాజేష్ చెప్పడం కొసమెరపు. రాజేష్ టీడీపీలోకి వెళ్ళడంతో జనసేన కార్యకర్తలు అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. మరి దీనిపై అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.