: నెల్లూరులో అధికార పార్టీలో గత కొంతకాలంగా గందరగోళ వాతావరణం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నుంచి ఆనం రామనారాయణరెడ్డి బయటకి వచ్చారు. మరో వైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా రెబల్ ఎమ్మెల్యేగా మారిపోయారు. ఇక ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని కూడా నియోజకవర్గ ఇన్ చార్జ్ బాద్యతల నుంచి తప్పించి మరొకరికి అప్పగించారు.
అదే సమయంలో మేకపాటి చంద్రశేఖర్ రెండో భార్య ద్వారా పుట్టిన కుమారుడిని అనుకుంటూ ఒక యువకుడు తెరపైకి వచ్చాడు. గత కొన్ని రోజులుగా తనని కుమారుడుగా ఒప్పుకోవాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. తాను డిఎన్ఏ టెస్ట్ కి కూడా సిద్ధంగా ఉన్నా అంటూ చాలెంజ్ చేశాడు. అయితే అతను తన కొడుకు కాదంటూ మేకపాటి చంద్రశేఖర్ మీడియా ముఖంగా చెప్పారు.
తన కొడుకు కానివాడిని తాను ఎలా ఒప్పుకుంటా అని అన్నారు. ఈ వారసుడి రగడ మేకపాటి కుటుంబంలో తీవ్ర గొడవలకి కారణం అవుతుంది. చంద్రశేఖర్ రెడ్డి అన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కొంతకాలంగా ఇదే విషయంపై వైరం కూడా నడుస్తున్నట్లు తెలుస్తుంది. మరో వైపు ఉదయగిరి నియోజకవర్గ బాద్యతలని తన కుమార్తెకి అప్పగించాలని చూస్తున్నారు. కాని వైసీపీ చంద్రశేఖర్ కుటుంబంలో ఎవరికీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.
ఇన్నిరకాల ఒత్తిళ్ళ మధ్య తాజాగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారు. నెల్లూరు అపోలోలో అతనికి ట్రీట్మెంట్ అందించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, అయితే రెండు వాల్వ్ లు బ్లాక్ అయ్యాయని డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.