రాజధాని అంశం సుప్రీంకోర్టులో ఉండగా విశాఖ ఏపీకి ఏకైక రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించడం వెనుక కుట్ర దాగి ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. ఏపీ రాజధాని గురించి ఢిల్లీలో సీఎం మాట్లాడిన అంశంపై ఆయన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. జగన్ రెడ్డి ఇక సైకో ముఖ్యమంత్రి అని మేము మొదటి నుంచి చెబుతున్నాం అని ఇప్పుడు మరోసారి దానిని నిజం చేశారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఇప్పుడు విశాఖ రాజధానిగా మారబోతుంది నేను అక్కడే ఉంటాను అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ది పొందాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని విమర్శించారు. మూడు ముక్కల పేరుతో మూడు రాజధానుల డ్రామా అడుతున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపైన గాని లేదంటే వారి కుటుంబంపై గాని వ్యతిరేకత ప్రజల్లోకి వెళ్తుంది అనుకునే సమయంలో రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకోస్తారని, తద్వారా ఆ ఇష్యూని డైవర్ట్ చేసే కుట్ర అని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో చట్టం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు అని స్వయంగా హైకోర్టు చెప్పింది. దీనిని మేం కొట్టేస్తున్నాం అని హైకోర్టు చెప్పింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుని లెక్కచేయకుండా వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లడం జరిగింది.
అయితే సుప్రీం కోర్టులో స్టే ఇవ్వకుండానే ఇప్పుడు ఢిల్లీలో రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయడం దేనికి సంకేతం అని అన్నారు. వ్యవస్థలు అంటే అస్సలు లెక్కలేనితనంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని విశాఖపట్నం అని చెప్పారు. విశాఖలో ప్రజల ఆస్తులు దోచుకోవడానికి వైసీపీ రంగం సిద్ధం చేసుకుందని, ఇప్పటికే 40 వేల ఎకరాల భూములు దోచుకున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న సమయంలో ఇలా రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా కుట్ర దాగి ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు.